Janasena Glass Symbol : జనసేన(Janasena)తో పాటు కూటమి పార్టీలకు మరో కొత్త సమస్య వచ్చింది. జనసేన గాజు గ్లాసు గుర్తు(Glass Symbol)ని ఆ పార్టీ పోటీలో లేని చోట ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో ఎన్నికల అధికారులు గాజు గ్లాసును రెబల్, ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. జనసేన, టీడీపీలో టికెట్లు రాని అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. వీరిలో చాలా మందికి గాజు గ్లాసు సింబల్ దక్కింది. దీంతో కూటమి అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లు గందరగోళానికి గురై...ఓట్లు తారుమారు అయ్యే ఛాన్స్ ఉందని, ఇది తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతోందని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సంఘం జనసేన పోటీ చేసే స్థానాల్లో మాత్రమే గాజు గ్లాసు గుర్తును కామన్ సింబల్ గా ప్రకటించింది. మిగిలిన చోట్ల ఫ్రీ సింబల్(Free Symbol) జాబితాలో పెట్టింది.
గాజు గ్లాసు గుర్తు(Janaena Glass Symbol) విషయంపై జనసేన పార్టీ మంగళవారం హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. ఈ సమస్యకు 24 గంటల్లో ఓ పరిష్కరం ఇస్తామని ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తున్నామని, ఈసీ గాజు గ్లాస్ గుర్తును కామన్ సింబల్(Common Symbol) ప్రకటించిందని జనసేన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ గుర్తును వేరే వాళ్లకు కేటాయిస్తే ఓటర్లలో గందరగోళం నెలకొంటుందని జనసేన న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్‌లో టీడీపీ ఇంప్లీడ్ అయ్యింది. ఒక పార్టీకి కేటాయించిన సింబల్ ను వేరే వాళ్లకు ఎలా కేటాయిస్తారని కోర్టు ఈసీ(EC)ని ప్రశ్నించింది. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారని, కానీ అక్కడే అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయించారని జనసేన కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ వివాదంపై 24 గంటల్లో క్లారిటీ ఇస్తామని ఈసీ కోర్టుకు తాజా ఉత్తర్వులు ఇస్తామని ఎన్నికల కమిషన్ న్యాయవాది స్పష్టం చేశారు.
సోమవారంతో నామినేషన్ల(Nominations) ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తుల కేటాయింపు చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 16 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాల్లో(Lok Sabha) స్వతంత్రులకు, రెబల్స్ కు గాజు గ్లాసు గుర్తు(Glass Symbol) కేటాయించినట్లు తెలుస్తోంది. నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి, బీజేపీ ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తు్న్న అనకాపల్లి, రాజమండ్రిలో ఇతరులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు. అలాగే జగ్గంపేట అసెంబ్లీ స్థానంలో జనసేన రెబల్ అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రకు గ్లాస్ సింబల్ కేటాయించారు. పెద్దాపురం, కాకినాడ సిటీ(Kakinada), రామచంద్రాపురం, కొత్తపేట, మండపేట, అమలాపురం, ముమ్మడివరం, కొవ్వూరు స్థానాల్లో ఇతర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. అయితే ఇదంతా వైసీపీ(Ysrcp) ప్రభుత్వ కుట్రలో భాగంగా జరుగుతోందని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. కూటమి అభ్యర్థుల ఓట్లు చీల్చేందుకు వైసీపీ, అధికారులతో కుమ్మకై గాజు గ్లాసు గుర్తు కోరుకోపోయినా అభ్యర్థులకు కేటాయిస్తుందని ఆరోపిస్తున్నారు.
సంబంధిత కథనం