Attack On Jagan : సీఎం జగన్ పై దాడి చేసింది ఎవరు..? - ప్లాన్ ప్రకారమే స్పాట్ ను ఎంచుకున్నారా..?
14 April 2024, 10:37 IST
- Attack On CM YS Jagan : ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ పై దాడి జరిగింది. అయితే ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు. ఇందులో సీసీ పుటేజీ కీలకంగా మారినట్లు తెలిసింది.
దాడిలో గాయపడిన సీఎం జగన్
Attack On CM YS Jagan : ఎన్నికల ప్రచారంలో ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ పై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి విజయవాడలో జరిగిన ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పై దాడి జరగటం, ఈ ఘటనలో ఆయన నెదుటిపై గాయం కావటంతో ఈ దాడిని సీరియస్ గా తీసుకున్నారు రాష్ట్ర పోలీసులు. ఇప్పటికే అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. దాడిపై ప్రాథమికంగా ఓ అంచనా వచ్చినప్పటికీ… ఇప్పటివరకు సరైన ఆధారాలు లభించలేదు.
కీలకంగా సీసీ పుటేజీ...
జగన్ పై దాడి కేసులో సీసీ పుటేజీ కీలకంగా మారింది. ఇప్పటికే పరిసర ప్రాంతాలను క్లూస్ టీమ్ జల్లెడపడుతున్నాయి. విజయవాడ సెంట్రల్ పరిధిలోని సింగ్‌నగర్‌లో గంగానమ్మ గుడి సమీపంలో ఈ దాడి జరిగింది. ఇక్కడే ఓ ప్రైవేటు స్కూల్ కూడా ఉంది. దాడి జరిగిన సమయంలో కరెంట్ సరఫరా లేదు. అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ , గంగానమ్మ గుడికి మధ్యలో నుంచే రాళ్లు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటువైపు(ఎడమ) జనాలు తక్కువగా ఉండటంతోనే... దాడికి ఇక్కడ్నుంచి ప్లాన్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. రూట్ మ్యాప్ షెడ్యూల్ ను బట్టే..... ముందుగానే నిందితుడు ప్లాన్ చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరెంట్ లేకపోవటం దాడి చేసిన వ్యక్తికి కలిసివచ్చిందని అంటున్నారు. అయితే సమీపంలో ఉన్న సీసీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాడి చేసింది ఎవరనే దానిపై ఓ క్లారిటీకి రావాల్సి ఉంది.
భద్రతా వైఫల్యం…!
జగన్ పై దాడిని(Attack On Jagan) పలువురు ఖండించారు. అయితే భద్రతా వైఫల్యంపై పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీవీఐపీల భద్రత విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని… కానీ జగన్ యాత్రలో కొన్ని వైఫల్యాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా… సీఎం ప్రయాణిస్తున్న రూట్ లో విద్యుత్ లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. ప్రోట్ కాల్ ప్రకారం…. సీఎం షెడ్యూల్ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇక ఇటీవలే అనంతపురంలో చెప్పు విసిరిన వంటి ఘటన వెలుగు చూసింది. ఇదిలా ఉండగానే…. తాజాగా విజయవాడలో రాళ్ల దాడి జరగటంతో జగన్ భద్రతను రివ్యూ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గాయపడిన జగన్… ఇవాళ యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. యాత్ర పునఃప్రారంభంపై ఇవాళ లేదా రేపు వైసీపీ ప్రకటన చేయనుంది.
ఖండించిన ప్రధాని మోదీ, చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ పై(Attack On Jagan) జరిగిన దాడిని ప్రధానమంత్రి మోదీతో(Modi) పాటు పలువురు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు స్పందిస్తూ…. దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఈసీని కోరారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్ షర్మిల ట్వీట్…
“ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం.అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అంటూ షర్మిల(YS Sharmila) ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.