PAK vs BAN Asia Cup: సూపర్-4లో పాకిస్థాన్ శుభారంభం.. అలవోకగా గెలుపు.. తేలిపోయిన బంగ్లా
PAK vs BAN Asia Cup 2023: ఆసియాకప్‍లో బంగ్లాదేశ్‍పై పాకిస్థాన్ సునాయాస విజయాన్ని సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. వివరాలివే..
PAK vs BAN Asia Cup 2023: ఆసియాకప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ జోరు కొనసాగుతోంది. టోర్నీ సూపర్-4 తొలి మ్యాచ్‍లో బంగ్లాదేశ్‍పై అలవోకగా గెలిచింది పాక్. ఆల్‍రౌండ్ షో రాణించింది. లాహోర్‌లో నేడు (సెప్టెంబర్ 6) జరిగిన సూపర్-4 తొలి మ్యాచ్‍లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‍పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. షకీబుల్ హసన్ (57 బంతుల్లో 53 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (87 బంతుల్లో 64 పరుగులు) అర్ధశతకాలు చేయటంతో బంగ్లా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో హరిస్ రవూఫ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. సనీమ్ షా మూడు పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని 10.3 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్ ఛేదించింది. 39.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ (84 బంతుల్లో 78 పరుగులు), స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ (79 బంతుల్లో 63 పరుగులు; నాటౌట్) హాఫ్ సెంచరీలతో అదగొట్టారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షఫియుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్‍కు చెరో వికెట్ దక్కింది. ఆసియాకప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ గడ్డపై ఇదే చివరి మ్యాచ్. ఇక ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‍లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మ్యాచ్ ఎలా సాగిందంటే..
పాకిస్థాన్ ఆడుతూ.. పాడుతూ..
194 పరుగుల లక్ష్యాన్ని దూకుడుగా ఛేదించకున్నా.. ఆడుతూ పాడుతూ పూర్తి చేసింది పాకిస్థాన్. పెద్దగా హిట్టింగ్ చేయకుండా నిలకడగా టార్గెట్ చేరుకుంది. ఫకర్ జమాన్ (20) పదో ఓవర్లోనే ఔటైనా మరో ఓపెనర్ ఇమాముల్ హక్ నిలకడగా ఆడాడు. ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా ఆచితూచి కొనసాగాడు. దీంతో 11.2 ఓవర్లలో 50 పరుగులను చేరింది పాక్. కెప్టెన్ బాబర్ ఆజమ్ (17) కాసేపు దీటుగా ఆడినా.. 16వ ఓవర్లో బంగ్లా పేసర్ తస్కిన్ అహ్మద్ వేసిన బంతికి బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇమామ్, మహమ్మద్ రిజ్వాన్ నిలకడగా ఆడారు. బంగ్లాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 61 బంతుల్లో అర్ధ శతకానికి చేరాడు ఇమాముల్ హక్. ఆ తర్వాత కాసేపు జోరు కొనసాగించగా.. మెహదీ హసన్ మిరాజ్ అతడిని బౌల్డ్ చేశాడు. రిజ్వాన్ 71 బంతుల్లో అర్ధ శకతం చేశాడు. చివరి వరకు అజేయంగా ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివర్లో అఘ సల్మాన్ (12 నాటౌట్) అతడికి సహకరించాడు.
బంగ్లా టపటపా
అంతకు ముందు.. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్‍కు దిగిన బంగ్లాదేశ్.. పాకిస్థాన్ పేసర్ల ధాటిగా ఆరంభంలో టపటపా వికెట్లు కోల్పోయింది. బంగ్లా స్టార్ ఓపెనర్ మెహదీ హసన్ మిరాజ్ (0) గోల్డెన్ డక్ కాగా.. మహమ్మద్ నయీమ్ (20), లిటన్ దాస్ (16), తౌహిద్ హ్రిదోయ్ (2) విఫమవటంతో ఓ దశలో బంగ్లాదేశ్ 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత కెప్టెన్ షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ అర్ధ శకతాలతో బంగ్లాను నిలబెట్టారు. ఐదో వికెట్‍కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి పటిష్ట స్థితికి తీసుకొచ్చారు. అయితే, వీరిద్దరూ ఔటయ్యాక మరెవరూ ఎక్కువ సేపు నిలువలేకపోవటంతో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలోనే 193 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ పేసర్లు హరిస్ రవూఫ్ నాలుగు, నసీమ్ షా మూడు వికెట్లతో రాణించారు. షహిన్ షా అఫ్రిది, ఫహీమ్ అష్రఫ్, ఇఫ్తికార్ అహ్మద్‍కు చెరో వికెట్ దక్కింది. షకీబ్, ముష్ఫికర్, నయీమ్ మినహా మరే బంగ్లా బ్యాటర్ కూడా కనీసం 20 పరుగులు మార్క్ కూడా చేరలేకపోయారు.