World Cup 2023 Prize Money: ఓడిపోయినా కోట్లు కొల్లగొట్టిన టీమిండియా.. వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎవరికి ఎంతంటే?
20 November 2023, 10:38 IST
- World Cup 2023 Prize Money: వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓడిపోయినా టీమిండియాపై కోట్ల వర్షం కురిసింది. విజేతతోపాటు రన్నరప్, సెమీఫైనల్స్ లో ఓడిన జట్లకు భారీ ప్రైజ్ మనీ ఇచ్చింది ఐసీసీ.
వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
World Cup 2023 Prize Money: టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదన్న బాధ ప్లేయర్స్ తోపాటు కోట్లాది మంది అభిమానులను వేధిస్తూనే ఉంది. ఉంటుంది కూడా. అయితే ఫైనల్లో ఓడినా ప్రైజ్ మనీ రూపంలో మాత్రం ఇండియన్ టీమ్ తోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలకు భారీ మొత్తం దక్కింది. వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ఐసీసీ టోర్నీ ప్రారంభానికి ముందే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
టీమిండియా ప్రైజ్ మనీ ఎంతంటే?
వరల్డ్ కప్ ను ఆరోసారి గెలిచిన ఆస్ట్రేలియా భారీ ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. ఆ టీమ్ కు 4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.33.3 కోట్లు) ప్రైజ్ మనీగా దక్కడం విశేషం. ఇక ఫైనల్లో ఓడిపోయిన ఇండియన్ టీమ్ కు అందులో సగం అంటే 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.16.6 కోట్లు) దక్కాయి. వరల్డ్ కప్ లో వరుసగా పది మ్యాచ్ లు గెలిచి ఫైనల్ చేరిన ఇండియన్ టీమ్.. మరోసారి ఆ చివరి మెట్టు ఎక్కలేకపోయింది.
అయితే ఫైనల్లో ఓడినా 2 మిలియన్ డాలర్లు అందుకున్న ఇండియా.. అంతకుముందు లీగ్ స్టేజ్ లో విజయాలతోనూ భారీగానే సంపాదించింది. తొలిసారి ఈ వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ లో ప్రతి విజయానికి 40 వేల డాలర్ల ప్రైజ్ మనీని ఐసీసీ అనౌన్స్ చేసింది. ఆ లెక్కన లీగ్ స్టేజ్ లో అసలు ఓటమెరగని ఇండియన్ టీమ్ 9 విజయాలతో అదనంగా మరో 3.6 లక్షల డాలర్లు(సుమారు రూ.3 కోట్లు) అందుకుంది.
ఆ లెక్కన వరల్డ్ కప్ మొత్తంగా 23.6 లక్షల డాలర్లు (సుమారు రూ.19.5 కోట్లు) ప్రైజ్ మనీ రూపంలో టీమిండియాకు దక్కాయి. అంటే టీమ్ లోని ఒక్కో ప్లేయర్ 45 రోజుల టోర్నీలో సగటున ప్రైజ్ మనీ రూపంలోనే రూ.కోటి అందుకున్నారు. ఇక ఆస్ట్రేలియా ఫైనల్లో 4 మిలియన్ డాలర్లు, అంతకుముందు లీగ్ స్టేజ్ ద్వారా మరో 2.8 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా అందుకుంది.
అన్ని జట్లకూ ఎంతో కొంత?
సెమీఫైనల్లో ఓడిపోయిన సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టీమ్స్ కు కూడా భారీగా ప్రైజ్ మనీ దక్కింది. సెమీస్ లో ఓడిన రెండు జట్లకూ ఒక్కోదానికి 8 లక్షల డాలర్లు (సుమారు రూ.6.6 కోట్లు) ఇచ్చారు. ఇక లీగ్ స్టేజ్ లో 7 మ్యాచ్ లు గెలిచిన సౌతాఫ్రికాకు అదనంగా 2.8 లక్షల డాలర్లు దక్కగా.. ఐదు మ్యాచ్ లు గెలిచిన న్యూజిలాండ్ కు 2 లక్షల డాలర్లు వచ్చాయి.
ఈ వరల్డ్ కప్ లో ఒక్క టీమ్ కూడా ఉత్త చేతులతో ఇంటిదారి పట్టలేదు. లీగ్ స్టేజ్ లో ప్రతి టీమ్ కనీసం 2 మ్యాచ్ లలో గెలిచింది. అంటే చివరి స్థానంలో నిలిచిన నెదర్లాండ్స్ కు కూడా 80 వేల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లకు 1.6 లక్షల డాలర్లు, ఇంగ్లండ్ కు 1.2 లక్షల డాలర్లు, బంగ్లాదేశ్, శ్రీలంకలకు 80 వేల డాలర్లు దక్కాయి.