Virat Kohli Records: టెస్టుల్లో అరుదైన రికార్డ్ ముంగిట విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకు ఆ క్లబ్‌లో ముగ్గురే!
Virat Kohli Test Records: భారత్ తరఫున టెస్టుల్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ ఉన్న అరుదైన క్లబ్‌లో చేరడానికి విరాట్ కోహ్లీ కేవలం 53 పరుగులు చేస్తే చాలు. ఈరోజు భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా టెస్టుల్లో ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. న్యూజిలాండ్‌తో బుధవారం (అక్టోబరు 16) నుంచి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ నుంచి భారీ స్కోరును అభిమానులు ఆశిస్తున్నారు.
అరుదైన క్లబ్‌లో ముగ్గురు దిగ్గజాలు
వాస్తవానికి విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో అతను చేసింది ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే. ఆఖరిగా 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సత్తాచాటాడు. ఆ తర్వాత టెస్టుల్లో విఫలమవుతూ వస్తున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు.
న్యూజిలాండ్‌తో ఈరోజు నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 9,000 పరుగుల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ క్లబ్‌లో ఉన్నారు.
కోహ్లీ జస్ట్ 53 పరుగులే
భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం ఉదయం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 53 పరుగులు చేస్తే 9,000 పరుగుల క్లబ్‌లో చేరుతాడు. భారత్ తరఫున ఈ క్లబ్‌లో చేరిన నాలుగో బ్యాటర్‌గా నిలవడంతో పాటు, ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 18వ ప్లేయర్‌గా కోహ్లీ రికార్డుల్లో నిలుస్తాడు.
విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 115 మ్యాచ్‌లు ఆడి 29 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలతో 8,947 పరుగులు చేశాడు. కాబట్టి 9,000 పరుగుల మైలురాయిని దాటడానికి అతనికి మరో 53 పరుగులు కావాలి. సుదీర్ఘ కెరీర్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ స్కోరు 254 పరుగులు.
భారత్ గడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకి టీమిండియా వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆడనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
బెంగళూరు పిచ్ కోహ్లీకి కొట్టినపిండి
న్యూజిలాండ్‌తో సిరీస్ ముంగిట విరాట్ కోహ్లీ గురించి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా గొప్పగా మాట్లాడాడు. కోహ్లీలో మునుపటి తరహాలోనే పరుగుల దాహం ఉందని పొగుడుతూనే, కేవలం ఒక్క మ్యాచ్ లేదా సిరీస్ ఆధారంగా ప్లేయర్ల సత్తాని అంచనా వేయకూడదని చెప్పుకొచ్చారు.
తొలి టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్ విరాట్ కోహ్లీకి కొట్టినపిండి. సుదీర్ఘకాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఐపీఎల్‌లో ఆడుతున్న విరాట్ కోహ్లీ అక్కడే పదుల సంఖ్యలో మ్యాచ్‌లు ఆడాడు. కాబట్టి.. తొలి టెస్టులోనే కోహ్లీ 9,000 పరుగుల మైలురాయిని అందుకుంటాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.