తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl 2nd Odi: రోహిత్ బాదినా.. కుప్పకూలి ఓడిన టీమిండియా.. ఆరు వికెట్లతో విజృభించి దెబ్బకొట్టిన శ్రీలంక స్పిన్నర్

IND vs SL 2nd ODI: రోహిత్ బాదినా.. కుప్పకూలి ఓడిన టీమిండియా.. ఆరు వికెట్లతో విజృభించి దెబ్బకొట్టిన శ్రీలంక స్పిన్నర్

04 August 2024, 22:29 IST

google News
    • IND vs SL 2nd ODI: శ్రీలంక చేతిలో రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. ఓ దశలో పటిష్ట స్థితిలో నిలిచినా.. అమాంతం కుప్పకూలి పరాజయం పాలైంది. లంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సే ఆరు వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టాడు.
IND vs SL ODI: రోహిత్ బాదినా.. కుప్పకూలి ఓడిన టీమిండియా.. ఆరు వికెట్లతో విజృభించి దెబ్బకొట్టిన శ్రీలంక స్పిన్నర్
IND vs SL ODI: రోహిత్ బాదినా.. కుప్పకూలి ఓడిన టీమిండియా.. ఆరు వికెట్లతో విజృభించి దెబ్బకొట్టిన శ్రీలంక స్పిన్నర్ (AP)

IND vs SL ODI: రోహిత్ బాదినా.. కుప్పకూలి ఓడిన టీమిండియా.. ఆరు వికెట్లతో విజృభించి దెబ్బకొట్టిన శ్రీలంక స్పిన్నర్

శ్రీలంకతో తొలి వన్డేలో గెలిచే స్థితి నుంచి అనూహ్యంగా టై చేసుకున్న టీమిండియా.. రెండో వన్డేలో టపటపా కుప్పకూలి ఓడింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడైన అర్ధ శకతంతో దుమ్మురేపడంతో సులువుగా గెలిచేస్తుందనుకున్న భారత్.. వరుసగా వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‍లో 1-0తో శ్రీలంక ఆధిక్యంలోకి వెళ్లింది. కొలంబో వేదికగా నేడు (ఆగస్టు 4) జరిగిన రెండో వన్డేలో భారత్ 32 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓడింది. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సే ఆరు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు.

241 పరుగుల లక్ష్యఛేదనలో ఓ దశలో 13.2 ఓవర్లలో 97 పరుగులకు వికెట్ కోల్పోకుండా పటిష్టంగా నిలిచింది భారత్. ఆ తర్వాతి నుంచి వరుసగా వికెట్లు పడ్డాయి. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటై భారత్ ఓటమి పాలైంది. తొలి వన్డేలో అర్ధ శకతంతో దుమ్మురేపిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ రెండో మ్యాచ్‍లోనూ అదరగొట్టినా టీమిండియా పరాజయం చెందింది. ఇది ఎలా సాగిందంటే..

రోహిత్ ధనాధన్

లక్ష్యఛేదనను భారత్ అద్భుతంగా ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 64 పరుగులతో దుమ్మురేపాడు. 5 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో దుమ్మురేపాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. శుభ్‍మన్ గిల్ (44 బంతుల్లో 35 పరుగులు) నిలకడగా ఆడాడు. దూకుడు కొనసాగించిన రోహిత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అయితే, 14వ ఓవర్లో లంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సే బౌలింగ్‍లో రోహిత్ ఔటయ్యాడు. దీంతో 97 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. శుభ్‍మన్ గిల్ 18వ ఓవర్లో వాండర్సే బౌలింగ్‍లోనే పెవిలియన్ చేరాడు.

టపాటపా కూలిన టీమిండియా

శ్రీలంక స్పిన్నర్ వాండర్సే ధాటికి భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది. శివమ్ దూబే (0)ను కూడా 18వ ఓవర్లోనే అతడు ఔట్ చేశాడు. విరాట్ కోహ్లీ (14) కూడా త్వరగానే ఔట్ కాగా.. శ్రేయస్ అయ్యర్ (7) కూడా క్యూ కట్టాడు. కేఎల్ రాహుల్ (0) డకౌట్ అయ్యాడు. తొలి ఆరు వికెట్లను వాండర్సనే కైవసం చేసుకున్నాడు. 50 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లను భారత్ చేజార్చుకుంది. 147 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

పోరాడిన అక్షర్ పటేల్

భారత ఆల్‍రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా పోరాడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడాడు. 44 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు అక్షర్. వాషింగ్టన్ సుందర్ (15) అతడికి సహకరించాడు. ఇద్దరూ 38 పరుగల భాగస్వామ్యం చేయడంతో టీమిండియాలో ఆశలు చిగురించాయి. అయితే, 34వ ఓవర్లో అక్షర్ ఔటయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ కూడా వెంటనే ఔటయ్యాడు. మహమ్మద్ సిరాజ్ (4) కాసేపు నిలిచి పెవిలియన్ చేరాడు. కుల్దీప్ యాదవ్ (7) నాటౌట్‍గా నిలువగా.. చివరి వికెట్‍గా అర్షదీప్ ఔటయ్యాడు. దీంతో 43వ ఓవర్లోనే భారత్ ఆలౌటైంది.

లంక బౌలర్లలో జెఫ్రే వాండర్సే 10 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 6 వికెట్లతో సత్తాచాటాడు. కెప్టెన్ చరిత్ అసలంక మూడు వికెట్లు తీసుకున్నాడు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. కమిందు మెండిస్ (40 పరుగులు), అవిష్క ఫెర్నాండో (40), దునిత్ వెల్లలాగే (39) రాణించారు. జట్టు కష్టాల్లో పడినా చివర్లో కమిందు, వెల్లలాగే ఆదుకున్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు, మహమ్మద్ సిరాజ్, అక్షల్ పటేల్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

భారత్, శ్రీలంక మధ్య మూడో వన్డే ఆగస్టు 7న జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఈ సిరీస్‍ను 1-1తో భారత్ సమం చేసుకోగలదు. ఓడితే సిరీస్ చేజారుతుంది.

తదుపరి వ్యాసం