తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాదిన విజయ్ శంకర్.. వీడియో వైరల్

Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాదిన విజయ్ శంకర్.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

27 November 2024, 21:03 IST

google News
    • Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో విజయ్ శంకర్ మూడు సిక్స్ లు కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బరోడా, తమిళనాడు మ్యాచ్ లో హార్దిక్ కు చేదు అనుభవం ఎదురైంది.
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాదిన విజయ్ శంకర్.. వీడియో వైరల్
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాదిన విజయ్ శంకర్.. వీడియో వైరల్

హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాదిన విజయ్ శంకర్.. వీడియో వైరల్

Hardik Pandya: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బుధవారం (నవంబర్ 27) ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో బరోడా, తమిళనాడు మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ వేసిన ఒకే ఓవర్ లో విజయ్ శంకర్ మూడు సిక్స్ లు బాదడం హైలైట్ గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హార్దిక్ బౌలింగ్ చిత్తు చిత్తు

బరోడా, తమిళనాడు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ లో చివరికి బరోడానే గెలిచినా.. అంతకుముందు హార్దిక్ బౌలింగ్ లో విజయ్ శంకర్ సిక్స్ లు అభిమానులను అలరించాయి. తమిళనాడు మొదట బ్యాటింగ్ చేయగా.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ హార్దిక్ వేశాడు. తొలి బంతి ఆఫ్ సైడ్ బయట పడగా.. దానిని మిడ్ వికెట్ మీదుగా సిక్స్ బాదాడు.

ఆ తర్వాతి బంతికే విజయ్ మరో సిక్స్ కొట్టాడు. ఈసారి ఫుల్ లెంత్ బాల్ ను లాంగాఫ్ మీదుగా బౌండరీ అవతలికి తరలించాడు. ఇక అదే ఓవర్ చివరి బంతికి మూడో సిక్స్ కొట్టాడు. ఈసారి గుడ్ లెంత్ బాల్ ను లాంగాన్ దిశగా పంపించాడు. దీంతో ఒకే ఓవర్లో మూడు సిక్స్ లు కొట్టినట్లయింది. విజయ్ మొత్తంగా 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. దీంతో తమిళనాడు 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగులు చేసింది.

బ్యాట్‌తో చెలరేగిన హార్దిక్

విజయ్ శంకర్ వీరబాదుడు మాత్రం వృథా అయిపోయింది. బౌలింగ్ లో తేలిపోయిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో మాత్రం చెలరేగిపోయాడు. బరోడా తరఫున ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన హార్దిక్.. 30 బంతుల్లోనే 7 సిక్స్‌లు, 4 ఫోర్లతో 69 రన్స్ చేశాడు. దీంతో చివరి బంతికి బరోడా టార్గెట్ చేజ్ చేసింది. హార్దిక్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ విజయంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ గ్రూప్ బిలో తమిళనాడును కిందికి నెట్టి బరోడా టాప్ లోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకూ ఆ టీమ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. బరోడా తమ తర్వాతి మ్యాచ్ లను శుక్రవారం (నవంబర్ 29) త్రిపురతో ఆడనుంది. అదే రోజు తమిళనాడు, గుజరాత్ మ్యాచ్ జరుగుతుంది.

ఇక ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్ వేలంలో విజయ్ శంకర్ ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. రూ.30 లక్షల బేస్ ప్రైస్ తో విజయ్ ఈ వేలంలోకి అడుగుపెట్టాడు. అతని కోసం గుజరాత్ టైటన్స్ గట్టిగానే ప్రయత్నించింది. చివరికి రూ.1.2 కోట్లకు సీఎస్కే దక్కించుకుంది.

తదుపరి వ్యాసం