Ind vs SL 1st ODI: ఒక్క పరుగు చేయలేక.. రెండు బంతుల్లో రెండు వికెట్లు.. గెలిచే మ్యాచ్ టై చేసుకున్న టీమిండియా..
Ind vs SL 1st ODI: ఇండియా, శ్రీలంక తొలి వన్డే టైగా ముగిసింది. గెలవాల్సిన మ్యాచ్ లో ఒక్క పరుగు చేయలేక రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. మ్యాచ్ ను టై చేసుకుంది.
Ind vs SL 1st ODI: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో గెలుస్తుందనుకున్న టీమిండియా చివరిక మ్యాచ్ ను టైగా ముగించింది. విజయానికి ఒక్క పరుగు అవసరం ఉన్న సమయంలో రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది ఇండియన్ టీమ్. గెలిపిస్తాడనుకున్న శివమ్ దూబె (24 బంతుల్లో 25 రన్స్) ఎల్బీడబ్ల్యూ కావడం, తర్వాత వచ్చిన అర్ష్‌దీప్ (0) చెత్త షాట్ ఆడి తొలి బంతికే ఔటవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇండియా, శ్రీలంక మ్యాచ్ వన్డేల్లో టై కావడం ఇది కేవలం రెండోసారి మాత్రమే.
రోహిత్ మెరిసినా..
తొలి వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిసినా.. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబెలాంటి వాళ్లు పోరాడినా గెలవలేకపోయింది. 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. చివరికి 47.5 ఓవర్లలో సరిగ్గా 230 పరుగులకే ఆలౌటైంది. చివర్లో సిక్స్, ఫోర్ కొట్టి స్కోరు సమం చేసిన శివమ్ దూబె.. మరో పరుగు చేస్తే గెలుస్తుందనుకున్న సమయంలో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అది 9వ వికెట్. తర్వాత వచ్చిన అర్ష్‌దీప్ తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి ఎల్బీడబ్ల్యూ కావడంతో ఇండియా ఆ ఒక్క పరుగు చేయలేక మ్యాచ్ ను టైగా ముగిసింది.
ఈ మ్యాచ్ లో 231 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. తొలి వికెట్ కు రోహిత్, శుభ్‌మన్ గిల్ 75 పరుగులు జోడించడంతో ఇండియా సులువుగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ లంక స్పిన్నర్లు వెల్లాలగె, హసరంగా, అసలంక రావడంతో పరిస్థితి మారిపోయింది. ధాటిగా ఆడిన రోహిత్ (47 బంతుల్లో 58) ఔటవడంతో తర్వాత ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది.
మొదట్లోనే కట్టడి చేసినా..
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆ టీమ్.. 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 రన్స్ చేసింది. ఓపెనర్ నిస్సంక, టెయిలెండర్లో వెల్లాలగే హాఫ్ సెంచరీలు చేయడంతో లంక ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. టీమిండియా బౌలర్లు ఈ మ్యాచ్ లో మొదట చెలరేగి శ్రీలంక టాప్, మిడిలార్డర్ ను దెబ్బతీసినా.. తర్వాత వాళ్లకు కోలుకునే అవకాశం ఇచ్చారు.
ఒక దశలో ఆ టీమ్ 26.3 ఓవర్లలో 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఈ ఇద్దరు బౌలర్లు తమ 10 ఓవర్ల కోటాలో చెరో 33 పరుగులు మాత్రమే ఇచ్చారు. అక్షర్ 2, కుల్దీప్ ఒక వికెట్ తీసుకున్నాడు.
ఆ ఇద్దరు హాఫ్ సెంచరీలతో..
అవిష్క ఫెర్నాండో (1), కుశల్ మెండిస్ (14), సమరవిక్రమ (8), కెప్టెన్ చరిత్ అసలంక (14), లియనాగె (20) విఫలమయ్యారు. అయితే ఓపెనర్ నిస్సంక, టెయిలెండర్లో వెల్లాలగె టీమిండియా బౌలర్ల జోరును అడ్డుకున్నారు. మొదట నిస్సంక (75 బంతుల్లో 56) హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో వెల్లాలగె వికెట్లు పడకుండా అడ్డుపడటంతోపాటు ధాటిగా ఆడాడు. అతడు కేవలం 65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 66 రన్స్ చేశాడు.
దీంతో శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేయగలిగింది. బౌలర్లు హసరంగ (20), ధనంజయ (17) కూడా బ్యాట్ తో రాణించారు. ఒక దశలో శ్రీలంక 150 పరుగులైనా చేస్తుందా అని అనిపించినా.. వీళ్ల పోరాటంతో 230 రన్స్ చేయడం విశేషం. ఇండియా బౌలర్లలో అక్షర్, అర్ష్‌దీప్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. సిరాజ్, కుల్దీప్, శివమ్ దూబె, సుందర్ తలా ఒక వికెట్ తీశారు.