Pat Cummins in Hyderabad: సలార్ స్టైల్లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కమిన్స్.. నిప్పుతో చెలగాటమాడటానికి రెడీ-sunrisers hyderabad captain pat cummins reached hyderabad joins srh camp says ready to play with fire ipl 2024 news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pat Cummins In Hyderabad: సలార్ స్టైల్లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కమిన్స్.. నిప్పుతో చెలగాటమాడటానికి రెడీ

Pat Cummins in Hyderabad: సలార్ స్టైల్లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కమిన్స్.. నిప్పుతో చెలగాటమాడటానికి రెడీ

Hari Prasad S HT Telugu
Mar 19, 2024 11:29 AM IST

Pat Cummins in Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సలార్ స్టైల్లో హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. నిప్పుతో చెలగాటమాడటానికి తాను రెడీ అంటూ కమిన్స్ వచ్చేశాడు.

సలార్ స్టైల్లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కమిన్స్.. నిప్పుతో చెలగాటమాడటానికి రెడీ
సలార్ స్టైల్లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కమిన్స్.. నిప్పుతో చెలగాటమాడటానికి రెడీ

Pat Cummins in Hyderabad: ఐపీఎల్ 2024లో ఆడటానికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరాడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. అతడు హైదరాబాద్ లో అడుగుపెట్టిన వీడియోను ఆ ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మంగళవారం (మార్చి 19) తెల్లవారుఝామునే కమిన్స్ నగరానికి వచ్చాడు. మార్చి 23న సీజన్ తొలి మ్యాచ్ కోల్‌కతాలో ఆడనుంది సన్ రైజర్స్ టీమ్.

హైదరాబాద్‌లో కమిన్స్

గతేడాది ఆస్ట్రేలియాకు ఆరోసారి వన్డే వరల్డ్ కప్ సాధించి పెట్టిన ప్యాట్ కమిన్స్ ను వేలంలో రూ.20.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మధ్యే కెప్టెన్సీ కూడా అతనికి అప్పగించింది. ఇప్పటికే టీమ్ అంతా హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ చేస్తుండగా.. చివర్లో సలార్ స్టైల్లో కమిన్స్ వచ్చాడు. హోటల్ దగ్గర కమిన్స్ దిగిన వీడియోను ఆ టీమ్ షేర్ చేసింది.

బ్యాక్‌గ్రౌండ్ లో సలార్ మ్యూజిక్ యాడ్ చేయడం విశేషం. సలార్ లో ప్రభాస్ పిడికిలి బిగించిన సీన్ ఎంత పాపులర్ అయిందో తెలుసు కదా. ఇప్పుడు కమిన్స్ కూడా అలాగే పిడికిలి బిగించి ఫొటోలకు పోజులిచ్చాడు. "నిప్పుతో చెలగాటమాడటానికి కెప్టెన్స్ కమిన్స్ వచ్చేశాడు" అనే క్యాప్షన్ తో సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ అతని వీడియోను షేర్ చేసింది.

నేను రెడీ: కమిన్స్

ఈ సందర్భంగా ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు. కొత్త సీజన్ కోసం తాను రెడీ అని అన్నాడు. "నేను సిద్ధంగా ఉన్నాను. వెళ్లి ఆడేద్దాం. కొత్త సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే కొందరు ప్లేయర్స్ ను కలిశాను. మరికొందరిని కూడా కలుస్తాను. నిప్పుతో ఆడేద్దాం పదండి" అని కమిన్స్ అనడం విశేషం.

కమిన్స్ తోపాటు మంగళవారం న్యూజిలాండ్ వికెట్ కీపర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా హైదరాబాద్ వచ్చాడు. దీంతో దాదాపు టీమ్ లోని ప్లేయర్స్ అందరూ వచ్చేసినట్లే. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో తన తొలి మ్యాచ్ ను వచ్చే శనివారం (మార్చి 23) కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.

ఇక హైదరాబాద్ లో ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 27న జరగనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 5వ తేదీన ముంబై ఇండియన్స్ తో మరో మ్యాచ్ జరుగుతుంది. గత సీజన్లో దారుణమైన ప్రదర్శన చేసిన సన్ రైజర్స్ టీమ్.. ఈ కొత్త సీజన్ పై భారీ ఆశలు పెట్టుకుంది.

వేలంలో కమిన్స్ తోపాటు ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ లాంటి ప్లేయర్స్ ను కొనుగోలు చేసిన ఈ ఫ్రాంఛైజీ.. టీమ్ ను మరింత బలోపేతం చేసింది. కమిన్స్ కెప్టెన్సీలో ఈసారి టీమ్ ప్రదర్శన మెరుగువుతుందన్న ఆశతో అభిమానులు కూడా ఉన్నారు. మరోసారి ఓ ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రోఫీ అందిస్తాడని భావిస్తున్నారు.

గతంలో హైదరాబాద్ టీమ్ డెక్కన్ ఛార్జర్స్ గా ఉన్నప్పుడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలో 2009లో తొలిసారి ట్రోఫీ దక్కింది. ఆ తర్వాత 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఛాంపియన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరో ఆస్ట్రేలియన్ ప్యాట్ కమిన్స్ టీమ్ ను లీడ్ చేయబోతున్నాడు.

Whats_app_banner