తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Rr Ipl 2024 Qualifier 2: మళ్లీ చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. మోస్తరు స్కోరుకే పరిమితం.. ఫైనల్ చేరతారా?

SRH vs RR IPL 2024 Qualifier 2: మళ్లీ చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. మోస్తరు స్కోరుకే పరిమితం.. ఫైనల్ చేరతారా?

Hari Prasad S HT Telugu

24 May 2024, 21:25 IST

google News
    • SRH vs RR IPL 2024 Qualifier 2: ఐపీఎల్ 2024 రెండో క్వాలిఫయర్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. క్లాసెన్ మాత్రమే హాఫ్ సెంచరీ చేయడంతో ఆ టీమ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
మళ్లీ చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. మోస్తరు స్కోరుకే పరిమితం
మళ్లీ చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. మోస్తరు స్కోరుకే పరిమితం (AP)

మళ్లీ చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. మోస్తరు స్కోరుకే పరిమితం

SRH vs RR IPL 2024 Qualifier 2: లీగ్ స్టేజ్ మొదట్లో భారీ స్కోర్లతో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కీలకమైన సమయంలో చేతులెత్తేస్తున్నారు. తొలి క్వాలిఫయర్ లాగే రెండో క్వాలిఫయర్ లోనూ టాప్, మిడిలార్డర్ లో కొందరు కీలక బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 రన్స్ చేయగలిగింది.

క్లాసెన్ ఒక్కడే..

సన్ రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. టాపార్డర్ లో వికెట్లు టపటపా పడిపోవడంతో క్లాసెన్ తన స్పీడులో కాకపోయినా.. అవసరమైన సమయంలో ఫిఫ్టీ చేసి ఆదుకున్నాడు. క్లాసెన్ 34 బంతుల్లో 4 సిక్స్ లతో 50 రన్స్ చేశాడు. అయితే అతడు క్రీజులో ఉంటే భారీ స్కోరు ఖాయం అనుకున్న సమయంలో 19వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు.

దీంతో సన్ రైజర్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. అటు బౌలర్లకు, ఇటు బ్యాటర్లకు సమానంగా అనుకూలిస్తున్న పిచ్ పై సన్ రైజర్స్ మంచి స్కోరే సాధించినట్లు క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇక టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లే భారం బౌలర్లపైనే ఉంది.

సన్ రైజర్స్ వికెట్లు టపాటపా

ఈ కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. లీగ్ మొత్తం మెరుపులు మెరిపిస్తున్న సన్ రైజర్స్ ఓపెనర్లు ఈసారైనా చెలరేగుతారన్న ఆశ అభిమానుల్లో కలిగింది. అయితే తొలి ఓవర్లోనే ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన అభిషేక్ శర్మ (12) ఔటయ్యాడు. దీంతో 13 పరుగులకే తొలి వికెట్ పడిపోయింది.

ఈ దశలో హెడ్ తో కలిసిన రాహుల్ త్రిపాఠీ వచ్చీ రాగానే మెరుపులు మెరిపించాడు. అతడు కేవలం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 37 రన్స్ చేశాడు. అభిషేక్ ఫెయిలైనా ఆ లోటు త్రిపాఠీ తీరుస్తున్నాడనుకునేలోపే అతడు ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏడెన్ మార్‌క్రమ్ (1) మరోసారి నిరాశపరిచాడు. దీంతో సన్ రైజర్స్ 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

హెడ్, క్లాసెన్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ ఇద్దరూ చివరి వరకూ ఉన్నా భారీ స్కోరు ఖాయం అన్న భరోసా ఉంది. కానీ హెడ్ కూడా 28 బంతుల్లో 34 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో 99 పరుగుల దగ్గర నాలుగో వికెట్ పడింది. నితీష్ కుమార్ (5), అబ్దుల్ సమద్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. దీంతో 120 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి. ఈ దశలో ఇక 200 స్కోరు అసాధ్యమని తేలిపోయింది.

క్లాసెన్ మెరుపులు సన్ రైజర్స్ ను ఆ దిశగా తీసుకెళ్తాయని అనుకున్నా.. అతడూ 19వ ఓవర్ తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులకే పరిమితమైంది. మరి ఈ స్కోరును బౌలర్లు డిఫెండ్ చేయగలరో లేదో చూడాలి.

తదుపరి వ్యాసం