తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gautam Gambhir: ‘మేం ఎవరికీ భయపడం.. కానీ’: భారత హెడ్‍కోచ్ గౌతమ్ గంభీర్

Gautam Gambhir: ‘మేం ఎవరికీ భయపడం.. కానీ’: భారత హెడ్‍కోచ్ గౌతమ్ గంభీర్

18 September 2024, 22:33 IST

google News
    • Gautam Gambhir - IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‍తో తొలి టెస్టు ముందు గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత హెడ్‍కోచ్‍గా ఆయనకు ఇదే తొలి టెస్టు సిరీస్‍ కానుంది. తాము ఎవరికీ భయపడమంటూ గౌతీ అన్నారు. మరిన్ని కామెంట్లు చేశారు.
Gautam Gambhir: ‘మేం ఎవరికీ భయపడం.. కానీ’: భారత హెడ్‍కోచ్ గౌతమ్ గంభీర్
Gautam Gambhir: ‘మేం ఎవరికీ భయపడం.. కానీ’: భారత హెడ్‍కోచ్ గౌతమ్ గంభీర్ (PTI)

Gautam Gambhir: ‘మేం ఎవరికీ భయపడం.. కానీ’: భారత హెడ్‍కోచ్ గౌతమ్ గంభీర్

బంగ్లాదేశ్‍తో టెస్టు సిరీస్ కోసం టీమిండియా సిద్ధమైంది. భారత హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్‍గా ఉంది. జూన్‍లో ఆ పదవిని ఆయన చేపట్టారు. శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్‍కోచ్‍గా ప్రస్థానాన్ని ఆరంభించారు గౌతీ. ఆ టూర్‌లో టీ20, వన్డే సిరీస్‍లు జరిగాయి. దీంతో బంగ్లాతో జరిగే పోరే హెడ్‍కోచ్‍గా గంభీర్‌కు మొదటి టెస్టు సిరీస్ కానుంది. టీమిండియా, బంగ్లా మధ్య రేపు (సెప్టెంబర్ 19) చెన్నైలో తొలి టెస్టు మొదలుకానుంది. ఈ తరుణంలో నేడు (సెప్టెంబర్ 18) మీడియాతో మాట్లాడారు గంభీర్.

ఇటీవల పాకిస్థాన్‍పై టెస్టు సిరీస్‍ను గెలిచిన బంగ్లాదేశ్‍కు గంభీర్ అభినందనలు తెలిపారు. అయితే, ఇది వేరే సిరీస్ అని చెప్పారు. బంగ్లాను క్వాలిటీ జట్టు అని ప్రశంసించారు.

భయపడం.. గౌరవిస్తాం

తాము ఎవరికి భయపడబోమని, కానీ అందరినీ గౌరవిస్తామని గంభీర్ చెప్పారు. తాము ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోబోమని, తమ ఆట ఆడతామని అన్నారు. “మేం ఎవరికీ భయపడబోమని నేను ఎప్పటికీ నమ్ముతా. కానీ మేం అందరినీ గౌరవిస్తాం. బంగ్లాదేశ్‍తోనూ ఇలాగే ఉంటుంది. మేం ప్రత్యర్థి ఎవరనే విషయాన్ని ఫోకస్ చేయం. మాకు తెలిసిన ఆటనే ఆడతాం” అని గౌతమ్ గంభీర్ అన్నారు.

బంగ్లాదేశ్ జట్టులోనూ కొందరు అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నారని, అది క్వాలిటీ టీమ్ అని అభిప్రాయపడ్డారు. “పాకిస్థాన్‍లో వారు (బంగ్లాదేశ్) చేసిన దానికి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఇది కొత్త సిరీస్. వారిది నాణ్యమైన జట్టు. అందుకే మేం మంచి ఆట ఆడాలి. షకీబ్, ముష్ఫికర్, మెహదీ లాంటి అనుభవజ్ఞులు వారికి ఉన్నారు. మేం తొలి బంతి నుంచే అప్రమత్తతో ఆడాలి” అని గంభీర్ చెప్పారు.

పాకిస్థాన్‍పై ఇటీవల బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‍లో 2-0తో గెలిచింది. పాక్ గడ్డపై ఆ టీమ్‍నే క్వీన్ స్వీప్ చేసింది. పాక్‍పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. కాగా, టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‍పై ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా బంగ్లా గెలువలేదు.

రాహుల్, పంత్‍ వైపే మొగ్గు

బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో భారత తుది జట్టుపై కూడా గౌతమ్ గంభీర్ హింట్స్ ఇచ్చారు. జట్టులో కేఎల్ రాహుల్ ఉండాలా, సర్ఫరాజ్ ఖాన్‍కు ఛాన్స్ ఇవ్వాలా అనే చర్చ సాగుతోంది. ఈ విషయంపై గంభీర్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్‍కే తుది జట్టులో ఛాన్స్ అనేలా చెప్పారు.

ధృవ్ జురెల్ కాకుండా తుది జట్టులో రిషబ్ పంత్ ఉంటాడని కూడా గంభీర్ స్పష్టంగా చెప్పారు. “మేం ఎవరినీ తప్పించం. తుదిజట్టులో ఎవరు సరిపడతారో ఎంపిక చేస్తాం అంతే. తుదిజట్టు ఎంపికలో మేం నమ్మకంగా ఉంటాం. జురెల్ అద్భుతమైన ప్లేయర్. అయితే, పంత్ రావటంతో అతడు కొంతకాలం వేచిచూడాలి. సర్ఫరాజ్ విషయంలోనూ ఇంతే. అవకాశాలు వస్తాయి.. అయితే నిరీక్షించాల్సి ఉంటుంది” అని గంభీర్ చెప్పారు.

బంగ్లాతో తొలి టెస్టుకు భారత తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‍ప్రీత్ బుమ్రా

తదుపరి వ్యాసం