Team India:16 ఏళ్ల కెరీర్‌లో ఈ టీమిండియా బౌలర్ తీసింది 242 వికెట్లు - చేసింది 167 రన్స్ - వికెట్ల కంటే రన్స్ తక్కువ
04 August 2024, 14:02 IST
Team India: టీమిండియా స్పిన్నర్ బీఎస్ చంద్రశేఖర్ పదహారేళ్ల కెరీర్‌లో తాను తీసిన వికెట్ల కంటే రన్స్ తక్కువ చేశాడు. 58 టెస్టుల్లో 242 వికెట్లు తీసిన చంద్రశేఖర్ కేవలం 167 పరుగులు మాత్రమే చేశాడు.
బీఎస్ చంద్రశేఖర్
Team India: క్రికెట్‌లో బౌలర్లు కూడా అడపాదడపా బ్యాట్‌తో అదరగొడుతుంటారు. కొన్నిసార్లు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగి బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తుంటాయి. తమలోదాగి ఉన్న బ్యాటర్‌కు అప్పుడప్పుడు పనిచెబుతుంటారు. ప్రతి బౌలర్ కెరీర్‌లో అతడు తీసిన వికెట్ల కంటే రన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి.
వికెట్ల కంటే రన్స్ తక్కువ...
అయితే ఓ టీమిండియా బౌలర్ విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్‌గా కనిపిస్తుంది. పదిహేనేళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఈ క్రికెటర్ తాను తీసిన వికెట్ల కంటే వంద పరుగులు తక్కువే చేశాడు. ఆ బౌలర్ మరెవరో కాదు బీఎస్ చంద్రశేఖర్.
విజ్డెన్ క్రికెటర్ అవార్డ్...
1960- 70 దశకంలో వరల్డ్ లోనే బెస్ట్ స్పిన్నర్‌గా చంద్రశేఖర్ పేరు తెచ్చుకున్నాడు. 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి చంద్రశేఖర్ ఎంట్రీ ఇచ్చాడు. అనతి కాలంలో తన బౌలింగ్ ప్రతిభతో జట్టులో ప్లేస్ సుస్థిరం చేసుకున్నాడు. 1971లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 38 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు చంద్రశేఖర్.
ఈ మ్యాచ్‌లో అసమాన బౌలింగ్‌తో టీమిండియాకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఈ శతాబ్దంలోనే బెస్ట్ ఇండియన్ బౌలింగ్ పర్ఫార్మెన్స్‌గా విజ్డెన్ ప్రకటించింది. 1971లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డును గెలుచుకున్నాడు. 1970 దశకంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన సిరీస్‌లలో వికెట్ల పంటను పండించాడు చంద్రశేఖర్.
పదహారేళ్ల కెరీర్...
పదహారేళ్ల కెరీర్‌లో 58 టెస్ట్‌లు ఆడిన చంద్రశేఖర్ 242 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో పది వికెట్లను రెండు సార్లు తీసుకున్నాడు. తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు ఎన్నో మ్యాచుల్లో చుక్కలు చూపించిన చంద్రశేఖర్ బ్యాటింగ్‌లో మాత్రం చాలా వీక్. 58 టెస్టుల్లో కేవలం 167 పరుగులు మాత్రమే చేశాడు. అతడి హయ్యెస్ట్ స్కోరు 22 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. 58 టెస్టుల్లో 23 సార్లు డకౌట్ అయ్యాడు.
కెరీర్‌లో వికెట్ల కంటే తక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో చంద్రశేఖర్‌తో పాటు న్యూజిలాండ్ పేసర్ క్రిస్ మార్టిన్ కూడా ఉన్నాడు. టెస్టుల్లో 233 వికెట్లు తీసిన క్రిస్ మార్టిన్ కేవలం 123 పరుగులు మాత్రమే చేశాడు.
పద్మశ్రీతో పాటు...
తన కెరీర్‌లో పద్మశ్రీ, అర్జునతోపాటు పలు అవార్డులను అందుకున్నాడు చంద్రశేఖరన్. 2004లో సీకేనాయుడు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో చంద్రశేఖర్‌ను బీసీసీఐ సత్కరించింది.