KL Rahul dropped: రిస్క్ తీసుకోని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ చెప్పినా కేఎల్ రాహుల్ విషయంలో ససేమిరా!
24 October 2024, 10:16 IST
India's Playing XI For 2nd Test: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ 0, 150 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ చేసిన పరుగులు 0, 12 మాత్రమే. అయినప్పటికీ అతనికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. కానీ?
పుణె టెస్టులో కేఎల్ రాహుల్‌పై వేటు
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. పుణె వేదికగా గురువారం (అక్టోబరు 24) ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ తుది జట్టులో రోహిత్ శర్మ మూడు మార్పులు చేశాడు.
రాహుల్‌పై వేటుకి డిమాండ్
తొలి టెస్టులో ఫెయిలైన కేఎల్ రాహుల్‌పై వేటు వేయాలని చాలా మంది మాజీలు సూచించగా.. హెడ్ కోచ్ గంభీర్ మాత్రం రాహుల్‌కి మద్దతుగా నిలిచాడు. దాంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
తొలి టెస్టులో వీరోచిత శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించి కేఎల్ రాహుల్‌కి మళ్లీ రెండో టెస్టులో చోటిస్తే తీవ్ర విమర్శలు తప్పవని భావించిన రోహిత్ శర్మ.. రిస్క్ తీసుకోకుండా రాహుల్‌పై వేటు వేశాడు. దాంతో సర్ఫరాజ్ ఖాన్ వరుసగా రెండో టెస్టులోనూ ఆడుతున్నాడు. అలానే సిరాజ్ ప్లేస్‌లో ఆకాశ్ యాదవ్, కుల్దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు.
గిల్ రీఎంట్రీతో మొదలైన సమస్య
వాస్తవానికి తొలి టెస్టులో శుభమన్ గిల్ మెడనొప్పి కారణంగా ఆడలేదు. దాంతో సర్ఫరాజ్ ఖాన్‌కి అవకాశం వచ్చింది. దొరికిన అవకాశాన్ని తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై వృథా చేసుకున్నట్లు అనిపించిన సర్ఫరాజ్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇప్పుడు రెండో టెస్టుకి శుభమన్ గిల్ ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా.. సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. కేఎల్ రాహుల్‌పై వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొంది.
తొలి టెస్టులో రాహుల్ ఫెయిల్
బెంగళూరు టెస్టులో కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై.. రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు మాత్రమే చేశాడు. దానికి తోడు భారత్ గడ్డపై టెస్టుల్లో అతనికి మెరుగైన రికార్డ్ లేదు.
2016 నుంచి ఇప్పటి వరకు ఒక్క టెస్టు సెంచరీ కూడా భారత్‌లో అతను చేయలేకపోయాడు. ఇటీవల ఫామ్ కోల్పోవడం, మ్యాచ్ కీలక సమయాల్లో పేలవంగా వికెట్ చేజార్చుకోవడం జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది.
గడ్డు పరిస్థితుల్లో రాహుల్
ఇప్పటికే భారత వన్డే, టీ20 జట్లలో స్థానం కోల్పోయిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు టెస్టుల్లోనూ చోటు కోల్పోయాడు. మరోవైపు ఐపీఎల్‌లోనూ అతను ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ.. ఐపీఎల్ 2025 మెగా వేలానికి రాహుల్‌ని వదిలేయాలని భావిస్తోంది. దాంతో కెరీర్‌లో కేఎల్ రాహుల్ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
టాపిక్