AP DGP Harish Kumar Gupta : ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం, తక్షణమే విధుల్లోకి
06 May 2024, 17:24 IST
- AP DGP Harish Kumar Gupta : ఏపీ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. ఈ మేరకు సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా
AP DGP Harish Kumar Gupta : ఏపీ నూతన డీజీపీ(AP New DGP)గా హరీశ్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta)ను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించాలని ఈ మేరకు సీఎస్ కు జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. నిన్న ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(KV Rajendranath Reddy)పై ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం అయ్యారు. ఆయనను తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ(ECI) ఆదేశించింది. సాయంత్రం 5 గంటల లోపు అధికారికంగా బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ముగ్గురి ప్యానల్ ను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ ను ఆదేశించింది. దీంతో సీఎస్ ముగ్గురు సీనియర్ ఐపీఎస్(IPS) అధికారులు ద్వారకా తిరుమల రావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను సీఎస్ ఈసీకి సూచించారు. వీరిలో సీనియర్ ఐపీఎస్, 1992 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తా పేరును ఈసీ డీజీపీగా ఎంపిక చేసింది. హరీశ్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 లోపు ఆయన డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ
ఏపీ ఎన్నికల నిర్వహణకు ఈసీ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదులపై వేగంగా చర్యలు చేపడుతుంది. నిన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)ని బదిలీ చేయగా... తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammireddy)పై ఈసీ బదిలీ వేటు వేసింది. అమ్మిరెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఈసీ ఆదేశించింది. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని సీఎస్ జవహర్ రెడ్డిని(CS Jawahar Reddy) ఆదేశించింది.
ప్రతిపక్షాల ఫిర్యాదులతో చర్యలు
అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఈసీ(EC) బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల ఎస్పీ అన్బురాజన్(SP Anburajan)ను ట్రాన్స్ పర్ చేసిన ఈసీ.. తాజాగా డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammireddy)పై బదిలీ వేటు వేసింది. ఆయన తక్షణమే బాధ్యతులను దిగువ స్థాయి అధికారికి అప్పగించాలని ఆదేశించింది. ఆయనను వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని సీఎస్(CS) ను ఆదేశించింది. డీఐజీ అమ్మిరెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఈసీ ఈ మేరకు చర్యలకు తీసుకుంది. ఇటీవల అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌ను బదిలీ చేసిన ఈసీ... ఆయన స్థానంలో అమిత్ బర్దర్‌ను నియమించింది. అనంతపురం అర్బన్ డీఎస్పీగా ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు 10 మంది ఐపీఎస్ లపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. అధికార వైసీపీకి మద్దతుగా ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసింది.