తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: పుణె టెస్టుకి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు, కలిసొచ్చిన స్థానాన్ని కోరుకున్న మాజీ కెప్టెన్

Virat Kohli: పుణె టెస్టుకి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు, కలిసొచ్చిన స్థానాన్ని కోరుకున్న మాజీ కెప్టెన్

Galeti Rajendra HT Telugu

23 October 2024, 9:00 IST

google News
  • India vs New Zealand 2nd Test Match: బెంగళూరు టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ని తప్పనిసరి పరిస్థితుల్లో మార్చారు. కానీ గురువారం నుంచి ప్రారంభమయ్యే పుణె టెస్టులో మాత్రం కోహ్లీ తన మునుపటి స్థానాన్ని కోరుతున్నాడు.

పుణె టెస్టు ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ
పుణె టెస్టు ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ (AFP)

పుణె టెస్టు ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ

భారత్, న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా గురువారం (అక్టోబరు 24) నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టుకి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు కనిపించబోతున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనకి అచ్చొచ్చిన స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరులో గత ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ 0, 70 పరుగులు చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

కోహ్లీ స్థానం ఎందుకు మారింది?

వాస్తవానికి విరాట్ కోహ్లీ సుదీర్ఘకాలంగా టెస్టుల్లో నెం.4లో బ్యాటింగ్ చేస్తున్నాడు. గతంలో చతేశ్వర్ పుజారా నెం.3లో ఆడేవాడు. అతను ప్రస్తుతం టెస్టు జట్టుకి దూరమవడంతో యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ ఆడుతున్నాడు. అయితే.. బెంగళూరు టెస్టుకి మెడనొప్పి కారణంగా గిల్ దూరమవగా.. అతని స్థానంలో మరో యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు.

సర్ఫరాజ్ ఖాన్‌కి టాప్ ఆర్డర్‌లో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడంతో.. అతడ్ని నెం.4కి మార్చిన టీమిండియా మేనేజ్‌మెంట్ నెం.3లో విరాట్ కోహ్లీని ఆడించింది. అయితే.. బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌటైపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేశాడు. కానీ.. తాను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సెంచరీ మార్క్‌ని మాత్రం అందుకోలేకపోయాడు.

ఒకవేళ గిల్ రాకపోతే?

పుణె టెస్టుకి శుభమన్ గిల్ ఫిట్‌నెస్ సాధించి తుది జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాంతో అతను నెం.3లో ఆడనుండగా.. కోహ్లీ నెం.4లోకి వెళ్లిపోనున్నాడు. అయితే.. గిల్ కోసం సర్ఫరాజ్ ఖాన్ లేదా కేఎల్ రాహుల్‌లో ఒకరిపై వేటు వేయాల్సి ఉంది. దాంతో ఆ ఇద్దరిలో ఒకరిని జట్టు నుంచి తప్పిస్తారా? లేదా గిల్‌నే రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెడతారా? అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం లేదు.

ఒకవేళ శుభమన్ గిల్ రిజర్వ్ బెంచ్‌పై కూర్చుంటే అప్పుడు కేఎల్ రాహుల్‌ని నెం.3లో ఆడించాల్సి వస్తుంది. ఇప్పటికే పేలవ ఫామ్‌లో ఉన్న రాహుల్‌కి ఇది మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టనుంది. అయితే.. కోహ్లీ మాత్రం నెం.4లో ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది.

నెం.3లో కోహ్లీకి పేలవ రికార్డ్

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ ‘‘విరాట్ లాంటి ఆటగాడిని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం కాస్త అన్యాయమే అవుతుంది. మిడిలార్డర్‌లో రాహుల్ అంత ప్రభావవంతంగా కనిపించడం లేదు. కాబట్టి అతడ్ని మూడో స్థానానికి పంపి, కోహ్లీకి తనకి బాగా అలవాటైన నెం.4లో ఆడించడం ఉత్తమం’’ అని అభిప్రాయపడ్డాడు. నెం.3లో 5 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 23.85 సగటుతో 167 పరుగులు మాత్రమే చేశాడు.

2022 నుంచి టెస్టుల్లో నిలకడ ఆడుతున్న కేఎల్ రాహుల్ ఇటీవల గాడి తప్పాడు. చివరిగా ఆడిన 12 మ్యాచ్ల్లో 25.70 సగటుతో 514 పరుగులు మాత్రమే చేశాడు. గత రెండేళ్లలో అతను ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించాడు.

తదుపరి వ్యాసం