Dunith Wellalage: రోహిత్, కోహ్లిలకు దడపుట్టించిన 20 ఏళ్ల మిస్టరీ స్పిన్నర్ వెల్లలాగే - అతడి జర్నీ ఇదే!
Dunith Wellalage: ఆసియా కప్‌లో టీమ్ ఇండియాతో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో తన స్పిన్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు దడపుట్టించాడు శ్రీలంక మిస్టరీ స్పిన్సర్ దునిత్ వెల్లలాగే. ఈ ఇరవై ఏళ్ల మిస్టరీ స్పిన్నర్ క్రికెట్ జర్నీ ఎలా మొదలైందంటే...
Dunith Wellalage: ఆసియా కప్ సూపర్ ఫోర్ రౌండ్‌లో శ్రీలంకపై కష్టపడి విజయాన్ని సాధించింది టీమీండియా. శ్రీలంక యువ బౌలర్ వెల్లలాగేతో పాటు పార్ట్‌టైమ్ బౌలర్ అసంలక ధాటికి టీమీండియా బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. రోహిత్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ సింగిల్స్ తీయడానికే ఇబ్బందులుపడ్డారు. రోహిత్ మెరుపులతో పది ఓవర్లలోనే టీమ్ ఇండియా 80 పరుగులు చేయడంతో మరోసారి పరుగుల వరద ఖాయమని అనుకున్నారు.
11 ఓవర్‌లో వెల్లలాగే ఎంట్రీతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. తాను వేసిన తొలి ఓవర్‌లోనే శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసి టీమ్ ఇండియ పతనాన్ని శాసించాడు వెల్లలాగే. ఆ తర్వాత కోహ్లి, రోహిత్‌లను ఔట్ చేసి పెద్ద షాకిచ్చాడు.
ఈ మ్యాచ్‌లో పది ఓవర్లు వేసి ఒక మెయిడిన్‌తో కేవలం 40 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు వెల్లలాగే. రోహిత్, కోహ్లిలను తన స్పిన్‌తో ఇబ్బందులుపెట్టిన వెల్లలాగే ఈ మ్యాచ్‌తో హీరోగా మారిపోయాడు. శ్రీలంక ఓడిన వెల్లలాగే మాత్రం క్రికెట్ అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు.
ఎవరీ వెల్లలాగే...
దునిత్ వెల్లలాగేకు పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేదు. ఇప్పటివరకు శ్రీలంక తరఫున 13 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. వన్డేల్లో టీమ్ ఇండియాపై తీసిన ఐదు వికెట్ల ప్రదర్శనే అతడికి అత్యుత్తమం.
అండర్ 19 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు వెల్లలాగే. అండర్ 19 వరల్డ్ కప్‌లో 17 వికెట్లు, 264 పరుగులు చేశాడు. శ్రీలంక తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ టోర్నీలో స్కాట్‌లాండ్, ఆస్ట్రేలియాలపై ఐదు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు.
గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌తో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు వెల్లలాగే. పాకిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. టీమ్ ఇండియాపై రాణించి వరల్డ్ కప్‌లో తన స్థానాన్ని దాదాపు ఖాయం చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ కోసం శ్రీలంక ప్రకటించిన జట్టులో స్టాండ్‌బై ప్లేయర్‌గా వెల్లలాగే ఎంపికయ్యాడు.