T20 World Cup Winners: టీమిండియా నుంచి ఇంగ్లండ్ వరకు.. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్స్ ఇవే.. ఆ రెండు టీమ్స్ హవా
01 May 2024, 16:29 IST
- T20 World Cup Winners: టీ20 వరల్డ్ కప్ సరిగ్గా మరో నెల రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మరి ఇప్పటి వరకూ జరిగిన 8 వరల్డ్ కప్ లు ఏయే టీమ్స్ గెలిచాయి? ఈ మెగా టోర్నీలో హవా కొనసాగించిన ఆ రెండు టీమ్స్ ఏవి?
టీమిండియా నుంచి ఇంగ్లండ్ వరకు.. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్స్ ఇవే.. ఆ రెండు టీమ్స్ హవా
T20 World Cup Winners: టీ20 వరల్డ్ కప్ 2024కు సమయం దగ్గర పడుతోంది. ఐపీఎల్ ముగిసిన వారంలోపే ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 2007లో మొదలైన ఈ మెగా టోర్నీ 9వసారి జరగనుంది. మరి ఇప్పటి వరకూ జరిగిన 8 టీ20 వరల్డ్ కప్ లు గెలిచిన ఆ ఆరు టీమ్స్ ఏవి? అందులో ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిచిన జట్లు ఏవి అన్నది ఇప్పుడు చూద్దాం.
తొలి టీ20 వరల్డ్ కప్‌లోనే సంచలనం
టీ20 వరల్డ్ కప్ తొలిసారి 2007లో జరిగింది. తొలిసారే ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా విశ్వవిజేతగా నిలిచి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ధోనీ కెప్టెన్సీలోని అప్పటి యంగిండియా అంచనాలను తలకిందులు చేసింది. సచిన్, ద్రవిడ్, గంగూలీలాంటి సీనియర్ ప్లేయర్స్ ను కాదని ధోనీ కెప్టెన్సీలో మొత్తం యువ ఆటగాళ్లను పంపించి ఫలితం రాబట్టింది.
ఆ వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్ ను 5 పరుగులతో ఓడించి కప్పు గెలిచింది. అయితే అప్పటి నుంచి మళ్లీ ఇప్పటి వరకూ టీ20 వరల్డ్ కప్ గెలవలేకపోయింది టీమిండియా. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎన్నో ఆశలతో బరిలోకి దిగుతోంది. రోహిత్, విరాట్ కోహ్లిలకు బహుషా ఇదే చివరి వరల్డ్ కప్ కానుంది. దీంతో ఎలాగైనా ఈసారి కప్పు గెలవాలన్న లక్ష్యంతో టీమ్ వెళ్తోంది.
ఆ రెండు టీమ్స్ హవా
టీ20 వరల్డ్ కప్ లో రెండు జట్ల హవా కొనసాగింది. ఈ మెగా టోర్నీని రెండేసి సార్లు గెలిచాయి వెస్టిండీస్, ఇంగ్లండ్ టీమ్స్. ఇంగ్లండ్ 2010లో జరిగిన వరల్డ్ కప్ తోపాటు చివరిసారి 2022లో జరిగిన వరల్డ్ కప్ కూడా గెలిచింది. ఇక వెస్టిండీస్ 2012, 2016లలో విజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిచిన జట్లు ఇవి రెండే.
ఇక ఇండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ కాకుండా పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంకలు కూడా ఈ మెగా టోర్నీని గెలిచాయి. 2009లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. తొలి వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా చేతుల్లో ఓడినా.. తర్వాతి వరల్డ్ కప్ లోనే పాక్ సత్తా చాటింది. ఇక 2014లో శ్రీలంక, 2021లో ఆస్ట్రేలియా గెలిచాయి. వన్డే వరల్డ్ కప్ ను ఆరుసార్లు గెలిచిన ఆస్ట్రేలియా.. టీ20 వరల్డ్ కప్ లో మాత్రం ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది.
టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచేదెవరు?
ఈసారి ఎన్నడూ లేని విధంగా 20 జట్లు టీ20 వరల్డ్ కప్ లో తలపడబోతున్నాయి. ఇప్పటి వరకూ కప్పు గెలిచిన ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతోపాటు తొలిసారి విశ్వ విజేతగా నిలవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్, సౌతాఫ్రికా కూడా బరిలోకి దిగుతున్నాయి. ఇవే కాకుండా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఆతిథ్య యూఎస్ఏ, ఐర్లాండ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, కెనడా, ఒమన్, నేపాల్, నమీబియా, ఉగాండాలాంటి దేశాలు ఆడుతున్నాయి.
ఈసారి అన్ని టీమ్స్ టాప్ ఫామ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాతోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి టీమ్స్ పటిష్ఠంగా ఉన్నాయి. ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్ అంటూ ఎవరూ లేకపోవడం విశేషం.