Janasena Glass Symbol : జనసేనకు ఈసీ ఊరట, ఆ స్థానాల్లో గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించమని స్పష్టం
01 May 2024, 14:36 IST
- Janasena Glass Symbol : గాజు గ్లాసు గుర్తు కేటాయింపులో జనసేనకు ఈసీ కాస్త ఊరటనిచ్చింది. జనసేన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఇతరులకు ఈ గుర్తు కేటాయించమని ఈసీ హైకోర్టుకు తెలిపింది.
గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు ఈసీ ఊరట
Janasena Glass Symbol : ఏపీలో కూటమి పార్టీలకు కాస్త ఊరటనిచ్చే విషయం చెప్పింది ఈసీ(EC). జనసేన గాజు గ్లాసు గుర్తు(Janasena Glass Symbol) కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ జరగగా...ఈ విషయంపై 24 గంటల్లో ఈసీ తన నిర్ణయాన్ని తెలియజేస్తుందని హైకోర్టు(AP High Court)కు ఈసీ న్యాయవాది చెప్పారు. తాజాగా బుధవారం ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు నివేదిక అందించింది. ఈ నివేదికలో జనసేన పార్టీ పోటీ చేసి ఎంపీ స్థానాల్లో(కాకినాడ, మచిలీపట్నం) అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని కోర్టుకు తెలిపింది. అదేవిధంగా జనసేన(Janasena) పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలోని పార్లమెంట్ స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించబోమని ఈసీ తెలిపింది. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఈ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించమని ఈసీ పేర్కొంది. దీంతో జనసేన ఇబ్బందులు తొలుగుతాయని ఈసీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వివరాలు నమోదు చేసుకున్న హైకోర్టు విచారణను ముగించింది.
ఆ స్థానాల్లో గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించం
అయితే తాము పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాకుండా మిగతా అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో (Assembly Constituencies)కూడా గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దని జనసేన(Janasena) హైకోర్టును అభ్యర్థించింది. గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో అలా అన్ని చోట్ల సాధ్యం కాదనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. ఈసీ నివేదిక మేరకు జనసేన పిటిషన్ పై విచారణను ముగించింది. అయితే ఈసీ నిర్ణయంపై జనసేనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీంతో జనసేనకు కాస్త ఊరట లభించినట్లైంది.
జనసేన పోటీ చేసే చోట కామన్ సింబల్
కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో(AP Elections) జనసేనకు గాజు గ్లాసు గుర్తును కామన్ సింబల్ (Common Symbol)గా కేటాయించింది. అంటే జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. అయితే గాజు గ్లాసు(Glass Tumbler) గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ (Free Symbol)జాబితాలో చేర్చింది. దీంతో ఈ సింబల్ కోసం స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులు పోటీ పడ్డారు. నామినేషన్ల(Nominations) విత్ డ్రా ముగిసిన అనంతరం అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయించారు. ఈ సమయంలో ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులకు కేటాయించారు. జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట్ల స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులకు అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం పడుతుందని భావించిన జనసేన హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ సమయంలో ఈసీ 24 గంటల్లో తమ నిర్ణయాన్ని తెలియజేస్తుందని కోర్టుకు తెలిపారు ఈసీ న్యాయవాది. ఇవాళ విచారణలో జనసేన ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించమని ఈసీ స్పష్టం చేసింది.
ఆందోళనలో కూటమి అభ్యర్థులు
ఈసీ తాజా నిర్ణయంతో జనసేన(Janasena)కు కాస్త ఊరట లభించింది. అయినా జనసేన అభ్యర్థులు లేని చోట్ల గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులకు కేటాయించడంతో...కూటమి అభ్యర్తులు ఆందోళన చెందుతున్నారు. ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.