ICC ODI Rankings: బాబర్‌ను గిల్ కొట్టేస్తాడా.. తాజా వన్డే ర్యాంకుల్లో మరింత పైకి..
ICC ODI Rankings: బాబర్‌ను గిల్ అధిగమించేలా ఉన్నాడు. తాజా వన్డే ర్యాంకుల్లో అతడు మరింత పైకి ఎగబాకాడు. కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ తో మూడో స్థానానికి చేరాడు.

ICC ODI Rankings: ఐసీసీ తాజాగా బుధవారం (సెప్టెంబర్ 6) రిలీజ్ చేసిన వన్డే ర్యాంకుల్లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించాడు. ఈ తాజా ర్యాంకింగ్స్ లో బాబర్ ఆజం నంబర్ వన్ గా కొనసాగినా.. గిల్ అతనికి మరింత చేరువయ్యాడు. ఆసియా కప్ లో భాగంగా నేపాల్ తో మ్యాచ్ లో గిల్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
నేపాల్ పై గిల్ 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో తాజా వన్డే ర్యాంకుల్లో 750 పాయింట్లతో అతడు మూడోస్థానానికి చేరాడు. గిల్ కు ఇదే కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ కావడం విశేషం. మరోవైపు ఆసియా కప్ తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. 882 రేటింగ్ పాయింట్లతో మొదటి ర్యాంకులో కొనసాగుతన్నాడు.
ఇక సౌతాఫ్రికా బ్యాటర్ వాన్ డెర్ డుసెన్ 777 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. టాప్ 10లో గిల్ కాకుండా ఇండియా నుంచి కోహ్లి మాత్రమే స్థానం సంపాదించాడు. అతడు 10వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. కోహ్లి ప్రస్తుతం 695 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. ఇక నేపాల్ పై చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ 690 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు.
పాకిస్థాన్ పై టీమ్ ను ఆదుకున్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తాజా ర్యాంకుల్లోనూ 24వ స్థానంలోనే ఉన్నాడు. అటు బౌలర్ల ర్యాంకుల్లో ఆసియా కప్ లో రాణిస్తున్న బౌలర్లు మెరుగైన ర్యాంకులు అందుకున్నారు. పాకిస్థాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది నాలుగు స్థానాలు ఎగబాకి 5వ ర్యాంకుకు చేరుకున్నాడు. అతడు తొలి రెండు మ్యాచ్ లలోనే 6 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ టాప్ 2లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ రెండు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకుకు చేరాడు.