India vs England 5th test live: టీమిండియా సెంచరీలు, హాఫ్ సెంచరీల మోత.. ఇంగ్లండ్‌పై పూర్తిగా పట్టు బిగించిన రోహిత్ సేన
India vs England 5th test live: ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీలు, హాఫ్ సెంచరీల మోత మోగించిన టీమిండియా పూర్తిగా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటికే 255 పరుగుల ఆధిక్యం లభించగా.. చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉన్నాయి.
India vs England 5th test live: ధర్మశాలలో వణుకుపుట్టించే చలిలోనూ ఇంగ్లండ్ బౌలర్లకు చెమటలు పట్టించారు టీమిండియా బ్యాటర్లు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలు.. తొలి టెస్ట్ ఆడుతున్న దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీల మోత మోగించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్లకు 473 రన్స్ చేసింది. ప్రస్తుతం 255 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రెండో రోజూ టీమిండియాదే..
ఇంగ్లండ్ తో చివరి టెస్ట్ తొలి రోజు బౌలింగ్ లో అదరగొట్టిన టీమిండియా.. రెండో రోజు బ్యాటింగ్ లోనూ చెలరేగింది. మొదట కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో రెచ్చిపోయారు. వికెట్ నష్టానికి 135 పరుగులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ కు ఈ ఇద్దరూ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ధాటిగా ఆడుతూ భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ పోయారు.
ఈ క్రమంలో రోహిత్ టెస్టుల్లో 12వ సెంచరీ, గిల్ 4వ సెంచరీ చేయడం విశేషం. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు ఏకంగా 174 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్ (103) ఔటయ్యాడు. గతేడాది యాషెస్ తర్వాత మళ్లీ ఇప్పుడే బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. తొలి బంతికే రోహిత్ ను క్లీన్ బౌల్డ్ చేయడం గమనార్హం. దీంతో 275 రన్స్ దగ్గర ఇండియా రెండో వికెట్ కోల్పోయింది.
ఆ వెంటనే శుభ్‌మన్ గిల్ (110) కూడా ఆండర్సన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. టెస్టుల్లో అతనికిది 699వ వికెట్. దీంతో ఇండియా 279 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారీ ఆధిక్యం సాధ్యమేనా అన్న సందేహాలు కలిగాయి.
తొలి టెస్టులోనే చెలరేగిన పడిక్కల్
రజత్ పటీదార్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో ధర్మశాలలో దేవదత్ పడిక్కల్ కు టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. అతడు ఆడిన తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా ధాటిగా ఆడుతూ బౌండరీల మీద బౌండరీలు బాదిన పడిక్కల్.. చివరికి 103 బంతుల్లో 65 రన్స్ చేశాడు.
సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి పడిక్కల్ మూడో వికెట్ కు 97 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరూ మ్యాచ్ ను ఇంగ్లండ్ చేతుల్లో నుంచి దాదాపు దూరం చేసినట్లే కనిపిస్తున్నారు. సర్ఫరాజ్ కూడా 56 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత జడేజా (15), ధృవ్ జురెల్ (15), అశ్విన్ (0) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దీంతో ఇండియా 428 రన్స్ కు 8 వికెట్లు కోల్పోయింది.
ఇక ఎంతో సేపు టీమిండియా తొలి ఇన్నింగ్స్ కొనసాగదు అనుకున్న వేళ కుల్దీప్ యాదవ్, బుమ్రా జోడీ కూడా ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. వీళ్లిద్దరూ ఇప్పటికే 9వ వికెట్ కు 45 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి కుల్దీప్ 27, బుమ్రా 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.