Sunrisers Hyderabad Strongest XI: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత బలమైన తుది జట్టు ఇదే!-sunrisers hyderabad strongest xi in ipl 2024 srh team with new jersey new captain in new season ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sunrisers Hyderabad Strongest Xi: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత బలమైన తుది జట్టు ఇదే!

Sunrisers Hyderabad Strongest XI: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత బలమైన తుది జట్టు ఇదే!

Hari Prasad S HT Telugu
Mar 18, 2024 12:43 PM IST

Sunrisers Hyderabad Strongest XI: ఐపీఎల్ 2024 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త ఆశలతో బరిలోకి దిగుతోంది. మరి ఆ టీమ్ అత్యంత బలమైన తుది జట్టు ఏదో ఒకసారి చూద్దాం.

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత బలమైన తుది జట్టు ఇదే!
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత బలమైన తుది జట్టు ఇదే! (twitter)

Sunrisers Hyderabad Strongest XI: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్లో అడుగుపెట్టిన తర్వాత 2016లో ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. గతేడాది చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు కొత్త సీజన్లో కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో బరిలోకి దిగబోతోంది. మరి ఈ మెగా లీగ్ లో సన్ రైజర్స్ విన్నింగ్ కాంబినేషన్ ఎలా ఉండబోతోంది?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలా ఉందంటే..

సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో దారుణమైన ప్రదర్శన తర్వాత గత మినీ వేలంలో దూకుడుగా వెళ్లింది. ఏకంగా రూ.20.5 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను కొనుగోలు చేసింది. గతేడాది ఆస్ట్రేలియాకు ఆరోసారి వరల్డ్ కప్ అందించిన కమిన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టింది. ఊహించినట్లే ఏడెన్ మార్‌క్రమ్ ను పక్కన పెట్టి కమిన్స్ కే కెప్టెన్సీ అప్పగించింది.

కమిన్స్ తోపాటు ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ లాంటి బ్యాటర్లను కూడా వేలంలో కొనుగోలు చేసింది. దీంతో గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం సన్ రైజర్స్ టీమ్ బలంగా కనిపిస్తోంది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వెళ్లిపోయిన తర్వాత బలహీనంగా మారిన జట్టుకు ఇప్పుడు ఈ ఇద్దరితోపాటు సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్లాసెన్ లాంటి వాళ్లు బలంగా మారారు.

ఐపీఎల్లో హెడ్, మయాంక్ కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కమిన్స్ రాకతో సన్ రైజర్స్ పేస్ బౌలింగ్ మరింత బలంగా మారింది. ఇప్పటికే భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ లాంటి వాళ్లు జట్టులో ఉన్నారు. వాళ్లకు కమిన్స్ తోడవడంతో ఐపీఎల్లోనే అత్యంత బలమైన పేస్ బౌలింగ్ లైనప్ లో ఒకటిగా సన్ రైజర్స్ నిలిచింది.

అటు బ్యాటింగ్ లైనప్ లో ఇప్పటికే మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠీ, క్లాసెన్ లాంటి వాళ్లతో మిడిలార్డర్ బలంగా ఉంది. వీళ్లకుతోడు షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్ ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు. దీంతో ఈ సీజన్లో కొత్త కెప్టెన్ నేతృత్వంలో సన్ రైజర్స్ బలమైన ప్రదర్శన చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కమిన్స్ లాంటి స్ఫూర్తిదాయక కెప్టెన్ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్.

అయితే కమిన్స్ రాకతో హైదరాబాద్ టీమ్ నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగుతుందా లేక అదనంగా ఒక బ్యాటర్ ను జట్టులోకి తీసుకుంటుందా అన్నది చూడాలి. అదే జరిగితే అభిషేక్ శర్మ లేదా అబ్దుల్ సమద్ లాంటి వాళ్లు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సన్ రైజర్స్ ఈ సీజన్లో మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్ తో తొలి మ్యాచ్ ఆడనుంది.

సన్ రైజర్స్ బలమైన తుది జట్టు ఇదేనా?

ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ, ఏడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్/అభిషేక్ శర్మ

Whats_app_banner