IND vs AUS World Cup Final 2023: విశ్వ విజేతగా ఆస్ట్రేలియా - వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా చిత్తు
IND vs AUS World Cup Final 2023: వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ట్రావిస్ హెడ్ అద్భుత శతకంతో ఆస్ట్రేలియాకు కప్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకు ఆలౌటైంది. ఆ టార్గెట్‌ను ఆస్ట్రేలియా మరో ఏడు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది.
IND vs AUS World Cup Final 2023: 2023 వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. ట్రావిస్ హెడ్ అద్భుత శతకంతో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకు ఆలౌటైంది. ఈ ఈజీ టార్గెట్‌ను ఆస్ట్రేలియా మరో ఏడు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది.
ఆరంభంలో టీమిండియా పేసర్లు బుమ్రా, షమీ చెలరేగడంతో ఆస్ట్రేలియా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. వార్నర్, మార్ష్, స్మిత్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. ట్రావిస్ హెడ్, లబుషేన్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచాడు. 95 బాల్స్‌లోనే శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. అతడికి లబుషేన్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి జోడీని విడదీసేందుకు టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.
షమీ, బుమ్రా మినహా మిగిలిన బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ హెడ్, లబుషేన్ పరుగులు రాబట్టారు. 120 బాల్స్‌లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 137 రన్స్ చేసి హెడ్ ఔటయ్యాడు. కానీ అప్పటికే ఆస్ట్రేలియా విజయం ఖాయమైంది. మ్యాక్స్‌వెల్‌తో కలిసి లబుషేన్ (58 రన్స్ నాటౌట్) ఆస్ట్రేలియాకు విక్టరీని అందించారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా యాభై ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 66, కోహ్లి 54, రోహిత్ శర్మ 47 రన్స్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియాకు ఇది ఆరో వరల్డ్ కప్ కావడం గమనార్హం.