IND vs SL 2nd ODI: మళ్లీ అతడే.. లంకను ఆదుకున్న యంగ్ బ్యాటర్.. రాణించిన లోయర్ ఆర్డర్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం-ind vs sl 2nd odi dunith wellalage saves sri lanka again small targer for india cricket sl vs ind odi series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl 2nd Odi: మళ్లీ అతడే.. లంకను ఆదుకున్న యంగ్ బ్యాటర్.. రాణించిన లోయర్ ఆర్డర్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం

IND vs SL 2nd ODI: మళ్లీ అతడే.. లంకను ఆదుకున్న యంగ్ బ్యాటర్.. రాణించిన లోయర్ ఆర్డర్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 04, 2024 06:30 PM IST

IND vs SL 2nd ODI: రెండో వన్డేలోనూ శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. అయితే, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మళ్లీ రాణించాడు లంక బ్యాటర్ దిముత్ వెల్లలాగే. కమిందు మెండిస్ కూడా అదరగొట్టాడు. దీంతో టీమిండియా ముందు మోస్తరు టార్గెట్ ఉంది.

IND vs SL 2nd ODI: మళ్లీ అతడే.. లంకను ఆదుకున్న యంగ్ బ్యాటర్.. రాణించిన లోయర్ ఆర్డర్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం
IND vs SL 2nd ODI: మళ్లీ అతడే.. లంకను ఆదుకున్న యంగ్ బ్యాటర్.. రాణించిన లోయర్ ఆర్డర్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం (AFP)

శ్రీలంకతో రెండో వన్డేలో ముందుగా బౌలింగ్‍లో రాణించిన భారత్.. చివరి 10 ఓవర్లలో వికెట్లు వేగంగా తీయలేకపోయింది. లంక లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సత్తాచాటారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక మోస్తరు స్కోరు చేసింది. ఈ మూడు వన్డేల సిరీస్‍లో ఉత్కంఠ మధ్య జరిగిన తొలి మ్యాచ్ టై కాగా.. రెండో పోరు నేడు (ఆగస్టు 4) జరుగుతోంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. భారత్ ముందు 241 లక్ష్యం ఉంది. లంక బ్యాటింగ్ ఎలా సాగిందంటే..

మళ్లీ వెల్లలాగేనే.. దుమ్మురేపిన కమిందు

శ్రీలంక యంగ్ బ్యాటర్ దినిత్ వెల్లలాగే తొలి వన్డేలో అజేయంగా 65 బంతుల్లో 67 పరుగులు చేసి అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అర్ధ శకతం చేసి మోస్తరు స్కోరు వచ్చేలా చేశారు. నేడు రెండో వన్డేలోనూ దిముత్ వెల్లలాగే చివర్లో నిలిచాడు. 136 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో ఉన్న సమయంలో దూకుడుగానే ఆడాడు. 37 బంతుల్లో 39 పరుగులతో (1 ఫోర్, 2 సిక్స్‌లు) వెల్లాలగే రాణించాడు. ధీటుగా ఆడాడు. అయితే, చివరి వరకు నిలువలేకపోయాడు. 47 ఓవర్లో వెల్లలాగేను భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. లంక లోయర్ ఆర్డర్ బ్యాటర్ కమిందు మెండిస్ 44 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. వేగంగా ఆడుతూ దుమ్మురేపాడు కమిందు . 4 ఫోర్లతో రాణించాడు. చివరి ఓవర్లో రనౌట్ అయ్యాడు. వెల్లలాగే ఔటయ్యాక కమిందు అదరగొట్టడంతో లంక ఆ స్కోరు చేయగలిగింది.

తొలి బంతికే వికెట్.. లంక తడబాటు

ఈ రెండో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. లంక ఓపెనర్ పాతుమ్ నిస్సంకను తొలి బంతికే ఔట్ చేశాడు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్. శుభారంభం చేశాడు. ఆ తర్వాత లంక బ్యాటర్లు అవిష్క ఫెర్నాండో (62 బంతుల్లో 40 పరుగులు), కుషాల్ మెండిస్ (42 బంతుల్లో 30 పరుగులు) నిలకడగా ఆడారు. అయితే, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో వేగంగా పరుగులు చేయలేకపోయారు. రెండో వికెట్‍కు ఫెర్నాండో, మెండిస్ 74 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

17వ ఓవర్లో అవిష్కను ఔట్ చేసి బ్రేక్‍త్రూ ఇచ్చాడు టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్. 19వ ఓవర్లో కుషాల్ మెండిస్‍ను కూడా ఔట్ చేసి దెబ్బకొట్టాడు. అనంతరం సదీర సమరవిక్రమ (31 బంతుల్లో 14 పరుగులు) కాసేపు నిలిచినా వేగంగా ఆడలేకపోయాడు. చరిత్ అసలంక (42 బంతుల్లో 25 పరుగులు), జనిత్ లియానగే (29 బంతుల్లో 12 పరుగులు) కూడా నిదానంగానే బ్యాటింగ్ చేశారు. దీంతో లంక స్కోరు బోర్డు నెమ్మదిగా ముందుకు సాగింది. లియానగేను కుల్దీప్ యాదవ్, అసలంకను వాషింగ్టన్ ఔట్ చేయండంతో 136 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో పడింది.

చివర్లో అదరగొట్టిన లంక

ఆ తరుణంలో వెల్లలాగే అదరగొట్టాడు. వేగంగా పరుగులు చేసి ముందుకుసాగాడు. కమిందు మెండిస్ కూడా రాణించాడు. వెల్లలాగే, కమిందు దుమ్మురేపటంతో లంక స్కోరు వేగంగా ముందుకు సాగింది. ఈ ఇద్దరు బ్యాటర్లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. 71 బంతుల్లోనే 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వెల్లాలాగే ఔటైనా కమిందు నిలిచాడు. చివరి ఓవర్లో రనౌట్ అయ్యాడు. చివర్లో అఖిల్ ధనుంజయ (13 బంతుల్లో 15 పరుగులు) మెప్పించాడు. ఇలా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సత్తాచాటడంతో లంక ఆ స్కోరు దక్కింది. చివరి పది ఓవర్లలో 79 పరుగులు రాబట్టింది శ్రీలంక.

భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 10 ఓవర్లలో 30 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.