తెలుగు న్యూస్  /  క్రికెట్  /  South Africa U19 Vs India U19: చెలరేగిన సచిన్, ఉదయ్.. సౌతాఫ్రికా చిత్తు.. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఇండియా

South Africa U19 vs India U19: చెలరేగిన సచిన్, ఉదయ్.. సౌతాఫ్రికా చిత్తు.. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఇండియా

Hari Prasad S HT Telugu

06 February 2024, 21:31 IST

google News
    • South Africa U19 vs India U19: అండర్ 19 వరల్డ్ కప్ లో మరోసారి ఫైనల్ చేరింది యంగిండియా. సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహరన్ వీరోచిత హాఫ్ సెంచరీలతో సెమీఫైనల్లో ఆతిథ్య సౌతఫ్రికాను చిత్తు చేసింది. ఫైనల్ చేరడం ఇండియాకు ఇది 9వ సారి కావడం విశేషం.
ఇండియా అండర్ 19 జట్టును ఫైనల్ చేర్చిన సచిన్ దాస్, ఉదయ్ సహరన్
ఇండియా అండర్ 19 జట్టును ఫైనల్ చేర్చిన సచిన్ దాస్, ఉదయ్ సహరన్

ఇండియా అండర్ 19 జట్టును ఫైనల్ చేర్చిన సచిన్ దాస్, ఉదయ్ సహరన్

South Africa U19 vs India U19: ఇప్పటికే ఐదుసార్లు అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా ఇప్పుడు ఆరో టైటిల్ పై కన్నేసింది. మంగళవారం (ఫిబ్రవరి 6) ఆతిథ్య సౌతాఫ్రికా అండర్ 19 టీమ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా అండర్ 19 రెండు వికెట్లతో విజయం సాధించి ఫైనల్ చేరింది.

245 పరుగుల టార్గెట్ చేజింగ్ లో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా సచిన్ దాస్ (96), కెప్టెన్ ఉదయ్ సహరన్ (81) హాఫ్ సెంచరీలతో యంగిండియా 9వసారి అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా అండర్ 19, పాకిస్థాన్ అండర్ 19 టీమ్స్ మధ్య గురువారం (ఫిబ్రవరి 8) జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో ఇండియా ఫైనల్లో తలపడుతుంది.

అండర్ 19 హీరోలు సచిన్, ఉదయ్

అండర్ 19 వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్లో ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో ఇండియా బెనోనీలో తలపడింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా అండర్ 19 విసిరిన 245 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా పేసర్లు మఫాకా, ట్రిస్టన్ లూస్ చెలరేగారు. దీంతో ఆదర్ష్ సింగ్ (0), అర్షిన్ కులకర్ణి (12), ముషీర్ ఖాన్ (4), ప్రియాన్షు మోలియా (5) వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది.

ఈ సమయంలో ఇండియా అండర్ 19 ఇక గెలవడం అసాధ్యమనే అనుకున్నారంతా. కానీ ఈ టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్న సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహరన్ అద్భుతమైన పోరాటం చేశారు. ఓవైపు సచిన్ దాస్ వచ్చీరాగానే బౌండరీలతో సఫారీ బౌలర్లపై ఒత్తిడి పెంచగా.. మరోవైపు టోర్నీ టాప్ స్కోరర్ ఉదయ్ ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా కాపాడాడు.

చివర్లో ఉత్కంఠ

ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు ఏకంగా 171 పరుగులు జోడించారు. తీవ్ర ఒత్తిడిలోనూ ఈ ఇద్దరూ ఆడిన తీరు నిజంగా అభినందనీయం. ఈ క్రమంలో సెంచరీ ఖాయం అనుకున్న సమయంలో సచిన్ దాస్ 95 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ తో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఇండియా త్వరత్వరగా మరో రెండు వికెట్లు పడటంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.

అయితే క్రీజులో కెప్టెన్ ఉదయ్ ఉండటం.. చివర్లో వచ్చిన రాజ్ లింబానీ తొలి బంతినే సిక్స్ గా మలచడంతో టార్గెట్ సులువైంది. ఒక పరుగు అవసరం అయిన సమయంలో కెప్టెన్ ఉదయ్ కూడా ఔటయ్యాడు. అయితే లింబానీ తర్వాతి బంతికే గెలిపించాడు. అంతకుముందు సౌతాఫ్రికా అండర్ 19 టీమ్ ఓపెనర్ ప్రిటోరియస్ (76), మిడిలార్డర్ బ్యాటర్ రిచర్డ్ సెలెట్స్‌వానె (64) హాఫ్ సెంచరీలతో 50 ఓవర్లలో 5 వికెట్లకు 244 రన్స్ చేసింది.

ఆరోసారి అండర్ 19 వరల్డ్ కప్ దక్కుతుందా?

అండర్ 19 వరల్డ్ కప్ ను ఇండియా ఇప్పటి వరకూ ఐదుసార్లు గెలుచుకుంది. మరే ఇతర జట్టూ ఇన్నిసార్లు కప్పు గెలవలేదు. ఇక రికార్డు స్థాయిలో ఇప్పుడు 9వ సారి ఫైనల్ చేరింది. ఆరో టైటిల్ పై కన్నేసింది.

1988లో తొలిసారి జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ను 2000వ సంవత్సరంలో ఇండియా మొదటిసారి గెలిచింది. ఆ తర్వాత 2008, 2012, 2018, 2022లలోనూ విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు ఆరోసారి వరల్డ్ కప్ పై కన్నేసింది.

తదుపరి వ్యాసం