SRH players in Team India: టీ20 వరల్డ్ కప్ జట్టులో ఈ ముగ్గురు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్!
17 April 2024, 13:40 IST
- SRH players in Team India: టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపిక నేపథ్యంలో అందరి కళ్లూ ఐపీఎల్ స్టార్లపైనే ఉంది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు పరిశీలించే అవకాశం ఉన్న ముగ్గురు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ ఎవరో చూడండి.
టీ20 వరల్డ్ కప్ జట్టులో ఈ ముగ్గురు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్!
SRH players in Team India: సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అసలు ఇది మన హైదరాబాద్ టీమేనా అన్నట్లుగా ఆడుతోంది. గత రెండు, మూడు సీజన్లుగా దారి తప్పిన టీమ్.. ఐపీఎల్ 2024లో మళ్లీ గాడిలో పడింది. హెడ్, క్లాసెన్, కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్, అబ్దుల్ సమద్ లాంటి ప్లేయర్స్ చెలరేగుతున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ నుంచి టీ20 వరల్డ్ కప్ జట్టు రేసులో ఉన్న ప్లేయర్స్ ఎవరో ఇక్కడ చూడండి.
ఊపు మీదున్న సన్ రైజర్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అంటే కొన్నాళ్లుగా పాయింట్ల టేబుల్లో కింది నుంచి చూడటం మొదలు పెట్టేవారు. కానీ ఈ సీజన్లో వాళ్ల ఆట మొత్తం మారిపోయింది. హెడ్, కమిన్స్ తప్ప మిగిలిన ప్లేయర్స్ కొన్నేళ్లుగా ఫ్రాంఛైజీతోనే ఉన్నా.. గతంలో చెలరేగని వాళ్లు కూడా ఈ సీజన్లో తమ సామర్థ్యానికి తగినట్లు ఆడుతున్నారు. హెడ్, క్లాసెన్ లాంటి విదేశీయులతోపాటు మన ఇండియన్ ప్లేయర్స్ కూడా అందులో ఉన్నారు.
వాళ్లలో ప్రధానంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు ఓపెనర్ అభిషేక్ శర్మ కాగా.. మరొకరు మన తెలుగు వాడైన నితీష్ కుమార్ రెడ్డి, ఇంకొకరు కశ్మీర్ ప్లేయర్ అబ్దుల్ సమద్. టీ20 వరల్డ్ కప్ కోసం వచ్చే నెల మొదటి వారంలో జట్టు ఎంపిక నేపథ్యంలో ఈ ముగ్గురు ప్లేయర్స్ లో ఎవరికైనా అందులో అవకాశం దక్కుతుందా అన్న చర్చ మొదలైంది.
టాప్ ఫామ్‌లో అభిషేక్ శర్మ
గత ఐదు సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతోనే ఉన్న ప్లేయర్ అభిషేక్ శర్మ. గతేడాది వరకూ అడపాదడపా మెరుపులు తప్ప నిలకడగా రాణించింది లేదు. కానీ ఈ సీజన్లో మాత్రం అభిషేక్ చెలరేగుతున్నాడు. హెడ్ తో కలిసి మెరుపు ఆరంభాలు ఇస్తున్నాడు. ఏకంగా 197.2 స్ట్రైక్ రేట్ తో 6 మ్యాచ్ లలో 211 రన్స్ చేసిన అభిషేక్ శర్మ పేరును సెలెక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది.
నితీష్ కుమార్ రెడ్డి
తెలుగు వాడైన నితీష్ కుమార్ రెడ్డి మంచి వికెట్ కీపర్ బ్యాటర్. టీ20ల్లో తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపింగ్ స్థానానికి విపరీతమైన పోటీ నేపథ్యంలో అతనికి అంతు సులువైన పని మాత్రం కాదు. అయితే డెత్ ఓవర్లలో నితీస్ చెలరేగుతున్న తీరు మాత్రం సెలెక్టర్లను ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. మూడు మ్యాచ్ లలోనే బ్యాటింగ్ అవకాశం రాగా.. 173.33 స్ట్రైక్ రేట్ తో 78 రన్స్ చేశాడు.
అబ్దుల్ సమద్
ఈమధ్యే ఆర్సీబీతో సన్ రైజర్స్ రికార్డు స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించిన ప్లేయర్ అబ్దుల్ సమద్. కొన్నేళ్లుగా సన్ రైజర్స్ తోనే ఉన్నా.. ఈ సీజన్లో మాత్రం అతని ఆటతీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏకంగా 225.53 స్ట్రైక్ రేట్ తో అతడు పరుగులు చేస్తుండటం విశేషం. భవిష్యత్తులో టీమిండియాలోకి అడుగుపెట్టే సామర్థ్యం ఉన్న ప్లేయర్ అతడు.
టాపిక్