తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Kkr: ఫస్ట్ ఫైట్‍కు సన్‍రైజర్స్ రెడీ.. కేకేఆర్‌తో ఢీ.. హెడ్ టూ హెడ్ రికార్డ్స్.. తుది జట్లు, పిచ్ ఎలా ఉండొచ్చంటే..

SRH vs KKR: ఫస్ట్ ఫైట్‍కు సన్‍రైజర్స్ రెడీ.. కేకేఆర్‌తో ఢీ.. హెడ్ టూ హెడ్ రికార్డ్స్.. తుది జట్లు, పిచ్ ఎలా ఉండొచ్చంటే..

23 March 2024, 8:54 IST

google News
    • SRH vs KKR IPL 2024: ఐపీఎల్ 2024లో తన తొలి పోరుకు సన్‍రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టుతో నేడు తలపడనుంది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఎస్‍ఆర్‌హెచ్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ వివరాలు ఇక్కడ చూడండి.
ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్
ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్

ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్

Sunrisers Hyderabad vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో తన తొలి పోరుకు సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు సిద్ధమైంది. కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుతో ఎస్‍ఆర్‌హెచ్ తలపడనుంది. ఐపీఎల్‍ 2024లో నేడు (మార్చి 23) రెండు మ్యాచ్‍లు జరగనున్నాయి. మధ్యాహ్నం పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్‍లో హైదరాబాద్, కోల్‍కతా ఆడనున్నాయి. నేడు కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఎస్‍ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వివరాలు ఇవే..

కొత్త సారథి

ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో తొలిసారి బరిలోకి దిగనుంది. ఈ సీజన్ కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్యాట్ కమిన్స్‌ను వేలంలో ఏకంగా రూ.20.50కోట్లకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు కెప్టెన్‍గా గతేడాది వన్డే ప్రపంచకప్, టెస్టు చాంపియన్‍షిప్ టైటిళ్లను అందించిన కమిన్స్.. ఐపీఎల్‍లోనూ ఎస్ఆర్‌హెచ్‍ను సక్సెస్‍ఫుల్‍గా ముందుకు నడిపిస్తాడని ఫ్రాంచైజీ, ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఐడెన్ మార్క్‌రమ్‍ను తప్పించి మరీ కమిన్స్‌ను కెప్టెన్‍ను చేసింది హైదరాబాద్.

గతేడాది ఐపీఎల్ 2023లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది. 14 మ్యాచ్‍‍ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి ఘోర ప్రదర్శన చేసింది. అయితే, ఐపీఎల్ 2024 సత్తాచాటాలని కసితో ఉంది. ముఖ్యంగా కమిన్స్ కెప్టెన్సీలో మ్యాజిక్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

శ్రేయస్ ఈజ్ బ్యాక్

కోల్‍కతా నైట్ రైడర్స్ కెప్టెన్‍గా శ్రేయస్ అయ్యర్ మళ్లీ తిరిగి వచ్చేశాడు. గతేడాది గాయం కారణంగా ఐపీఎల్‍కు శ్రేయస్ దూరం కాగా, కేకేఆర్‌కు నితేశ్ రాణా కెప్టెన్సీ చేశాడు. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి నిరాశపరిచింది కోల్‍కతా. అయితే, ఈ ఐపీఎల్ 2024కు శ్రేయస్ రెడీ అయ్యాడు. ఎస్‍ఆర్‌హెచ్‍తో మ్యాచ్‍లో బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది తొలిపోరులో గెలిచి శుభారంభం చేయాలని కోల్‍కతా, హైదరాబాద్ పట్టుదలగా ఉన్నాయి.

వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‍కతా జట్టు ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి తీసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాడిగా అతడు చరిత్ర సృష్టించాడు. చాలా ఏళ్ల తర్వాత ఐపీఎల్‍లో బరిలోకి దిగనున్న స్టార్క్ ఎలా పర్ఫార్మ్ చేస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

SRH vs KKR హెడ్‍ టూ హెడ్ రికార్డ్

ఐపీఎల్‍లో ఇప్పటి వరకు సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్ రైజర్స్ జట్లు 25 మ్యాచ్‍ల్లో తలపడ్డాయి. వీటిలో కోల్‍కతా 16 మ్యాచ్‍ల్లో గెలువగా.. హైదరాబాద్ 9సార్లు విజయం సాధించింది. హెడ్ టూ హెడ్‍లో కోల్‍కతాదే పైచేయిగా ఉంది. ఇక, ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య 9 మ్యాచ్‍లు జరిగాయి. వీటిలో కేకేఆర్ ఆరు గెలిచింది.

పిచ్ ఇలా..

ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్ మ్యాచ్ జరిగే కోల్‍కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ కాస్త స్లోగా ఉండే అవకాశం ఉంది. ఆరంభంలో పేసర్లకు కాస్త స్వింగ్, మూవ్‍మెంట్ దక్కొచ్చు. ఆ తర్వాత బ్యాటింగ్‍కు సులువుతుంది. స్పిన్నర్లకు టర్న్ కాస్త ఉండొచ్చు. మోస్తరు స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంటుంది.

తుది జట్లు ఇలా..

ఎస్‍ఆర్‌హెచ్ తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ/ మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమాద్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్

బ్యాటింగ్ ఫస్ట్ అయితే అబుల్ సమాద్‍ను.. సెకండ్ బ్యాటింగ్ అయితే నటరాజన్‍ను హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకునే ఛాన్స్ ఉంది.

కేకేఆర్ తుది జట్టు (అంచనా): వెంకటేశ్ అయ్యర్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితేశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రే రసెల్, రమణ్‍దీప్ సింగ్, సునీల్ నరేన్, మిచెస్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

హైదరాబాద్, కోల్‍కతా మ్యాచ్ నేడు (మార్చి 23) రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్స్, జియోసినిమా ఓటీటీలో లైవ్ చూడొచ్చు.

తదుపరి వ్యాసం