DA hike: డీఏ పెంపుపై నేడే ప్రకటన; కేబినెట్ భేటీలో నిర్ణయం!
DA hike: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలపనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఏ పెంపు పై బుధవారం కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో 4 శాతం డీఏ పెంపును ఈ సంవత్సరం మార్చిలో ప్రకటించారు.
DA hike: 2024, అక్టోబర్ 09న బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఆ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కరువు భత్యం (Dearness Allowance) పెంపుపై చర్చించే అవకాశం ఉంది. ఆ తరువాత డీఏ పెంపు పై ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. కరువు భత్యం (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) రెండింటినీ పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
డీఏ, డీఆర్ అంటే ఏమిటి?
ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ డీఏ వర్తిస్తుంది. పెన్షనర్లందరికీ డీఆర్ వర్తిస్తుంది. డీఏ, డీఆర్ రెండింటిలో కూడా ద్రవ్యోల్బణం వల్ల పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా జీతం లేదా పెన్షన్ ను సర్దుబాటు చేస్తారు. అందువల్ల, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో రిటైల్ ధరల హెచ్చుతగ్గులను ట్రాక్ చేసే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారంగా డిఎ (DA) పెంపును లెక్కిస్తారు. డీఏ, డీఆర్ పెంపును ప్రకటించడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇటీవల లేఖ రాసింది.
సంవత్సరానికి రెండు సార్లు..
సాధారణంగా ప్రభుత్వం డీఏ, డీఆర్ లను ఏడాదికి రెండుసార్లు జనవరి, జూలై నెలల్లో సవరిస్తుంది. ఆ తరువాత అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ బకాయిలకు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లలో కూడా సర్దుబాట్లు జరుగుతాయి. ఉదాహరణకు అక్టోబర్ మొదటి వారంలో డీఏ పెంపును ప్రకటించగా, గత మూడు నెలల బకాయిలను కూడా చేర్చారు.
డీఏను ఎంత మేర పెంచవచ్చు?
డీఏను 3 శాతం పెంచి, ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 53 శాతానికి పెంచే అవకాశం ఉందని వివిధ నివేదికలు సూచిస్తున్నాయి. 2024 మార్చిలో డీఏ, డీఆర్ లను 4% పెంచారు. ఇది జనవరి 2024 నుండి అమలులోకి వచ్చింది. అలాగే, ఒకవేళ, ఈ నెలలో డీఏ (DA hike), డీఆర్ పెంపు విషయంలో కేంద్రం నుంచి ప్రకటన వస్తే, ఆ పెంపు జూలై , 2024 నుండి అమల్లోకి వస్తుంది. మూడు నెలల బకాయిల సర్దుబాటు అక్టోబర్ జీతంలో ప్రతిబింబిస్తుంది.