Sachin Tendulkar: సచిన్.. నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా.. మాస్టర్ ఇంటి ముందు ఆందోళనలు-protests at sachin tendulkar home this is the reason cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sachin Tendulkar: సచిన్.. నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా.. మాస్టర్ ఇంటి ముందు ఆందోళనలు

Sachin Tendulkar: సచిన్.. నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా.. మాస్టర్ ఇంటి ముందు ఆందోళనలు

Hari Prasad S HT Telugu
Aug 31, 2023 03:15 PM IST

Sachin Tendulkar: సచిన్.. నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా అంటూ మాస్టర్ ఇంటి ముందు ఆందోళనలు జరుగుతున్నాయి. అతడు ఓ ఆన్‌లైన్ గేమింగ్ యాడ్ చేయడం వల్లే ఈ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ముంబైలోని బాంద్రాలో ఉన్న సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే బచ్చు కాడు ఆందోళన
ముంబైలోని బాంద్రాలో ఉన్న సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే బచ్చు కాడు ఆందోళన

Sachin Tendulkar: క్రికెట్ గాడ్, టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు పలువురు ఆందోళన నిర్వహిస్తున్నారు. అతడు ఓ ఆన్‌లైన్ గేమింగ్ యాడ్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో బాంద్రాలోని అతని ఇంటి ముందు మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓంప్రకాశ్ బాబారావ్ అలియాస్ బచ్చు కాడు, అతని అనుచరులు ఆందోళనకు దిగారు. అంతేకాదు ఆ యాడ్ కంపెనీపై కోర్టుకు కూడా వెళ్తామని సదరు పార్టీ హెచ్చరించింది.

పేటీఎం ఫస్ట్ గేమ్ కోసం సచిన్ యాడ్ చేయడం వివాదానికి కారణమైంది. ఇదొక గేమింగ్ ప్రోగ్రామ్. దీని ద్వారా ఆన్‌లైన్ లో గేమ్స్ ఆడుతూ డబ్బు సంపాదించే వీలుంటుంది. అలాంటి గేమింగ్ సంస్థను ప్రమోట్ చేయడం సరికాదని, వెంటనే ఈ యాడ్ నుంచి ఉపసంహరించుకోవాలంటూ ఆందోళనకారులు సచిన్ ను డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్ స్పందించలేదు. 2013లో క్రికెట్ నుంచి రిటైరైన సచిన్ ను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించిన విషయం తెలిసిందే. అంతేకాదు అతడు రాజ్యసభ ఎంపీగానూ పనిచేశాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి యాడ్ చేయడం ఏంటి అంటూ ఎమ్మెల్యే బచ్చు కాడు, తన అనుచరలతో కలిసి పోస్టర్లు, బ్యానర్లు పట్టుకొని సచిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

యువకులను వ్యసనానికి గురి చేసే ఇలాంటి ఆన్‌లైన్ గేమింగ్ నుంచి 15 రోజుల్లోగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యేతో పాటు మరో 12 మందిని అరెస్ట్ చేశారు. అయితే వాళ్లను విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే అనుచరులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు.

ఒకవేళ సచిన్ కు భారతరత్న ఇచ్చి ఉండకపోతే తాము అతన్ని టార్గెట్ చేసేవాళ్లం కాదని ఎమ్మెల్యే బచ్చు కాడు అన్నారు. ఒకవేళ అతడు ఇలాంటి యాడ్స్ ద్వారా రూ.300 కోట్లు సంపాదించాలనుకుంటే భారతరత్న వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

Whats_app_banner