Mohammed Shami Suicide: షమి సూసైడ్ చేసుకుందానుకున్నాడు.. అతని ముఖం మొత్తం నెత్తురే: టీమిండియా బౌలర్ షాకింగ్ కామెంట్స్
Mohammed Shami Suicide: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడని, 19వ అంతస్తు బాల్కనీలో నిల్చొన్నాడని మరో పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ చెప్పడం సంచలనం రేపుతోంది.
Mohammed Shami Suicide: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడా? 19వ అంతస్తు బాల్కనీ నుంచి దూకుదామని భావించాడా? ఈ విషయాన్ని మరెవరో కాదు మరో టీమిండియా పేస్ బౌలర్ ఉమేష్ యాదవే చెప్పడం గమనార్హం. తాజాగా శుభాంకర్ మిశ్రా అన్‌ప్లగ్గ్‌డ్ అనే పాడ్‌కాస్ట్ లో ఉమేష్ మాట్లాడుతూ.. తనకు, షమికి జరిగిన ఓ కారు ప్రమాదం గురించి కూడా వెల్లడించాడు.
షమి ఆత్మహత్య చేసుకుందామని..
మహ్మద్ షమి టీమిండియా అత్యుత్తమ పేస్ బౌలర్లో ఒకడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసుకున్న ఇండియన్ బౌలర్. కానీ కెరీర్లో గాయాలతో, వ్యక్తిగత జీవితంలో తన భార్య హసీన్ జహాన్ తో విడాకుల రూపంలో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఒక దశలో ఆమె తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినప్పుడు ఆత్మహత్య కూడా చేసుకుందామని భావించాడట. ఈ విషయాన్ని ఉమేష్ యాదవ్ వెల్లడించాడు.
"ఆ దశలో షమి ప్రతి సమస్యతో పోరాడుతున్నాడు. అతడు నా ఇంట్లో నాతోనే ఉండేవాడు. కానీ పాకిస్థాన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం అతడు బాగా కుంగిపోయాడు. ఏదైనా భరిస్తాను కానీ.. దేశ ద్రోహం చేశాననడాన్ని మాత్రం సహించను అన్నాడు. ఆ రాత్రి ఆత్మహత్య చేసుకుందానుకున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. ఆ రోజు తెల్లవారుఝామున 4 గంటలు అయింది. నీళ్లు తాగుదామని లేచాను.
కిచెన్‌కు వెళ్లే సమయంలో అతడు బాల్కనీలో కనిపించాడు. అది 19వ అంతస్తులో ఉంది. ఏం జరిగిందో నాకు అర్థమైంది. షమి కెరీర్లో ఆ రాత్రి సుదీర్ఘమైనది. ఆ తర్వాత ఒక రోజు ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణలో తనకు క్లీన్ చిట్ వచ్చిందన్న మెసేజ్ అతని ఫోన్ కు వచ్చింది. ఆ సమయంలో అతడు వరల్డ్ కప్ గెలిచినదాని కంటే కూడా ఎక్కువ సంతోషంగా కనిపించాడు" అని ఉమేష్ చెప్పాడు.
ఆ రోజు షమి ముఖమంతా రక్తమే: ఉమేష్
ఇక ఇదే పాడ్‌కాస్ట్ లో తనకు, షమికి జరిగిన ఓ కారు ప్రమాదం గురించి కూడా ఉమేష్ వెల్లడించాడు. "షమికి క్లీన్ చిట్ వచ్చింది. దీంతో అదే రోజు మేము డెహ్రాడూన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కాని ఆ రాత్రి మేము చావును చాలా దగ్గరగా చూసి వచ్చాం. డెహ్రాడూన్ వెళ్లి అక్కడ ఉండి ప్రాక్టీస్ చేసుకొని తిరిగి వస్తున్నాం.
ఉదయం 5.30 గంటల సమయంలో ప్రయాణంలోనే కళ్లు మూతలు పడ్డాయి. హఠాత్తుగా కారు పూర్తిగా ముక్కలైనట్లుగా అనిపించింది. మమ్మల్ని మేము నియంత్రించుకునేలోపే షమి ముఖమంతా రక్తం కనిపించింది. అతడు దారుణంగా గాయపడ్డాడు. చాలా రక్తం పోయింది" అని ఉమేష్ చెప్పాడు.
ఈ ఘటన తమ ఇద్దరినీ తీవ్రంగా వణికించిందని కూడా అతడు తెలిపాడు. అయితే రిషబ్ పంత్ అంత దారుణమైన ప్రమాదం మాత్రం అది కాదని, కారు పూర్తిగా డ్యామేజ్ అయినా.. తాము మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు ఉమేష్ వెల్లడించాడు. ఓ ట్రక్ తమ కారును ముందు నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అతడు తెలిపాడు.