తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cbn On Jagan Attack: జగన్‌పై దాడి కేసులో బొండా ఉమాను ఇరికించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు

CBN On Jagan Attack: జగన్‌పై దాడి కేసులో బొండా ఉమాను ఇరికించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు

Sarath chandra.B HT Telugu

17 April 2024, 13:24 IST

google News
    • CBN On Jagan Attack: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై గత శనివారం జరిగిన దాడి ఘటనలో  మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమాను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. 
జగన్‌పై దాడి కేసులో బొండా ఉమాను ఇరికిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం
జగన్‌పై దాడి కేసులో బొండా ఉమాను ఇరికిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం

జగన్‌పై దాడి కేసులో బొండా ఉమాను ఇరికిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం

CBN On Jagan Attack: సీఎం జగన్మోహన్‌ రెడ్డి Ys jaganపై రాయి దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ TDP టీడీపీ అభ్యర్థి బొండా ఉమాను ఇరికించే కుట్రలు చేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు.

దాడి వ్యవహారంలో నీచమైన డ్రామాలతో అధికార YCP పార్టీ అభాసుపాలయ్యిందని, వైసీపీ ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతోందని Chandrababu ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే Bonda Uma బోండా ఉమాను సిఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నానని చంద్రబాబు ప్రకటించారు. .

జగన్‌పై దాడి దర్యాప్తు విషయంలో తప్పు చేసే అధికారుల్ని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే వదిలే ప్రసక్తే లేదన్నారు.

‘‘ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్ది అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ వైఖరిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలతో వైసీపీ అభాసుపాలయ్యిందన్నారు.

హత్యాయత్నం అంటూ తెలుగుదేశం పార్టీపై బురద వేయాలని చేసిన ప్రయత్నాలను ప్రజలు ఛీ కొట్టడంతో ఆ పార్టీ పీకల్లోతు బురదలో కూరుకుపోయిందని, నాలుగు రోజులు గడుస్తున్నా పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయ లేకపోయారన్నారు.

జగన్‌పై దాడి కేసులో వీళ్లే నిందితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు తీసుకుపోయారని, దీనిపై ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయన్నారు. అసలు రాయి విసిరింది ఎవరు.. కారణాలు ఏంటి.. వాస్తవాలు ఏమిటో చెప్పకుండా మళ్లీ కుట్రలకు ప్రభుత్వం నీచపు ప్రయత్నాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పడం కోసం, నమ్మించడం కోసం పోలీసు శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, టీడీపీ ముఖ్యనేతలను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలనే పన్నాగంతో పావులు కదుపుతోందన్నారు.

నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలున్నట్లు చిత్రీకరించేలా విశ్వ ప్రయత్నాలు చేస్తోందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను కేసులో ఇరికించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

కీలక ఎన్నికల సమయంలో బోండా ఉమా ఎన్నికల ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తోందని ఈ ప్రభుత్వ చర్యలను, కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై బోండా ఉమాపై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా... జూన్ 4వ తేదీ తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో చాలా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘం కూడా అధికార దుర్వినియోగంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎంకు భద్రతను కల్పించడంలో విఫలమైన అధికారులను విచారణా బాధ్యతల నుండి తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణతో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని.’’ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

తదుపరి వ్యాసం