KL Rahul vs Sarfaraz Khan: సెంచరీ వీరుడి కోసం సీనియర్ ప్లేయర్‌పై వేటు, హింట్ ఇచ్చిన టీమిండియా సహాయ కోచ్-sarfaraz khan and kl rahul fighting in team india reveals ryan ten doeschate ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul Vs Sarfaraz Khan: సెంచరీ వీరుడి కోసం సీనియర్ ప్లేయర్‌పై వేటు, హింట్ ఇచ్చిన టీమిండియా సహాయ కోచ్

KL Rahul vs Sarfaraz Khan: సెంచరీ వీరుడి కోసం సీనియర్ ప్లేయర్‌పై వేటు, హింట్ ఇచ్చిన టీమిండియా సహాయ కోచ్

Galeti Rajendra HT Telugu
Oct 23, 2024 05:30 AM IST

IND vs NZ 2nd Test: బెంగళూరు టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేఎల్ రాహుల్ చేసిన పరుగులు 0, 12. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ 0, 150 పరుగులు. దాంతో ఇప్పుడు టీమిండియాకి కొత్త తలనొప్పి మొదలైంది.

కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్
కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్

బెంగళూరు టెస్టులో గత ఆదివారం న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా.. రెండో టెస్టుకి కఠిన నిర్ణయం తీసుకోబోతోంది. పుణె వేదికగా అక్టోబరు 24 (గురువారం) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత్ జట్టులో పోటీ గురించి టీమిండియా సహాయ కోచ్‌ టెన్‌ డస్కాటె మాట్లాడుతూ కేఎల్ రాహుల్‌పై వేటు గురించి సంకేతాలిచ్చాడు.

బెంగళూరు టెస్టుకి మెడ నొప్పి కారణంగా శుభమన్ గిల్ దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ క్లిష్టపరిస్థితుల్లోనూ వీరోచితంగా 150 పరుగులు చేసి భారత్ జట్టు పరువు నిలిపాడు. అయితే ఇప్పుడు పుణె టెస్టుకి శుభమన్ గిల్ ఫిట్‌నెస్ సాధించగా.. సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గిల్ కోసం కేఎల్ రాహుల్‌ని తప్పిస్తారా? అని సహాయ కోచ్‌ టెన్‌ డస్కాటెను అడగ్గా.. అతను సమాధానమిచ్చాడు.

ఏడుగురిలో ఆరుగురికి మాత్రమే ఛాన్స్

‘‘అవును మిడిలార్డర్‌లో ఒక స్థానం కోసం జట్టులో పోటీ నెలకొంది. కానీ.. ఏ ఆటగాడికీ అనుకూలంగా వ్యవహరించడంలో అర్థం లేదు. నిజమే.. సర్ఫరాజ్ ఖాన్ గత మ్యాచ్‌లో బాగా ఆడాడు. కానీ కేఎల్ రాహుల్ ఫామ్ టీమ్‌కి ఏమీ ఆందోళన కలిగించడం లేదు. రాహుల్ ప్రస్తుతం మంచి మానసిక స్థితిలోనే ఉన్నాడు. అయితే కచ్చితంగా ఈ టెస్టు మ్యాచ్ కోసం ఏడుగురు బ్యాటర్లలో నుంచి ఆరుగురిని మాత్రమే మేము తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంది. మ్యాచ్‌కి ముందు పుణె పిచ్‌ను చూసిన తర్వాత తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటాం’’ అని కోచ్‌ టెన్‌ డస్కాటె స్పష్టం చేశాడు.

భారత్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే కేఎల్ రాహుల్‌కి గత కొన్ని రోజులుగా చాలినన్ని అవకాశాలు ఇచ్చాడు. కానీ.. ఈ బెంగళూరు బ్యాటర్ వాటిని వృథా చేసుకుని ఇప్పుడు పీకలమీదకి తెచ్చుకున్నాడు. బెంగళూరు పిచ్ రాహుల్‌కి సొంత మైదానం. కానీ.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో 0, 12 పరుగులతో తేలిపోయాడు. దాంతో రాహుల్‌పై వేటు వేయాలనే డిమాండ్ పెరిగిపోయింది.

టీమిండియా రిస్క్ తీసుకునేనా?

ఒకవేళ పుణె టెస్టులో కేఎల్ రాహుల్ కోసం సర్ఫరాజ్‌‌ను జట్టు నుంచి తప్పించినా లేదా ఫిట్‌గా ఉన్న శుభమన్ గిల్‌ను రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టినా టీమిండియా మేనేజ్‌మెంట్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు రాహుల్‌పై కూడా ఒత్తిడి పెరుగుతుంది. కచ్చితంగా పుణె టెస్టులో అతను భారీ స్కోరు చేయాలి. లేదంటే అతని టెస్టు కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకుంటుందో చూడాలి.

మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనకబడిన భారత్ జట్టు.. రెండో టెస్టు కోసం సంప్రదాయ స్పిన్ పిచ్‌ను రెడీ చేస్తోంది. బెంగళూరు టెస్టుకి పేస్ పిచ్‌ సిద్ధం చేసి బలైపోయిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 9 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. మాజీ క్రికెటర్లు కూడా చాలా మంది కేఎల్ రాహుల్‌పై వేటు వేయాలని సూచిస్తున్నారు.

Whats_app_banner