Cases On Pinnelli : సీఐపై దాడి ఘటన - పిన్నెల్లి సోదరులపై హత్యాయత్నం కేసు
26 May 2024, 7:13 IST
- Cases On Pinnelli Ramakrishna Reddy :పిన్నెల్లి సోదరులపై హత్యాయత్నం కేసు నమోదైంది. కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో వాంగ్మూలం సేకరించిన పోలీసులు… కొత్తగా కేసులు నమోదు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
Macherla MLA Pinnelli Ramakrishna Reddy : పోలింగ్ రోజు జరిగిన అల్లర్లలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని నిందితునిగా పోలీసులు చేర్చారు.
సీఐ వాంగ్మూలం మేరకు పోలీసులు ఆయనపై సెక్షన్ 307 నమోదు చేశారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ తర్వాత రోజున సీఐ నారాయణస్వామిపై కొంత మంది రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వం వహించారని ప్రధాన ఆరోపణ.
కారంపూడిలో టీడీపీ నాయకుడు తండా జాని అలియాస్ బొడ్డు, జైన్‌లపై దాడి చేసి వారి కారుకు వైసీపీ కార్యకర్తలు నిప్పంటించారని ఆరోపణలు ఉన్నాయి. వారిని అడ్డుకోవడానికి కారంపూడి సీఐ నారాయణస్వామి ప్రయత్నించారు. అయితే, పోలీస్ అధికారి అని కూడా చూడకుండా నారాయణస్వామిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారని సీఐ వాంగ్మూలంలో పేర్కొన్నారు.
తొలుత పది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్టు కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తనపై దాడి పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని సీఐ వాంగ్మూలం పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనపై వీఆర్వో-2 పలిశెట్టి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులతోపాటు మరో పది మందిపై 307, 332, 143, 147, 324, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పిన్నెల్లి సోదరులు గుట్టుచప్పుడు కాకుండా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఏజెంట్‌ను కొట్టిన కేసులో రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే ఒక 307 కేసు నమోదైంది.
ఈ నెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్ కేంద్రంలో దౌర్జాన్యానికి సంబంధించి టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసు పెట్టారు. పోలింగ్ కేంద్రంలో రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తున్న సందర్భంగా శేషగిరిరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనపై దుర్భాషలాడి, బయటకు లాగి మారణాయుధంతో తలపై దాడి చేశారు. ఈ దాడిలో శేషగిరిరావు తలకు ఆరు కుట్లు పడ్డాయి.
భయం గుప్పిట్లో వారం రోజుల తర్వాత అజ్ఞాతం వీడి.. టీడీపీ మాచర్ల అభ్యర్థి బ్రహ్మారెడ్డి, వర్ల రామయ్య, ఎస్టీ నేత ధారునాయక్‌లతో కలిసి ఆయన డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.