Under-19 Cricket World Cup 2024 Schedule: ఈ రోజు నుంచే అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్.. ఇండియా షెడ్యూల్ ఇదీ
Under-19 Cricket World Cup 2024 Schedule: మరో క్రికెట్ పండుగ మొదలు కానుంది. శుక్రవారం (జనవరి 19) నుంచి అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ సౌతాఫ్రికాలో ప్రారంభం కానుంది. ఇందులో ఇండియన్ టీమ్ షెడ్యూల్ ఒకసారి చూద్దాం.
Under-19 Cricket World Cup 2024 Schedule: క్రికెట్‌లో కొన్నేళ్లుగా ప్రతి ఏటా ఏదో ఒక వరల్డ్ కప్ వస్తూనే ఉంటోంది. గతేడాది సీనియర్ వన్డే వరల్డ్ కప్ జరగగా.. ఇప్పుడు అండర్ 19 మెన్స్ వరల్డ్ కప్ ప్రారంభం అవుతోంది. శుక్రవారం (జనవరి 19) నుంచి ఫిబ్రవరి 11 వరకూ సౌతాఫ్రికాలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇండియన్ టీమ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతోంది.
అండర్ 19 వరల్డ్ కప్ 2024లో భాగంగా మొత్తం 16 దేశాలు 24 రోజుల పాటు 41 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఫైనల్ ఫిబ్రవరి 11న జరుగుతుంది. వరల్డ్ కప్ తొలి రోజు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ వరల్డ్ కప్ వన్డే ఫార్మాట్లోనే జరగనుంది. అయితే టోర్నీ ఫార్మాట్ మాత్రం ఈసారి మారింది. ఒకసారి టోర్నీలోని టీమ్స్, ఫార్మాట్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలను చూద్దాం.
అండర్ 19 వరల్డ్ కప్ గ్రూపులు ఇవే..
అండర్ 19 వరల్డ్ కప్ లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియా గ్రూప్ ఎలో ఉంది.
గ్రూప్ ఎ: ఇండియా అండర్ 19, బంగ్లాదేశ్ అండర్ 19, ఐర్లాండ్ అండర్ 19, యూఎస్ఏ అండర్ 19
గ్రూప్ బి: ఇంగ్లండ్ అండర్ 19, స్కాట్లాండ్ అండర్ 19, సౌతాఫ్రికా అండర్ 19, వెస్టిండీస్ అండర్ 19
గ్రూప్ సి: ఆస్ట్రేలియా అండర్ 19, నమీబియా అండర్ 19, శ్రీలంక అండర్ 19, జింబాబ్వే అండర్ 19
గ్రూప్ డి: ఆఫ్ఘనిస్థాన్ అండర్ 19, నేపాల్ అండర్ 19, న్యూజిలాండ్ అండర్ 19, పాకిస్థాన్ అండర్ 19
అండర్ 19 వరల్డ్ కప్ ఫార్మాట్ ఏంటి?
ఈసారి 16 జట్లు పాల్గొనే అండర్ 19 వరల్డ్ కప్ లో నాలుగు గ్రూపులు ఉన్నాయి. అయితే వీటిలో ఒక్కో గ్రూపు నుంచి టాప్ 3 టీమ్స్ సూపర్ సిక్సెస్ కు అర్హత సాధిస్తాయి. మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపు నుంచి రెండేసి టీమ్స్ సెమీఫైనల్స్ కు వెళ్తాయి. నిజానికి 2022లో చివరిసారి జరిగిన అండర్ 19 మెన్స్ వరల్డ్ కప్ ఫార్మాట్ భిన్నంగా ఉండేది. ఈ తాజా ఫార్మాట్ ను గతేడాది వుమెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ లాగా రూపొందించారు.
అండర్ 19 వరల్డ్ కప్‌లో ఇండియా షెడ్యూల్ ఇదీ
అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. 2022లో చివరిసారి వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇండియా విజేతగా నిలిచింది. ఈసారి కూడా ఉదయ్ సహారన్ కెప్టెన్సీలోని యంగిండియా మరో టైటిల్ పై కన్నేసింది. ఇప్పటికే 2000, 2008, 2012, 2018, 2022లలో ఐదుసార్లు వరల్డ్ కప్ గెలిచిన ఘనత ఇండియన్ టీమ్ సొంతం. ఈసారి శనివారం (జనవరి 20) తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది.
జనవరి 20 - ఇండియా అండర్ 19 వెర్సెస్ బంగ్లాదేశ్ అండర్ 19
జనవరి 25 - ఇండియా అండర్ 19 వెర్సెస్ ఐర్లాండ్ అండర్ 19
జనవరి 28 - ఇండియా అండర్ 19 వెర్సెస్ యూఎస్ఏ అండర్ 19
ఇండియా మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లన్నీ బ్లూమ్‌ఫోంటేన్ లోని మాన్‌గవుంగ్ ఓవల్ గ్రౌండ్ లో జరుగుతుాయి.
అండర్ 19 వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్
అండర్ 19 వరల్డ్ కప్ మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానెల్స్ లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్ లను టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో.. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఫ్రీగా చూడొచ్చు.