Babar Azam to India: ఇండియన్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం
Babar Azam to India: ఇండియన్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం. బంగ్లాదేశ్ పై ఘన విజయం తర్వాత తర్వాతి మ్యాచ్ ఇండియాతో ఆడుతుండటంపై అతడు స్పందించాడు.
Babar Azam to India: ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే చాలా ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఈ మధ్యకాలంలో అసలు ఇండోపాక్ క్రికెట్ యుద్ధాలే జరగడం లేదు. అలాంటిది వారం గ్యాప్ లో ఈ దాయాదులు మరోసారి తలపడబోతున్నారు. ఆసియా కప్ 2023 సూపర్ 4 స్టేజ్ లో భాగంగా వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 10) మరో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ మ్యాచ్ కు ముందు ఇండియన్ టీమ్ కు వార్నింగ్ ఇచ్చాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం. తొలి సూపర్ 4 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన తర్వాత అతడు మాట్లాడాడు. పెద్ద మ్యాచ్ లకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని, తమ 100 శాతం పర్ఫార్మెన్స్ ఇస్తామని బాబర్ స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్ ను పాకిస్థాన్ 7 వికెట్లతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇండియాపై కూడా గెలిస్తే పాకిస్థాన్ తన ఫైనల్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ కీలక మ్యాచ్ పై బాబర్ మాట్లాడాడు. "మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పెద్ద మ్యాచ్ కోసం మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. తర్వాతి మ్యాచ్ లో మా 100 శాతం ప్రదర్శన ఇస్తాం" అని బాబర్ ఆజం స్పష్టం చేశాడు.
బంగ్లాదేశ్ పై విజయం టీమ్ సమష్టి కృషి అని బాబర్ అన్నాడు. "ఈ క్రెడిట్ టీమ్ లోని అందరికీ చెందుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు. తొలి 10 ఓవర్లు వాళ్లు వేసిన తీరు బాగుంది. రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫహీమ్ అష్రఫ్ బాగా వేశాడు. పిచ్ పై పచ్చిక ఉండటంతో మరో పేస్ బౌలర్ ను తీసుకోవాలని అనుకున్నాను" అని బాబర్ చెప్పాడు.
ఆసియా కప్ లో భాగంగా లీగ్ స్టేజ్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 266 రన్స్ చేసింది. తర్వాత పాకిస్థాన్ ఇన్నింగ్స్ కు ముందు భారీ వర్షంతో మ్యాచ్ సాధ్యం కాలేదు. ఇప్పుడు సూపర్ 4 మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ జరిగబోయే ఆదివారం కూడా భారీ వర్షం కురవచ్చు.