Mohammed Siraj : సిరాజ్ ఆన్ డ్యూటీ.. డీఎస్పీగా స్టార్ బౌలర్.. పోలీస్ యూనిఫామ్‌లో లుక్ అదుర్స్
Mohammed Siraj : టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న సిరాజ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ డీజీపీ, ఉన్నతాధికారుల సమక్షంలో మహ్మద్ సిరాజ్ బాధ్యతలు చేపట్టారు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మహ్మద్ సిరాజ్‌కి గ్రూప్-I ర్యాంక్ ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లే.. మహ్మద్ సిరాజ్‌కి డీజీపీ కార్యాలయంలో నియామకపత్రాన్ని పోలీస్ ఉన్నతాధికారులు అందజేశారు. సిరాజ్ తండ్రి గతంలో హైదరాబాద్‌లో ఆటో నడిపేవారు.
బార్బడోస్‌లో భారత్ టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత.. సిరాజ్ తెలంగాణ రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లోనూ సిరాజ్ సాధించిన విజయాల గురించి రేవంత్ ప్రస్తావించారు. టీ20 ప్రపంచ కప్ విజయంలో అతని పాత్రను హైలైట్ చేశారు.
డీఎస్పీగా నియామక పత్రం అందుకున్న మహ్మద్ సిరాజ్ తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత.. బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి మహ్మద్ సిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటికే మహ్మద్ సిరాజ్‌కి జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లో సుమారు 600 చదరపు గజాల స్థలం కూడా వచ్చింది. ఫాస్ట్ బౌలర్‌కి ఆ స్థలం కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాజాగా డీఎస్పీ ఉద్యోగం కూడా సిరాజ్‌కి దక్కింది.
వాస్తవానికి గ్రూప్-I ఉద్యోగం పొందాలంటే.. డిగ్రీ విద్యార్హత. కానీ.. సిరాజ్‌కు డిగ్రీ లేదు. అతను ఇంటర్ వరకే చదువుకున్నారు. అయితే.. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో.. విద్యార్హత విషయంలో సిరాజ్‌కు మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకొని.. సిరాజ్‌ను గ్రూప్-I ఉద్యోగానికి ఎంపిక చేసింది.
గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ చివరిసారిగా కనిపించారు. అతను నాలుగు వికెట్లు పడగొట్టి.. భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారత్ తరఫున ఇప్పటివరకు 89 ఫార్మాట్లలో ఆడిన మహ్మద్ సిరాజ్.. 27.57 సగటుతో 163 వికెట్లు పడగొట్టారు. నవంబర్ 04, 2017న రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.