Rohit Sharma Lamborghini Car: రూ.4 కోట్ల విలువైన లంబోర్ఘిని కారులో రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Rohit Sharma Lamborghini Car: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన రూ.4 కోట్ల విలువైన లంబోర్ఘిని కారులో ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. రోహిత్ దగ్గర ఉన్న ఎన్నో లగ్జరీ కార్లలో ఈ బ్లూ కారు కూడా ఒకటి.
Rohit Sharma Lamborghini Car: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం హాలీడే ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చే నెలలో శ్రీలంకతో వన్డే సిరీస్ తో మళ్లీ టీమ్ తో చేరనున్న అతడు.. తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో తన లగ్జరీ బ్లూ కలర్ లంబోర్ఘిని కారులో కనిపించాడు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీతో కలిసి రోహిత్ వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది.
రూ.4 కోట్ల లంబోర్ఘిని కారు
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాకు వచ్చి ఇక్కడి సెలబ్రేషన్స్ లో పాల్గొన్న రోహిత్ శర్మ.. తర్వాత హాలిడే ఎంజాయ్ చేయడానికి మరోసారి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం (జులై 25) అతడు మరోసారి ఇండియాకు తిరిగి వచ్చాడు. ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత భార్య రతికా సజ్దే, కూతురు సమైరాతో కలిసి తన బ్లూ కలర్ లంబోర్ఘిని కారులో వెళ్లాడు.
ఈ కారును రోహితే స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్లడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ లగ్జరీ కారు విలువ రూ.4.18 కోట్లు కావడం విశేషం. ఎయిర్ పోర్టు బయట ఉన్న ఎంతో మంది ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడుతుండగా.. రోహిత్ తన ఫ్యామిలీతో కలిసి ఈ కారులో వెళ్లాడు. రోహిత్ దగ్గర ఇదొక్కటే కాదు.. మరెన్నో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
రోహిత్ కార్ల కలెక్షన్
టీమిండియా క్రికెటర్లలో ధోనీ, కోహ్లి, హార్దిక్ పాండ్యాలాంటి వాళ్లకు కార్లంటే ఎంతో ఇష్టం. ఈ అందరు క్రికెటర్ల దగ్గర ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర కూడా ఎన్నో ఎస్యూవీలు ఉన్నాయి. అందులో ఈ లంబోర్ఘిని కారు ఒక్కటే కాదు.. మరికొన్ని లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది.
అందులో రూ.1.32 కోట్ల విలువైన మెర్సిడీస్ బెంజ్ జీఎల్ఎస్ కారు, రూ.4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారు కూడా ఉన్నాయి. ఇక సెడాన్ కార్ల విషయానికి వస్తే.. రోహిత్ శర్మ దగ్గర మెర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు ఉంది. దీని విలువ రూ.1.76 కోట్లు.
టీమిండియా శ్రీలంక టూర్
శ్రీలంకలో మూడు టీ20ల సిరీస్ కోసం టీమిండియా ఆ దేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫార్మాట్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో అతడు దూరంగా ఉన్నాడు. ఆగస్ట్ 2 నుంచి 7 వరకు జరగబోయే వన్డే సిరీస్ కోసం రోహిత్ అక్కడికి వెళ్లనున్నాడు.
నిజానికి ఈ సిరీస్ కు కూడా మొదట అతడు దూరంగా ఉండాలని భావించినా.. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో రోహిత్ తోపాటు విరాట్ కోహ్లిని కూడా ఎంపిక చేశారు. శ్రీలంకతో మూడు వన్డేలు జరగనున్నాయి. ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఈ సిరీస్ కు రోహితే కెప్టెన్ గా ఉంటాడు.