తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌పై చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఆగ్రహానికి కారణం ఇదేనట!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌పై చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఆగ్రహానికి కారణం ఇదేనట!

02 March 2024, 22:16 IST

google News
    • Shreyas Iyer: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడానికి కారణమేంటో తాజాగా వెల్లడైంది. అయ్యర్ చేసిన ఓ పని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు కోపం తెప్పించిందని సమాచారం బయటికి వచ్చింది.
శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ (PTI)

శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer: బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌ల్లో భారత యువ స్టార్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడం హాట్‍టాపిక్‍గా మారింది. దక్షిణాఫ్రికా పర్యటనలో వ్యక్తిగత కారణాల పేరుతో మధ్యలోనే వచ్చేసిన ఇషాన్ కిషన్.. రంజీ మ్యాచ్‍లు ఆడాలన్న బీసీసీఐ మాటను వినలేదు. దీంతో అతడిపై బీసీసీఐ వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటివ్వలేదు. అయితే, ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో శ్రేయస్ అయ్యర్ రెండో టెస్టు వరకు ఆడాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. అయితే, బీసీసీఐ తాజా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో శ్రేయస్ అయ్యర్‌కు ఎందుకు చోటివ్వలేదనే సందేహం మాత్రం నెలకొంది.

గతేడాది వన్డే ప్రపంచకప్‍లో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. ఇటీవల కాస్త ఫామ్ కోల్పోయాడు. అయితే, సడన్‍గా బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌ల్లో అతడి పేరు లేకపోవటంతో ఎందుకిలా అంటూ ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఇంగ్లండ్‍తో సిరీస్‍లో చోటు కోల్పోయాక గాయం కారణం చెప్పి రంజీ ట్రోఫీలో ముంబై తరఫున శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ఆడలేదు. అయితే, ఎన్‍సీఏ రిపోర్టులో అతడికి గాయం లేదని తేలిందట. రంజీ మ్యాచ్ ఆడకుండా ఐపీఎల్‍లో తన జట్టు కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) నిర్వహించిన క్యాంప్‍కు అయ్యర్ వెళ్లాడని తెలుస్తోంది. దీంతోనే టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు శ్రేయస్‍పై ఆగ్రహం వచ్చిందని రెవ్ స్టోర్ట్స్ రిపోర్ట్ వెల్లడించింది.

రంజీ మ్యాచ్ ఆడకుండా కేకేఆర్ క్యాంప్‍కు శ్రేయ్యర్ వెళ్లాడని తెలుసుకున్న చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కోప్పడ్డారని, అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటివ్వకూడదని బీసీసీఐకు ప్రతిపాదించాడని ఆ రిపోర్ట్ పేర్కొంది. దీంతో బీసీసీఐ తాజా వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో శ్రేయస్ అయ్యర్ పేరు లేదు.

ప్రపంచకప్ కోసం ఐపీఎల్ వదులుకొని!

గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ కోసం ఐపీఎల్ 2023 సీజన్‍లో శ్రేయస్ అయ్యర్ ఆడలేదని రెవ్ స్పోర్ట్స్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచకప్‍లోనూ పెయిన్ కిల్లర్లను తీసుకొని బరిలోకి దిగాడని పేర్కొంది. సర్జరీ తర్వాత నొప్పి భరిస్తూనే శ్రేయస్ ప్రపంచకప్ ఆడాడని పేర్కొంది. మరోవైపు, సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి శ్రేయస్ అయ్యర్‌ను తప్పించడంపై చాలా మంది నుంచి అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది.

రంజీ సెమీస్‍లో శ్రేయస్

ప్రస్తుత రంజీ ట్రోఫీ సెమీఫైనల్‍లో ముంబై తరఫున బరిలోకి దిగాడు శ్రేయస్ అయ్యర్. తమిళనాడుతో నేడు (మార్చి 2) మొదలైన సెమీస్‍లో ఆడుతున్నాడు. గత రంజీ మ్యాచ్ ఆడని కారణంగా బీసీసీఐ ఆగ్రహానికి గురైన అతడు.. ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్‍లో అడుగుపెట్టాడు.

మరోవైపు, ఇషాన్ కిషన్ మాత్రం రంజీ ట్రోఫీ ఆడాలన్న బీసీసీఐ హెచ్చరికను విస్మరిస్తూనే వచ్చాడు. ఈ సీజన్‍లో రంజీల్లోకి బరిలోకి దిగలేదు. అందులోనూ హార్దిక్ పాండ్యాతో కలిసి ఐపీఎల్ కోసం సన్నద్ధమవడం పట్ల కూడా బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. ఇటీవలే డీవై పాటిల్ టీ20 టోర్నీ ఆడాడు ఇషాన్. మొత్తంగా అయితే ఇషాన్ కిషన్‍పై బీసీసీఐ గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలో వచ్చేసిన అతడు మళ్లీ భారత జట్టు తరఫున ఆడలేదు. ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో అవకాశం దక్కాలంటే రంజీ ట్రోఫీ ఆడాలని కిషన్‍కు బీసీసీఐ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించినా అతడు పట్టించుకోలేదు.

తదుపరి వ్యాసం