పవన్ కల్యాణ్ తో చంద్రబాబు సమావేశం, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
04 June 2024, 21:50 IST
- AP Assembly Election Results 2024 Live Updates: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 ఫలితాల లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు. నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓటమి పాలవుతున్నారో ఇక్కడ తెలుసుకోవచ్చు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపొందిన సీట్ల వివరాలు చూడొచ్చు.
రేపు దిల్లీకి చంద్రబాబు, ఎన్డీఏ మీటింగ్ కు హాజరు
టీడీపీ అధినేత చంద్రబాబు.. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీ వెళ్లనున్నారు. దిల్లీలో జరిగే ఎన్డీఏ మీటింగ్ లో చంద్రబాబు పాల్గోనున్నారు.
పవన్ తో చంద్రబాబు భేటీ, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
జనసేన పార్టీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, ఎన్డీఏ సమావేశంపై ఇరువురు నేతలు చర్చించారు.
ఏపీని అభివృద్ధి శకంలో నడిపించడానికి కట్టుబడి ఉన్నాం - అమిత్ షా
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించిన ఏపీ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ అద్భుతమైన విజయానికి కారణమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కార్యకర్తలను అభినందిస్తున్నానన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ, ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, రాష్ట్రాన్ని పురోగతి, అభివృద్ధి శకంలో నడిపించడానికి కట్టుబడి ఉందన్నారు. అందరం కలిసి రాష్ట్ర నూతన భవితవ్యాన్ని రూపొందిస్తామన్నారు.
ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏకు అసాధారణమైన మెజార్టీ ఇచ్చిన ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాయన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
చంద్రబాబు, పవన్ కు కేటీఆర్ అభినందనలు
ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజల సేవలో మీరిద్దరూ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ, సమస్యలను పరిష్కరించుకుంటూ, అభివృద్ధి పథం వైపు సాగుదామన్నారు.
సీఎం పదవికి జగన్ రాజీనామా
ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేశారు. ఫలితాలపై ఎన్నికల కమిషన్ ప్రకటన రాగానే తన రాజీనామా లేఖను గవర్నర్ కు జగన్ పంపనున్నారు.
ఇది కక్ష సాధింపు చేసే సమయం కాదు - పవన్ కల్యాణ్
చాలా చారిత్రాత్మకమైన రోజు ఈరోజు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన రోజు, జవాబుదారీ ప్రభుత్వం స్థాపిస్తామని చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు వచ్చిన గెలుపు కాదు, 5 కోట్ల ప్రజల కోసం పనిచేసేందుకు వచ్చిన గెలుపు అన్నారు.
ఈ ఫలితాలు ఊహించలేదు, సీఎం జగన్ భావోద్వేగం
YS Jagan : ఏపీ ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ భావోద్వేగం లోనైయ్యారు. కన్నీళ్లు ఆపుకుంటూ జగన్ ప్రసంగించారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేశామని, అవన్నీ ఎక్కడకు వెళ్లాయో తెలియలేదన్నారు. అన్ని తట్టుకుంటాం, మళ్లీ నిలబడతామని వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టో లోని 99 శాతం హామీలు అమలు చేశామన్నారు.
జనసేన అఖండ విజయం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది.
కుప్పంలో చంద్రబాబు విజయం
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు విజయం సాధించారు. కుప్పం నుంచి పోటీ చేసిన చంద్రబాబు, వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ పై 48,184 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మంగళగిరి టీడీపీ ఆఫీసుకు చేరుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ ఆఫీసుకు చేరుకున్న చంద్రబాబుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబు అభివాదం చేశారు.
చంద్రబాబు నివాసంలో సంబరాలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ లతో కలిసి కేక్ కట్ చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు చిరంజీవి అభినందనలు
ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ చంద్రబాబుకు, తన సోదరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు.
"డియర్ కల్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నవ్వు, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వే ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు.
గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పవన్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరారు.
మ్యాజిక్ ఫిగర్ దాటిన టీడీపీ కూటమి
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్ల మార్క్ దాటిపోయింది.
భారీ ఆధిక్యం దిశగా లోకేశ్
మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ గెలుపు దిశగా సాగుతున్నారు. 70 వేలకు పైగా మెజార్టీతో దూసుకుపోతున్నారు.
భూమా అఖిల ప్రియ విజయం
ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ విజయం సాధించారు.
పవన్ కల్యాణ్ కు వీర తిలకం దిద్దిన భార్య
పిఠాపురంలో 70వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్ కల్యాణ్ కు ఆయన సతీమణి అన్నా లెజ్నేవా వీర తిలకం దిద్దారు. భర్తకు హారతి పట్టి దిష్టి తీశారు. పవన్ గెలుపుతో జనసేన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు సీఎం స్టాలి్ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
కారుమూరి నాగేశ్వరరావు ఓటమి
తణుకు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధకృష్ణ విజయం సాధించారు.
50 మార్క్ దాటిన టీడీపీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ దూసుకెళ్తుంది. ప్రస్తుతం 51 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. మరో 86 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
పులివెందులలో జగన్ విజయం
పులివెందులలో జగన్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 59 వేల మెజార్టీ జగన్ విజయం సాధించారు.
కొడాలి నాని ఘోర ఓటమి
గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఘోర ఓటమి పాలైయ్యారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము కొడాలి నానిపై 51 వేల మెజార్టీతో విజయం సాధించారు.
హిందూపురంలో బాలకృష్ణ విజయం
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి కురబ దీపికపై బాలయ్య విజయం సాధించారు.
8 జిల్లాల్లో వైసీపీకి సున్నా సీట్లు
రాష్ట్రంలోని 8 జిల్లాల్లో వైసీపీ ఇంకా ఖాతా తెరలేదు. ఇప్పటి వరకూ 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది.
వైసీపీ కీలక నేతల వారసులు ఓటమి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వారసులు ఓటమి పాలయ్యారు. వైసీపీ కీలక నేతలు ఈసారి తమ వారసులను ఎన్నికల బరిలో దింపగా... వారంతా ఓటమి పాలయ్యారు. తిరుపతిలో భూమన కరుణకర్ రెడ్డి కూమరుడు అభినయ్ రెడ్డి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో ఓటమి పాలయ్యారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి ఓటమి పాలైయ్యారు. గంగాధర నెల్లూరు జిల్లాలో నారాయణ స్వామి కుమార్తె ఓటమి పాలైయ్యారు.
పవన్ కల్యాణ్ ఘన విజయం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ వైసీపీ అభ్యర్థి 69,169 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
31వేల మెజార్టీలో సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమలో 31వేల ఓట్ల మెజార్టీలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి
ఉండిలో రఘురామ విజయం
ఉండిలో మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజు విజయం సాధించారు.
చంద్రబాబుకు మోదీ ఫోన్
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. కూటమి విజయం సాధించడంపై చంద్రబాబుకు మోదీ అభినందనలు తెలిపారు
మరికాసేపట్లో రాజ్‌భవన్‌కు జగన్
ఏపీ సిఎం జగన్ మరికాసేపట్లో రాజ్‌భవన్ వెళ్లనున్నారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించనున్నారు.
చంద్రబాబుతో సిద్ధార్ధనాథ్ సింగ్ భేటీ
చంద్రబాబుతో బీజేపీ ఇన్చార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తల సంబరాలు జరుపుతున్నారు.
భారీ ఆధిక్యంలో సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో బీజెపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయం సాధించారు. ఏడవ రౌండ్ ముగిసే సమయానికి 20,700 మెజార్టీతో సుజనా ఆధిక్యతలో ఉన్నారు.
జూన్ 9న ప్రమాణ స్వీకారం
జూన్ 9న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కూటమి అభ్యర్థుల భారీ విజయం
ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయం నమోదు చేశారు. 34కి 34 స్థానాల్లో కొనసాగుతున్న కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. తూర్పు గోదావరి జిల్లాలో 19కి 19 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 15కి 15 స్థానాల్లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది.
ప్రతిపక్ష హోదాపై అనుమానాలు
వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కడంపై అనుమానాలు, ప్రతిపక్ష హోదాకు కావాల్సిన స్థానాలు 18, 18 కంటే తక్కువ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
గోరంట్ల బుచ్చయ్యకు 50వేల మెజార్టీ
రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
టీడీపీ చరిత్రలో అతిపెద్ద విజయం
తెలుగుదేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తోంది. 1994 విజయాన్ని సైతం టీడీపీ అధిగమించనుంది. దాదాపు 93 శాతం స్ట్రైక్ రేట్ తో టీడీపీ విజయం సాధించింది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో సైత టీడీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని నమోదు చేస్తున్నారు. 131 సీట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థులు ఉన్నారు. 19 చోట్ల జనసేన, 7 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నారు. 18 సీట్లకే వైసీపీ పరిమితమైంది.
50వేల ఓట్ల ఆధిక్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాజమండ్రి రూరల్ టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50958 ఓట్ల మెజార్టీ లభించింది.
మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఆధిక్యం
మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర 8395 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్య ఆధిక్యం
జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య ఆధిక్యం సాధించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుపై శ్రీరాం తాతయ్య విజయం సాధించేలా ముందుకు సాగుతున్నారు.
చంద్రబాబు ఇంటికి పోలీస్ ఉన్నతాధికారులు
చంద్రబాబు ఇంటికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో చంద్రబాబుకు భద్రత కల్పించేందుకు ప్రోటోకాల్ నిబంధనలను అధికారులు పరిశీలించారు.
టీడీపీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు
ఉండవల్లి నివాసం నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. స్పష్టమైన ఆధిక్యం దిశగా టీడీపీ అభ్యర్థులు పయనిస్తుండటంతో చంద్రబాబు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
22వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ముందంజలో కొనసాగుతున్నారు. - 22 వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్ ఉన్నారు.
కౌంటింగ్ హాల్ నుంచి కొడాలి నిష్క్రమణ
కౌంటింగ్ హాల్ నుంచి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిష్క్రమించారు.
8500ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్
పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఈవిఎం ఓట్ల లెక్కింపులో 8500ఓట్ల ఆధిక్యంలో పవన్ కొనసాగుతున్నారు.
122 స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఆధిక్యం
ఏపీలో 122 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 104 సీట్లలో స్పష్టమైన ఆధిక్యంలో తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు ఏపీలో పలువురు మంత్రులు ఓటమి బాటలో ఉన్నారు. మంత్రులు, మాజీ మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ వెనుకబడి ఉన్నారు. గాజువాకలో 7 వేల ఓట్లకు పైగా ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు.
కొత్తపేటలో టీడీపీ అభ్యర్ధి
కొత్తపేట టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు 1076 ఓట్ల తో ముందంజలో ఉన్నారు.
రామచంద్రాపురంలో కూటమి అభ్యర్థి ఆధిక్యం
రామచంద్రాపురం నుండి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మొదటి రౌండ్ లో 4000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు..
విశాఖలో కూటమి అభ్యర్థుల ముందంజ
విశాఖలో ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ముందంజలో ఉన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఏపీలో ఎంపీ స్థానాలో 10చోట్ల టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 3స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి ముందంజలో ఉన్నారు. తణుకు, పాలకొల్లులో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తాడేపల్లిగూడెం, నరసాపురంలో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. విశాఖ ఈస్ట్ లో వెలగపూడి ఆధిక్యంలో ఉన్నారు. ఆముదాలవలసలో కూన రవికుమార్ ఆధిక్యంలో ఉన్నారు. గాజువాకలో పల్లా శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రాజంపేట ఎంపీ స్థానంలో మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజ -25,384 ఓట్ల ఆధిక్యంలో పెమ్మసాని కొనసాగుతున్నారు.
పుంగనూరులో పెద్దిరెడ్డి వెనుకంజ
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి 80 స్థానాల్లో ఆధిక్యం
ఏపీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. రాయల సీమలో టీడీపీ కూటమికి అనూహ్య విజయాలు లభించాయి. ఉండిలో టీడీపీ అభ్యర్థి 6350 ఓట్ల ఆధిక్యం లభించింది. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు 1385 ఓట్లు ఆధిక్యం లభించింది.
తాడికొండలో తెనాలి శ్రవణ్‌కుమార్ ఆధిక్యం
తాడికొండ నియోజకవర్గంలో రెండవ రౌండ్ పూర్తి అయ్యేసరికి తెనాలి శ్రావణ్ కుమార్ 12వేల ఓట్ల మెజార్టీలో ఉన్నారు
మాచర్లలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం
మాచర్ల నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటిబ్రహ్మారెడ్డి 802 ఓట్ల మెజారిటీతో అధిక్యం ఉన్నారు. గురజాల టీడీపి యరపతినేని శ్రీనివాసరావు అభ్యర్థి 1590 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు
కౌంటింగ్ కేంద్రం నుంచి మార్గాని భరత్ నిష్క్రమణ
కౌంటింగ్ కేంద్రం నుంచి వైసీపీ అభ్యర్ధి మార్గాని భరత్ నిష్క్రమించారు.
హిందూపురంలో బాలకృష‌్ణ ఆధిక్యం
హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో 1,880 ఓట్ల ఆధిక్యంలో బాలకృష్ణ ఉన్నారు.
కొడాలి నాని వెనుకంజ
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు. వెనిగండ్ల రాము ఆధిక్యంలో ఉన్నారు.
పశ్చిమగోదావరిలో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం
తణుకులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ముందజలో ఉన్నారు. తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు ముందంజలో ఉన్నారు. నరసాపురంలో జనసేన ఎమ్మేల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ముందంజలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
పెద్దాపురంలో టీడీపీ ఆధిక్యం
కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం లో మొత్తం పోస్టల్ ఓట్లు లెక్కింపు పూర్తి అయింది. సుమారు 1851 ఓట్లలో టీడీపీ అభ్యర్థి చిన రాజప్పకు 1500 ఓట్లు పోలయ్యాయి.
విశాఖలో జనసేన ఆధిక్యం
విశాఖ సౌత్‌లో జనసేన సౌత్ అభ్యర్థి వంశీకృష్ణకు 816 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కావలిలో వైసీపీ అభ్యర్ధి ఆధిక్యం
కావలిలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి 3,550 ఓట్ల ఆధిక్యం లభించింది. రాజమండ్రి రూరల్ 3వ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరికి 4,905 ఓట్ల ఆధిక్యం లభించింది.
తెనాలిలో నాదెండ్ల మనోహర్
తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు.
నగరిలో రోజా వెనుకంజ..
చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజా వెనుకబడ్డారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రోజా వెనుకబడ్డారు.
రాజమండ్రి నగరంలో ఆదిరెడ్డి వాసు ఆధిక్యం
రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ముందంజలో ఉన్నారు.
మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యం
మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో లోకేష్ ముందంజలో ఉన్నారు.
ఉండిలో రఘురామకు ఆధిక్యత
ఉండి అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణం రాజు ఆధిక్యంలో ఉన్నారు.
బొత్స సోదరులకు ఆధిక్యం
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్ససత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. గజపతి నగరంలో బొత్స అప్పలనర్సయ్య లీడ్‌లో ఉన్నారు.
28స్థానాల్లో టీడీపీ ఆధిక్యం.
ఏపీలో 28 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఆధిక్యంలో ఉంది. 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
నెల్లూరు సిటీలో
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ ఆధిక్యంలో ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ ముందంజ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
గజపతి నగరంలో టీడీపీ అభ్యర్ధి ముందంజ
విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజవర్గంలో టీడీపీ అభ్యర్థి ముందున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో 1300 ఓట్లతో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ముందున్నారు.
పోస్టల్ బ్యాలెట్లో చంద్రబాబుకు ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ అధినేత చంద్రబాబు 1,549 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాసేపట్లో ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది.
పిఠాపురంలో పవన్ ఆధిక్యం
పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నారు.
బుచ్చయ్యకు 5795 ఓట్ల ఆధిక్యం
రాజమండ్రి రూరల్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 5795ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
రాజమండ్రిలో
రాజమండ్రి గ్రామీణ నియోజక వర్గంలో 910 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ఉన్నారు.
కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం
కుప్పంలో 1549 ఓట్లతో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు.
వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల నివాళులు
ఇడుపుల పాయలోని YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించి కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల కౌంటింగ్ కేంద్రానికి బయలు దేరారు.
తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్‌లు
రాష్ట్ర వ్యాప్తంగా ఈవిఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో అధికారులు తెరుస్తున్నారు. మే 13వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈవిఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. దాదాపు 20రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు కోసం స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచారు.
అమలాపురంలో అత్యధిక రౌండ్లు
అమలాపురం పార్లమెంటుకు 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. రాజమండ్రి, నరసాపురం లోక్ సభ నియోజకవర్గాల్లో 13 రౌండ్లు, భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లలో ఫలితాలు వెలువడతాయి. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వర్లు రాష్ట్రానికి వచ్చారు.
కౌంటింగ్‌కు ముందే ఏజెంట్‌కు గుండె నొప్పి
పల్నాడు జిల్లాలో కౌంటింగ్‌కు ముందే టీడీపీ ఏజెంట్ గుండెపోటుకు గురయ్యాడు. కాకాని జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ కు గుండెపోటుకు గురయ్యాడు. చిలకలూరిపేట నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రంలో ఆరో టేబుల్ వద్ద ఉన్న టీడీపీ ఏజెంట్ రమేష్ అస్వస్థతకు గురయ్యాడు. రమేష్ కు గుండెనొప్పి రావడంతో వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
కాసేపట్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తం పోలైన 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా లెక్కించనున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 EVM టేబుళ్లు - పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 443 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 557 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వర్లను నియమించారు.
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కృష్ణా ఎస్పీ
మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం వద్ద కౌంటింగ్ కేంద్ర బందోబస్తు ఏర్పాట్లను, తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పోలీస్ శాఖ పరంగా తీసుకున్న బందోబస్తు ఏర్పాటుల ను, సీసీ కెమెరాలను నిర్వహణను, పికెట్ పాయింట్లను, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లను తప్పనిసరిగా బ్రీత్ ఎనలైజర్స్ తో పరీక్షించిన మీదట అనుమతించాలని, ఎవరికి కేటాయించిన పాయింట్ల వద్ద వారు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ లోనికి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని సూచించారు.
కార్యకర్తలు గొప్ప పోరాట స్ఫూర్తి చాటారన్న సిఎం జగన్
ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారని ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంగళవారం జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించాలని, మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నానని సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ఉదయం 5 గంటలకే కూటమి నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో బీజేపీ నేత పురందేశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని బాబు సూచించారు. - లెక్కింపులో ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆర్వోకు ఫిర్యాదు చేయాలని, అన్ని రౌండ్లు పూర్తయ్యేవరకు ఏజెంట్లు బయటకు రావొద్దని సూచించారు. కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్‍ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలని, ప్రతి ఏజెంట్ 17-సీ ఫామ్ దగ్గర ఉంచుకోవాలని, - పోలైన ఓట్లు, కౌంటింగ్‍లో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్లకు సూచించారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఈవిఎంల లెక్కింపు ప్రారంభిస్తారు.
సంబరాలకు బ్రేక్
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత ఆర్వో నుంచి ధృవీకరణ అందుకుని కౌంటింగ్ కేంద్రం నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ర్యాలీలు, టపాకాయలు పేల్చడం వంటివి చేస్తే పోలీస్ కేసులు నమోదు చేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
కోడ్ ఉల్లంఘనలపై భారీగా కేసులు నమోదు
ఏపీలో ఎన్నికల్ కోడ్ ఉల్లంఘనపై మొత్తం 11,249 కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 1,270 కేసులను నమోదు చేయగా, ఎన్నికల హింసలో ఇద్దరు మృతిచెందారు. 912 మందికి గాయపడ్డారు. ఎన్నికల హింస సందర్భంగా రూ.1,19,13,650 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. ఈ కేసులో 1,03,461 మందిని బైండోవర్ చేశామని.. అల్లర్లు సృష్టించే 551 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.
సి-విజిల్ ద్వారా 24,557 ఫిర్యాదులు అందగా అందులో 95 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ అనంతరం హింసను నివారించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కార్టన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించామని.. సమస్యాత్మకమైన 1,985 ప్రాంతాలను గుర్తించి అక్కడ సోదాలు నిర్వహించారని ఆయన తెలిపారు.
ఏపీలో ఎన్నికల్లో భారీగా నగదు, సొత్తు స్వాధీనం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో జనవరి 1 నుంచి జూన్ 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా రూ.170 కోట్ల నగదు, రూ.61.66 కోట్ల విలువైన లిక్కర్, రూ.35.97 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.29.34 కోట్ల విలువైన ఉచితాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
నారా వారిపల్లిలో పోలీసుల తనిఖీలు
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ వద్ద అదనపు బలగాలను మొహరించారు.
కౌంటింగ్‌కు భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 45వేల మంది పోలీసులతో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 కంపెనీల అదనపు బలగాలను మొహరించారు.
ఆర్వో సంతృప్తి చెందితేనే రీ కౌంటింగ్
తుది ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆర్వోను రీ కౌంటింగ్ కోరవచ్చు. అభ్యంతరాలపై ఆర్వో సంతృప్తి చెందితేనే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారు.
అల్లర్లకు పాల్పడితే అంతే సంగతులు
ఏపీలో కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసను దృష్టిలో ఉంచుకుని పోలీసులకు ఈసీ స్పష్టమైన ఆదేశాల జారీ చేసింది. కౌంటింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నించినా, అల్లర్లు, ఘర్షణలకు దిగినా వారిని వెంటనే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుంది ఇలా…
ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లోని 'రూల్ 54ఏ' ప్రకారం.. పోస్టల్ బ్యాలెట్ పేపర్లను తొలుత లెక్కిస్తారు. ఆర్వో టేబుల్ వద్ద లెక్కింపు మొదలు పెడతారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాతే ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్రారంభించాల్సి ఉంటుంది.
ఎక్కడైనా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు లేకుంటే నిర్దేశించిన సమయానికే ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలుపెట్టాల్సి ఉంటుంది. కౌంటింగ్‌కు ఫారం 17సీతోపాటు ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్ (సీయూ) మాత్రమే లెక్కింపుకు అవసరం.
కంట్రోల్ యూనిట్ నుంచి ఫలితాన్ని నిర్ధారించే ముందు.. పేపర్ సీల్ చెదిరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అనంతరం మొత్తం పోలైన ఓట్లను.. ఫారం 17సీలో పేర్కొన్న సంఖ్యతో సరిపోల్చాల్సి ఉంటుంది. లెక్కింపు తర్వాత ఆ ఫలితాన్ని తొలుత కౌంటింగ్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాలి.
ప్రతి కంట్రోల్ యూనిట్‌లో అభ్యర్థి వారీగా వచ్చిన ఫలితాన్ని ఫారం 17సీలోని పార్టు-2లో నమోదు చేస్తారు. కంట్రోల్ యూనిట్‌లోని డిస్‌ప్లే ప్యానెల్‌పై ఒకవేళ ఫలితం కనిపించకపోతే అన్ని యూనిట్లలో లెక్కింపు పూర్తైన తర్వాత మిగిలిన సీయూకు సంబంధించిన వీవీ ప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలి.
ఉమ్మడి పశ్చిమ గోదావరిలోనే తొలి ఫలితాలు
ఏపీలో 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తుది ఫలితాలు వెలువడనున్నాయి. కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తొలి ఫలితాల ప్రకటన ఉంటుంది. రెండు చోట్ల అత్యల్పంగా 13 రౌండ్లలోనే ఫలితం తెలిసిపోతుంది.అత్యధికంగా భీమిలి, పాణ్యం నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉండడంతో ఫలితాలు వెలువడడానికి 9 నుంచి 10 గంటలు పట్టే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం, నరసాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ ఫలితాల వెల్లడికి ఐదు గంటల సమయం పడుతుంది. అమలాపురం పార్లమెంటులో లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది. ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు 9 గంటల సమయం పడుతుంది. సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఫలితం తేలుతుంది.
111 నియోజకవర్గాల్లో 5 గంటల్లోనే ఫలితాలు
రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ మొదలైన ఐదుగంటల్లోనే 111 అసెంబ్లీ నియోజక వర్గాల ఫలితం తేలనుంది. వీటిలో 20 రౌండ్ల లోపే తీర్పు తెలిసిపోతుంది. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకుపైగా కౌంటింగ్ సాగనుంది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో 102 నియోజకవర్గాల్లో 1 నుంచి 2 రౌండ్లు, 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్ల కౌంటింగ్ జరుగనుంది. .
ఒక్కో రౌండ్ ఫలితాలకు 20- 25 నిమిషాలు
ఈవిఎంలలో ఓట్ల లెక్కింపుకు సగటున 25నిమిషాల సమయం పడుతుంది. మొదటి రౌండ్ ఫలితం వెల్లడికి మాత్రం 30నుంచి 35 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి 20-25 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వెలువడుతుంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఒక రౌండ్ ఫలితం వెలువడానికి 2 గంటల నుంచి రెండున్నర గంటల సమయం కూడా పడుతుందని అంచనా వేస్తున్నారు.
కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యేది ఇలా
మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ ప్రక్రియ ఎనిమిది గంటలకు మొదలై అరగంట కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి ఈవీఎల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లకు, ఈవీఎంలకు హాళ్లు వేరుగా ఉండవు. పార్లమెంటు నియోజకవర్గాల్లో వేర్వేరు హాళ్లు ఉండటంతో.. ఉదయం ఎనిమిది గంటల నుంచి అటు ఈవీఎంలు, ఇటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఒకేసారి మొదలు పెడతారు.
33 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 హాళ్లలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 2,446 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 557 టేబుళ్లు సిద్ధం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెల్ టేబుళ్లు ఏర్పాటుచేశారు. 25,209 మంది ఉద్యోగులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. 119 మంది అబ్జర్వర్లు, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ ప్రక్రియలో ఉంటారు.
పోస్టల్ బ్యాలెట్లలో కొత్త రికార్డు
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌తో ఓటెత్తారు. బ్యాలెట్ ద్వారా 5.15 లక్షలమంది అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 1.2 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 92 నుంచి 93 శాతం మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులు, అత్యసవర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు అత్యధికంగా 461,945 లక్షల మంది ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు 26,473 మంది (85శాతం), సర్వీసు ఓటర్లు 26,721 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీలో 81శాతం పోలింగ్
ఏపీలో మే 13న జరిగిన పోలింగ్‌లో 81శాతం పోలింగ్ నమోదైంది. ఈవీఎంలలో 3.33 కోట్ల ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,13,33,702 మంది ఓటర్లు ఉంటే వారిలో 3,33,40,560 మంది ఓటర్లు ఈవీఎంల్లో తమ తీర్పును భద్రపరిచారు. వీరిలో అత్యధికంగా మహిళలు 1,69,08684 మంది ఓటు వేశారు. పురుషులు 1,64,30,359 మంది, థర్డ్‌జెండర్లు 1517 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొవ్వూరు, నరసాపురం ఫలితాలు ఫస్ట్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజక వర్గాల ఫలితాలు మొదట వెలువడనున్నాయి.