TDP Ticket Change : టీడీపీ కీలక నిర్ణయం, ఆ స్థానాల్లో అభ్యర్థుల మార్పు-ఉండి సీటు రాఘురామకే!
21 April 2024, 13:10 IST
- TDP Ticket Change : టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులు బీఫారమ్ లు అందజేశారు. అయితే నాలుగైదు స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తోంది.
టీడీపీ కీలక నిర్ణయం, ఆ స్థానాల్లో అభ్యర్థుల మార్పు
TDP Ticket Change : ఏపీ ఎన్నికల సమరానికి నామినేషన్ల(AP Election Nomination) ప్రక్రియ కొనసాగుతుంది. అయితే చివరి నిమిషం వరకూ పార్టీలు గెలుపు గుర్రాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించినప్పటికీ... విజయవకాశాలు, పొత్తుల్లో భాగంగా మార్పులు చేస్తున్నాయి. తాజాగా టీడీపీ(TDP) ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు సిద్ధం అయ్యింది. ఇవాళ టీడీపీ అభ్యర్థులకు అధినేత చంద్రబాబు బీ-ఫారాలు అందజేశారు. ఉండి(Undi), పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీ రఘురామకృష్ణరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎస్సీ సెల్ నేత ఎంఎస్ రాజు ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.
టీడీపీ అభ్యర్థులకు బీఫారమ్ లు
బీజేపీ, జనసేన(Janasena)తో పొత్తుల్లో భాగంగా... టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ...నాలుగైదు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తాయని సమాచారం. నియోజకవర్గాల్లో సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు(Chandrababu) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో చంద్రబాబు ఇవాళ అభ్యర్థులకు బీఫారమ్ అందజేశారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
ఉండి సీటు రఘురామకే
పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టీడీపీ ఖరారు చేసింది. అయితే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు(Raghurama Krishna Raju) టీడీపీలో చేరడం, పొత్తుల్లో భాగంగా నరసాపురం లోక్ సభ టికెట్ ను బీజేపీ (BJP)కేటాయించడంతో..ఉండిలో సమీకరణాలు మారాయి. దీంతో రఘురామకృష్ణంరాజుకు ఉండి సీటు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారు. రెబల్ గా బరిలో దిగుతున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు రఘురామకృష్ణరాజుకు మద్దతు ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఉండి టికెట్ రఘురామకు ఖరారు కావడంతో... ఇవాళ ఆయనకు బీఫారమ్ అందజేయనున్నారు. ఈ నెల 22న రఘురామ నామినేషన్(Nomination) దాఖలు చేయనున్నారు. పాడేరు టికెట్‌ను కిల్లు వెంకట రమేష్ నాయుడుకు కేటాయించగా, టీడీపీ శ్రేణులు మద్దతివ్వకపోవడంతో ...ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మాడుగుల నుంచి బండారుకు ఛాన్స్
పెందుర్తి (Pendurthi)టికెట్ ను జనసేనకు కేటాయించడంతో మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అసంతృప్తితో ఉన్నారు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో మాడుగుల స్థానాన్ని బండారుకు కేటాయించారు. మడకశిర(Madakasira) నుంచి ఎంఎస్ రాజును బరిలో దించే అవకాశం ఉంది. వెంకటగిరి స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేయగా... తాగా మార్పుల్లో అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించనున్నాయని తెలుస్తోంది. అలాగే దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థుల బీఫారమ్(B-Form) లను పెండింగులో పెట్టే అవకాశం ఉంది. అనపర్తి టికెట్ ను బీజేపీకి కేటాయించారు. టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి... అక్కడ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై స్పష్టత వచ్చాక అనపర్తి, దెందులూరు బీఫారమ్ లు ఇచ్చే అవకాశం ఉంది.