AP HC On EVM Vandalised Case : జూన్ 5 వరకు పిన్నెల్లిపై చర్యలొద్దు - ఏపీ హైకోర్టు ఆదేశాలు
Macherla EVM Vandalised Case Updates : ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట లభించింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
AP HC On EVM Vandalised Case : ఈవీఎం ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట దక్కింది. జూన్ 5వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది.
అసలేం జరిగింది….?
మే 13న పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం(202)లో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడం, పోలింగ్ ఏజెంట్ కు బెదిరింపులు, మహిళలను దుర్భాషలాడిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఈసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వెంటనే పిన్నెల్లిని అరెస్టు చేయాలని డీజీపీని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం గాలింపు చేపట్టారు.
10 సెక్షన్ల కింద కేసులు…
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై పోలీసులు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలోని 10 సెక్షన్లు పిన్నెల్లిపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈనెల 20న ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… ఇవాళ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు…. జూన్ 5వ తేదీ వరకు పిన్నెలిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో ఈ కేసులో పిన్నెల్లికి తాత్కాలిక ఊరట లభించింది.
మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 3వ తేదీన వెల్లడి కానున్నాయి. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల ఫలితాలు రానున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా… టీడీపీ కేవలం 23 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమిగా పోటీ చేయగా… వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. విజయంపై రెండు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి.