Macharla Mla Pinnelli: పిన్నెల్లి పాడుపని, మాచర్లలో యూపీ, బీహార్‌లను మించిపోయిన అరాచకం, బిగుస్తున్న ఉచ్చు
22 May 2024, 11:05 IST
- Macharla Mla Pinnelli: మాచర్ల నియోజక వర్గంలో పోలింగ్ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోలింగ్ బూత్‌లో చేసిన విధ్వంసంతో ఈసీ కన్నెర్ర చేసింది. పోలింగ్ రాత్రి పరారైన పిన్నెల్లి అచూకీ కోసం గాలింపు ప్రారంభించారు.
పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్‌లో పిన్నెల్లి విధ్వంసం
Macharla Mla Pinnelli: మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా తలెత్తిన అల్లర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లో చేసిన విధ్వంసం కెమెరాలకు చిక్కడంతో వైసీపీ చిక్కుల్లో పడింది. ఇన్నాళ్లు ప్రత్యర్థులే హింసకు కారణమని ఆరోపిస్తున్న ఆ పార్టీకి మాచర్ల ఎమ్మెల్యే నిర్వాకంతో కక్కలేని, మింగలేని పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పల్నాడు, చిత్తూరు, తిరుపతిలో జరిగిన అల్లర్లపై ఇప్పటికే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రమంతటా కార్డన్ సెర్చ్‌లను నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పిన్నెల్లి పోలింగ్ బూత్‌లో చేసిన విధ్వంసం బయటకు రావడంతో అంతా నివ్వెరపోయారు.
రెంట చింతల మండలం పాల్వాయి గేటు సమీపంలోని పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెబ్ క్యాస్టింగ్‌లో రికార్డు అయ్యాయి. ఎమ్మెల్యే స్వయంగా పోలింగ్ బూత్‌లో ఈవిఎంలను ధ్వంసం చేసినా సిబ్బంది ఎవరు ఆయనపై ఫిర్యాదు చేయలేదు. పోలీసులు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు నమోదు చేశారు.
పాల్వాయి గేట్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌గా ఉన్న శంకరయ్య ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు అతనిపై దాడి చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అతడిని వేలితో హెచ్చరిస్తూ బయటకు వెళ్లిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఏపీలో పోలింగ్ సందర్భంగా సున్నితమైన నియోజక వర్గాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలన్ని రికార్డు అయ్యాయి. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణల్లో ఎమ్మెల్యేను అడ్డుకున్న ఏజెంట్‌పై గొడ్డళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
పోలింగ్ ముగిసిన పది రోజుల తర్వాత వెబ్ క్యాస్టింగ్ కెమెరాల్లో ఎమ్మెల్యే అరాచకం బయటపడింది. వీడియోలను చూసిన పోలీస్ ఉన్నతాధికారులు బీహార్, యూపీల్లో ఈ తరహా అరాచకాలు ఉంటాయని వినడమే తప్ప తమ సర్వీసులో ఎప్పుడు చూడలేదని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను బీహార్ మాదిరి తయారు చేశారని పాల్వాయిగేటు బూత్ వీడియోలు చూసిన ఏపీ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాలను రాజకీయ నాయకులు తమ గుప్పెట పెట్టుకుని అక్రమాలకు పాల్పడటంపై బ్యూరోక్రాట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈసీ కళ్లకు గంతలు…
పాల్వాయిగేటు వీడియోలు వెలుగు చూసి వెంటనే ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల సంఘం అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నా క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నాలు చేశారు.
సున్నితమైన ప్రాంతాలు, ఆరోపణలు ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవడంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం చివరి నిమిషం వరకు ఉదాసీనంగా వ్యవహరించింది. ఎన్నికల్ని పర్యవేక్షించడానికి పోలీస్ అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్లుగా ఇతర రాష్ట్రాల అధికారుల్ని పంపినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో రాజకీయ నాయకుల పలుకుబడి ముందు కింద స్థాయి అధికార యంత్రాంగం ఎన్నికల సంఘానికి సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కింద స్థాయిలో డిఎస్పీలు మొదలుకుని ఎస్సైల వరకు తప్పుదారి పట్టించారనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగానే రెంటచింతలలోని పాల్వాయిగేటు 202 పోలింగ్ బూత్‌లో హింస జరిగింది.
మరోవైపు కార్యనిర్వాహక వ్యవస్థలో స్పష్టమైన చీలిక ఏర్పడినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే వారిని ప్రాధాన్యత లేని పోస్టింగుల్లో వేయడం, పార్టీలకు కొమ్ము కాసే వారిని తమకు కావాల్సిన చోట పోస్టింగులు ఇవ్వడంలో.. పాలనా యంత్రాంగాన్ని నడిపించే కీలకమైన వ్యక్తులు కుట్ర పూరితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్మెల్యేపై కేసు నమోదుకు సీఈఓ ఆదేశం…
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడంపై ఈసీ స్పందించింది. పీఎస్ నంబర్ 202 లో జరిగిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డు అయ్యారని ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈవీయంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారని, వీడియోలు పరిశీలించిన తర్వాత విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు ప్రకటించారు.
ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనాను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయకుండా కఠినంగా వ్యవహరించాలని ఈసీ ఆదేశించింది.