IND vs ENG 5th Test Live: రికార్డులు తిరగరాసిన యశస్వి.. ధర్మశాలలో తొలి రోజు టీమిండియాదే-ind vs eng 5th test live yashasvi jaiswal breaks records team india dominates day 1 of dharmasala test against england ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 5th Test Live: రికార్డులు తిరగరాసిన యశస్వి.. ధర్మశాలలో తొలి రోజు టీమిండియాదే

IND vs ENG 5th Test Live: రికార్డులు తిరగరాసిన యశస్వి.. ధర్మశాలలో తొలి రోజు టీమిండియాదే

Hari Prasad S HT Telugu

IND vs ENG 5th Test Live: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డులు తిరగరాసిన వేళ ధర్మశాల టెస్టు తొలి రోజే రోహిత్ సేన పట్టు బిగించింది. ఇంగ్లండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి.. తర్వాత సగానికిపైగా స్కోరు తొలి రోజే కొట్టేసింది.

రికార్డులు తిరగరాసిన యశస్వి.. ధర్మశాలలో తొలి రోజు టీమిండియాదే (PTI)

IND vs ENG 5th Test Live: యశస్వి జైస్వాల్ రికార్డులు తిరగరాశాడు. టీమిండియా తరఫున సునీల్ గవాస్కర్ తర్వాత ఒక సిరీస్ లో 700కుపైగా రన్స్ చేసిన రెండో ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు. అతనికితోడు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెలరేగడంతో ధర్మశాల టెస్ట్ తొలి రోజు పూర్తిగా టీమిండియా ఆధిపత్యం చెలాయించింది.

ఇంగ్లండ్ కు అసలు బజ్‌బాల్ రుచి చూపించింది. కుల్దీప్, అశ్విన్ జోరుతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లిష్ టీమ్ 218 పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 135 రన్స్ చేసింది.

యశస్వి రికార్డులు.. టీమిండియా పైచేయి

ధర్మశాలలో ఓవైపు చలి వణికిస్తుండగా.. ఇంగ్లండ్ టీమ్ ను మొదట మన స్పిన్నర్లు, తర్వాత యశస్వి, రోహిత్ శర్మలు మరింత వణికించారు. ఆ టీమ్ కు టాస్ గెలిచిన ఆనందం లేకుండా తొలి ఇన్నింగ్స్ లో కేవలం 218 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత వాళ్ల బజ్ బాల్ రుచి వాళ్లకే చూపిస్తూ వన్డే స్టైల్లో చెలరేగి ఆడారు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ.

ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 20.4 ఓవర్లలో 104 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యశస్వి ఈ సిరీస్ లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. అతడు కేవలం 58 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్ లతో 57 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ టెస్ట్ ప్రారంభానికి ముందు 4 టెస్టుల్లో 655 రన్స్ చేసిన యశస్వి.. తొలి ఇన్నింగ్స్ తర్వాత 712 రన్స్ తో నిలిచాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాటర్ గానూ రికార్డు క్రియేట్ చేశాడు.

జైస్వాల్ ఔటైన తర్వాత కూడా కెప్టెన్ రోహిత్, శుభ్‌మన్ గిల్ ధాటిగానే ఆడారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 135 రన్స్ చేసింది. రోహిత్ 52, గిల్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ కంటే ఇంకా 83 పరుగులు మాత్రమే వెనుకబడింది. రెండో రోజు ఇదే జోరు కొనసాగిస్తే.. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు భారీ ఆధిక్యం ఖాయమని చెప్పొచ్చు.

ఇండియన్ స్పిన్నర్లు చెలరేగిన అదే పిచ్ పై ఇంగ్లండ్ స్పిన్నర్లను మాత్రం మన బ్యాటర్లు ఆటాడుకున్నారు. తొలి రోజు ఇంగ్లండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్ 11 ఓవర్లలోనే 64, టామ్ హార్ట్‌లీ 12 ఓవర్లలో 46 రన్స్ సమర్పించుకున్నారు. టీమిండియా టాప్ 3 బ్యాటర్లు ఇప్పటికే 7 సిక్స్ లు, 13 ఫోర్లు బాదడం విశేషం.

కుల్దీప్, అశ్విన్ చెలరేగిన వేళ..

అంతకుముందు కుల్దీప్ యాదవ్ తన లెగ్ స్పిన్ తో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 218 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ జాక్ క్రాలీ ఒక్కడే 79 పరుగులతో రాణించగా.. మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేయడంతో ఇంగ్లిష్ టీమ్ తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది.

ఈ మ్యాచ్ లో కుల్దీప్ 5 వికెట్లతో చెలరేగాడు. అతనికి అశ్విన్ కూడా మంచి సహకారం అందిస్తూ 4 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 57.4 ఓవర్లలోనే 218 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ 79 రన్స్ చేశాడు.