తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Suryakumar On Sarfaraz: పులి ఆకలి మీద ఉంది: సర్ఫరాజ్‌పై సూర్యకుమార్ పోస్ట్ వైరల్

Suryakumar on Sarfaraz: పులి ఆకలి మీద ఉంది: సర్ఫరాజ్‌పై సూర్యకుమార్ పోస్ట్ వైరల్

Hari Prasad S HT Telugu

08 March 2024, 20:36 IST

google News
    • Suryakumar on Sarfaraz: టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పై సూర్యకుమార్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పులి ఆకలి మీద ఉందంటూ అతడు కామెంట్ చేయడం విశేషం.
పులి ఆకలి మీద ఉంది: సర్ఫరాజ్‌పై సూర్యకుమార్ పోస్ట్ వైరల్
పులి ఆకలి మీద ఉంది: సర్ఫరాజ్‌పై సూర్యకుమార్ పోస్ట్ వైరల్

పులి ఆకలి మీద ఉంది: సర్ఫరాజ్‌పై సూర్యకుమార్ పోస్ట్ వైరల్

Suryakumar on Sarfaraz: ఎన్నాళ్లుగానో వేచి చూస్తే వచ్చిన అవకాశాన్ని సర్ఫరాజ్ ఖాన్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. టీమిండియా మిడిలార్డర్ లో అతడు ఆడుతున్న విలువైన ఇన్నింగ్స్ చూసి మన మిస్టర్ 360 సూర్యకుమార్ కూడా ఫిదా అవుతున్నాడు. తాజాగా ఇంగ్లండ్ తో ఐదో టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన సర్ఫరాజ్ పై సూర్య చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

పులి ఆకలి మీద ఉంది

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో రోజు ఆటలో సర్ఫరాజ్ ఖాన్ మరో హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలుసు కదా. ఆ ఫిఫ్టీని కూడా వన్డే స్టైల్లో బాదేశాడు.కేవలం 60 బంతుల్లోనే 56 రన్స్ చేసి ఔటయ్యాడు. అది చూసిన అతని ముంబై టీమ్మేట్ సూర్యకుమార్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

పులి ఆకలి మీద ఉంది అంటూ సర్ఫరాజ్ ఫొటోతో అతడు ఓ పోస్ట్ చేశాడు. పులి బొమ్మ పెట్టి పక్కన భూకా హై (ఆకలి మీద ఉంది) అనే కామెంట్ రాశాడు. అప్పటికి సర్ఫరాజ్ 55 బంతుల్లో 51 పరుగులతో ఆడుతున్నప్పటి స్క్రీన్ షాట్ అది. సూర్యకుమార్ చేసిన ఈ కామెంట్ అభిమానులకు బాగా నచ్చింది. టీ20 క్రికెట్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడే అలవాటు సూర్యకు ఉంది.

అయితే సర్ఫరాజ్ మాత్రం టెస్టుల్లోనూ అంతే దూకుడుగా ఆడుతున్నాడు. తాను ఆడిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే ఇంగ్లండ్ బౌలర్లను చితకబాదుతూ అతడు హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక సూర్య తాజాగా చేసిన కామెంట్ ఆ మధ్య కెప్టెన్ రోహిత్ కామెంట్స్ ను గుర్తుకు తెస్తోంది. పరుగుల కోసం ఆకలి ఉన్న వాళ్లకే టెస్ట్ జట్టులో చోటు దక్కుతుందని రోహిత్ స్పష్టం చేశాడు.

సర్ఫరాజ్‌కు అండగా సూర్య

సర్ఫరాజ్ కు కొన్నాళ్లుగా సూర్యకుమార్ పూర్తి అండగా నిలుస్తున్నాడు. ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ ముంబై జట్టుకే ఆడతారు. రాజ్‌కోట్ టెస్టులోనే టీమిండియా తరఫున సర్ఫరాజ్ అరంగేట్రం చేసినప్పుడు అతని తండ్రి నౌషాద్ ను నేరుగా వెళ్లి మ్యాచ్ చూడాల్సిందిగా సూర్యనే ఒత్తిడి తెచ్చాడు. నిజానికి తన చిన్న కొడుకు ముషీర్ రంజీల్లో ఆడుతుండటంతో అతని వెంటే ఉండాలని నౌషాద్ అనుకున్నాడు.

కానీ సూర్య పంపిన ఓ వాయిస్ మెసేజ్ తో ఆయన తన మనసు మార్చుకొని రాజ్‌కోట్ వెళ్లారు. టెస్ట్ క్యాప్ అందుకుంటున్నప్పుడు ఫ్యామిలీ ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందని, అందుకే మీరు వెళ్లాలని ఆయనపై సూర్య ఒత్తిడి తేవడంతో మనసు మార్చుకున్నారు. తన తండ్రి వచ్చిన తొలి టెస్టులో సర్ఫరాజ్ చెలరేగి ఆడాడు. రెండు ఇన్నింగ్స్ లో వరుసగా 62, 68 పరుగులు చేశాడు.

రాంచీ టెస్టులో మాత్రం సర్ఫరాజ్ విఫలమయ్యాడు. 14, సున్నా పరుగులే చేశాడు. అయితే ధర్మశాలలో మరోసారి పుంజుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడుతూ 56 పరుగులు చేయడంతోపాటు దేవదత్ పడిక్కల్ తో కలిసి నాలుగో వికెట్ కు సెంచరీకిపైగా పార్ట్‌నర్‌షిప్ తో టీమిండియా పటిష్ఠ స్థితిలో నిలిపాడు.

తదుపరి వ్యాసం