Roger Binny on Pakistan: పాకిస్థాన్ మమ్మల్ని రాజుల్లాగా చూసుకుంది: బీసీసీఐ ప్రెసిడెంట్ బిన్నీ
Roger Binny on Pakistan: పాకిస్థాన్ మమ్మల్ని రాజుల్లాగా చూసుకుంది అని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అనడం గమనార్హం. ఆసియా కప్ డిన్నర్ పార్టీ కోసం బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్థాన్ వెళ్లిన విషయం తెలిసిందే.
Roger Binny on Pakistan: ఆసియా కప్ 2023 డిన్నర్ పార్టీ కోసం పాకిస్థాన్ వెళ్లి వచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. పాక్ క్రికెట్ బోర్డు ఆతిథ్యానికి ఫిదా అయిపోయారు. పాకిస్థాన్ లో తమను రాజుల్లాగా చూసుకున్నారని చెబుతూ మురిసిపోయారు. ఈ నెల 4న బిన్నీతోపాటు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్థాన్ లో డిన్నర్ పార్టీకి హాజరైన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ నుంచి తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత బిన్నీ మీడియాతో మాట్లాడారు. బిన్నీ, శుక్లా వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ లో అడుగుపెట్టారు. అక్కడ డిన్నర్ పార్టీలో కూడా మాట్లాడారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగినప్పుడు అన్నీ ఆగిపోతాయని, అందరూ టీవీలకు అతుక్కుపోతారని రోజర్ బిన్నీ చెప్పడం విశేషం.
"ఎవరూ పని చేయరు. రోడ్లు ఖాళీగా మారిపోతాయి. ప్రతి ఒక్కరూ క్రికెట్ చూడటానికి టీవీల ముందు కూర్చుంటారు. ఇండియా, పాకిస్థాన్ లలో క్రికెట్ అంటే అంత ముఖ్యమైనది" అని బిన్నీ అన్నారు. పాకిస్థాన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఏఎన్ఐతో బిన్నీ మాట్లాడారు. పాకిస్థాన్ లో అందరు అధికారులను కలిశామని, మంచి అనుభవం అని బిన్నీ చెప్పారు.
"అది మంచి అనుభవం. 1984లో మేము అక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా మంచి ఆతిథ్యం ఇచ్చారు. మమ్మల్ని రాజుల్లాగా చూసుకున్నారు. అందువల్ల మాకు అది చాలా మంచి సమయం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ అధికారులందరినీ మేము కలిశాం. మేము అక్కడికి వెళ్లడం, చాలా సంతోషంగా గడపడంతో వాళ్లు కూడా తమ ఆనందం వ్యక్తం చేశారు" అని బిన్నీ చెప్పారు.
తమకు ఆహ్వానం పంపినందుకు బిన్నీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు. "డిన్నర్ పార్టీకి పిలిచినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు థ్యాంక్స్. బీసీసీఐ, ఇండియాలోని క్రికెట్ ప్రేమికుల తరఫున మీకు ధన్యవాదాలు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న మా దేశంలో అన్నీ ఆగిపోతాయి" అని బిన్నీ డిన్నర్ పార్టీలో చెప్పారు.