Siraj on England Bazball: అలా అయితే రెండు రోజుల్లోపే మ్యాచ్ ముగిస్తాం: ఇంగ్లండ్‌కు సిరాజ్ వార్నింగ్
24 January 2024, 13:49 IST
- Siraj on England Bazball: ఇండియాలోనూ బజ్‌బాల్ స్టైల్ క్రికెట్ ఆడతామంటున్న ఇంగ్లండ్ టీమ్ కు పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వార్నింగ్ ఇచ్చాడు. అలా అయితే మ్యాచ్ ను రెండు రోజుల్లోపే ముగిస్తామని అతడు అనడం విశేషం.
కెప్టెన్ రోహిత్ శర్మతో పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్
Siraj on England Bazball: తన సొంతగడ్డ హైదరాబాద్ లో టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇండియన్ కండిషన్స్ లో ఇంగ్లండ్ టీమ్ బజ్‌బాల్ స్టైల్లో ఆడితే మ్యాచ్ ను ఒకటిన్నర లేదా రెండు రోజుల్లోనే ముగిస్తామని అతడు స్పష్టం చేశాడు.
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య గురువారం (జనవరి 25) నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
"ఇండియన్ కండిషన్స్ లో ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆడితే మ్యాచ్ ఒకటిన్నర, రెండు రోజుల్లోనే ముగుస్తుంది. ఇక్కడ బంతి టర్న్ అవుతుంది.. కొన్నిసార్లు నేరుగా వస్తుంది.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి బంతిని బాదడం అంత సులువు కాదు. అందుకే ఇక్కడ బజ్‌బాల్ కష్టమన్నది నా ఫీలింగ్. కానీ వాళ్లు అలాగే ఆడితే అది మాకు మంచిది. మ్యాచ్ త్వరగా అయిపోతుంది" అని సిరాజ్ అనడం విశేషం.
బెన్ స్టోక్స్ కెప్టెన్ గా, బ్రెండన్ మెకల్లమ్ కోచ్ గా ప్రత్యర్థులను బజ్‌బాల్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇంగ్లండ్ టీమ్. ఉపఖండం విషయానికి వస్తే పాకిస్థాన్ పర్యటనకు వచ్చి వాళ్లను కూడా 3-0తో కొట్టేశారు. అయితే ఇండియన్ పిచ్ లు మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. ఇక్కడ బంతి బాగా టర్న్ అవుతుంది. ఇండియన్ స్పిన్నర్లను ఇక్కడి పిచ్ లపై ఎదుర్కోవడమే కష్టం. అలాంటిది వాళ్ల బౌలింగ్ లో షాట్లు ఆడటం అంత సులువు కాదు.
చివరిసారి పన్నెండేళ్ల కింద ఇంగ్లండ్ చేతుల్లోనే స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన ఇండియా.. ఆ తర్వాత ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. స్వదేశంలో వరుసగా 16 టెస్టు సిరీస్ లు గెలవడం విశేషం. అందులో ఏడు క్లీన్ స్వీప్స్ ఉన్నాయి. ఈ 12 ఏళ్లలో మొత్తం 44 టెస్టులు స్వదేశంలో ఆడిన ఇండియన్ టీమ్.. కేవలం మూడింట్లో మాత్రమే ఓడిపోయింది.
బజ్‌బాలే ఆడతాం: ఇంగ్లండ్
ఇండియన్ టీమ్ నుంచి వార్నింగ్స్ వస్తున్నా తాము మాత్రం బజ్‌బాలే ఆడతామని ఇంగ్లండ్ టీమ్ చెబుతోంది. ఆ టీమ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ మ్యాచ్ కు ముందు మాట్లాడాడు. "మేము రక్షణాత్మకంగా ఆడతామని అనుకోవడం లేదు. అటాకింగ్ ఆడటానికే ప్రయత్నిస్తాం. ఒత్తిడిని తట్టుకుంటూ కాస్త డ్రామా క్రియేట్ చేసి తర్వాత అటాక్ చేస్తాం" అని వుడ్ అన్నాడు.
ఇండియాను స్వదేశంలో ఓడించడం మాత్రం పెద్ద సవాలే అని అతడు అంగీకరించాడు. అందుకే ఓ ఫ్రీహిట్ లాగా ఈ సిరీస్ ను ప్రయత్నిద్దామని అనుకుంటున్నామని, ఈసారి కాస్త భిన్నంగా ఆడదలచుకున్నట్లు చెప్పాడు.