India in T20 World Cups: టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో టీమిండియా పర్ఫార్మెన్స్ ఇదే.. తొలి ఎడిషన్‍లో విజేత.. ఆ తర్వాత..
07 May 2024, 18:11 IST
- Team India T20 World Cup Performances: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్ 2వ తేదీన షురు కానుంది. అయితే, ఇప్పటి వరకు జరిగిన 8 ఎడిషన్ల టీ20 ప్రపంచకప్‍ల్లో భారత్ ఎలా పర్ఫార్మ్ చేసిందో.. ఏ దశ వరకు వెళ్లిందో ఇక్కడ చూడండి.
India in T20 World Cups: టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో టీమిండియా పర్ఫార్మెన్స్ ఇదే.. తొలి ఎడిషన్‍లో విజేత.. ఆ తర్వాత..
India in T20 World Cups: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. జూన్ 2వ తేదీ నుంచి ఈ మెగాటోర్నీ జరగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్ 29వ తేదీ వరకు ఈ టోర్నీ సాగనుంది. టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. టీమిండియా కూడా సిద్ధమవుతోంది. అయితే, ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో భారత జట్టు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిందో ఇక్కడ చూడండి.
2007 - విజేత
టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్ 2007లో జరిగింది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ మెగాటోర్నీ సాగింది. ఈ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని యువ భారత జట్టు విజేతగా నిలిచింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగి టైటిల్ పట్టింది. తొలి ఎడిషన్‍లోనే భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‍లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించింది భారత్.
2009 - సూపర్ 8
టీ20 ప్రపంచకప్ 2009 టోర్నీలో భారత్ నాకౌట్ దశకు కూడా చేరలేకపోయింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో సూపర్ 8 దశలోనే ఇంటి బాటపట్టింది. సూపర్ 8లో ఇంగ్లండ్‍పై గెలిచినా.. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై ఓడి నిరాశపరిచింది.
2010 - సూపర్ 8
వెస్టిండీస్ వేదికగా జరిగిన 2010 టీ20 ప్రపంచకప్‍లోనూ ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా సూపర్ 8 దశలోనే ఎలిమినేట్ అయింది. మూడో ఎడిషన్‍లో భారత్ సెమీస్ కూడా చేరలేకపోయింది.
2012 - సూపర్ 8
శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2012 ఎడిషన్‍లో భారత్ సూపర్ 8 దాటలేకపోయింది. సూపర్ 8 దశలో మూడింట రెండు గెలిచినా.. నెట్‍రన్ రేట్ కారణంగా ఎలిమినేట్ అయింది.
2014 - రన్నరప్
2014 టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా ఆరంభం నుంచి అదరగొట్టింది. సెమీస్‍కు అలవోకగా చేరింది. సెమీస్‍లో ధోనీ సారథ్యంలో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. అయితే, ఫైనల్‍లో భారత్‍కు శ్రీలంక షాక్ ఇచ్చింది. తుదిపోరులో శ్రీలంకపై ఓడి రన్నరప్‍గా భారత్ నిలిచింది. ఈ టోర్నీ బంగ్లాదేశ్ వేదికగా జరిగింది.
2016 - సెమీఫైనల్స్
స్వదేశంలో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ సెమీఫైనల్లో వెనుదిరిగింది. టోర్నీలో అప్పటి వరకు అద్భుతంగా ఆడిన భారత్.. సెమీస్‍లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది.
2021 - సూపర్ 12
యూఏఈ, ఒమన్ వేదికలుగా జరిగిన 2021 టీ20 ప్రపంచకప్‍లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ ఈ టోర్నీలో సూపర్ 12 దశలోనే వెనుదిరిగింది.
2022 - సెమీఫైనల్స్
రోహిత్ శర్మ సారథ్యంలో 2022 టీ20 ప్రపంచకప్ బరిలోకి టీమిండియా దిగింది. అయితే, సెమీఫైనల్‍లో ఓటమి పాలైంది. సెమీస్‍లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన భారత్‍కు మరోసారి నిరాశ ఎదురైంది.
ఇప్పటి వరకు జరిగిన టీ20 ప్రపంచకప్ 8 ఎడిషన్లలో టీమిండియా ఒక్కసారి విజేతగా నిలిచింది భారత్. 2007 తొలి ఎడిషన్‍లోనే టైటిల్ పట్టింది. ఆ తర్వాత టీ20 విశ్వటోర్నీలో విజేతగా నిలువలేకపోయింది.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్ 2 నుంచి జూన్ 29వ తేదీ మధ్య వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. జూన్ 5న ఐర్లాండ్‍తో మ్యాచ్‍తో ప్రపంచకప్ వేట షూరూ చేయనుంది. మరి మళ్లీ భారత్ విజేతగా నిలుస్తుందేమో చూడాలి.
టాపిక్