World Cup Golden Ticket: సచిన్‌కూ వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్.. అసలేంటీ టికెట్?
08 September 2023, 14:08 IST
- World Cup Golden Ticket: సచిన్‌కూ వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ అందింది. కానీ ఈ గోల్డెన్ టికెట్ ఏంటి? గతంలో అమితాబ్ బచ్చన్ కు ఇచ్చిన బీసీసీఐ తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 8) ఈ టికెట్ ను సచిన్ టెండూల్కర్ కూ ఇవ్వడం విశేషం.
బీసీసీఐ సెక్రటరీ జై షా నుంచి వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ అందుకుంటున్న సచిన్ టెండూల్కర్
World Cup Golden Ticket: ఇండియన్ క్రికెట్ లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ 2023 గోల్డెన్ టికెట్ అందుకున్నాడు. శుక్రవారం (సెప్టెంబర్ 8) బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ గోల్డెన్ టికెట్ ను సచిన్ కు అందించారు. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది. గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సచిన్ కు కూడా ఈ టికెట్ ఇచ్చారు.
"క్రికెట్‌కు, దేశానికి ఇది ఐకానిక్ మూమెంట్. గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ కార్యదర్శి జై షా.. భారత రత్న సచిన్ టెండూల్కర్ కు గోల్డెన్ టికెట్ ఇచ్చారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రయాణం ఎన్నో తరాలలో స్ఫూర్తి నింపింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం అతనికి కలిగింది" అని బీసీసీఐ ట్వీట్ చేసింి.
అసలేంటీ గోల్డెన్ టికెట్?
ఈ మధ్యే బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్ ను బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కు కూడా ఇచ్చింది. దీంతో అసలేంటి గోల్డెన్ టికెట్ అన్న ఆసక్తి అభిమానుల్లో కలుగుతోంది. ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వాళ్లు ఇండియాలో జరిగే వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ లనూ స్టేడియంలోని వీఐపీ బాక్స్ లలో కూర్చొని చూసే వీలుంటుంది.
దీంతో పాటు స్టేడియాల్లో అన్ని వీఐపీ వసతులు ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వాళ్లకు ఉంటాయి. ప్రస్తుతానికి అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ ఈ గోల్డెన్ టికెట్లు అందుకోగా.. రానున్న రోజుల్లో మరింత మందికి కూడా బీసీసీఐ వీటిని ఇవ్వనుంది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ గోల్డెన్ టికెట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. తొలిసారి ఇండియా ఒంటరిగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ తో టోర్నీ ప్రారంభమవుతుంది. నవంబర్ 19న ఇదే స్టేడియంలో ఫైనల్ తో ముగుస్తుంది.