Shoaib Bashir Visa: ఆ ఇంగ్లండ్ యువ స్పిన్నర్‌కు ఇండియన్ వీసా.. అయినా విమర్శిస్తూనే ఉన్న ఇంగ్లిష్ టీమ్
24 January 2024, 21:01 IST
- Shoaib Bashir Visa: ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ కు ఇండియా వీసా ఎట్టకేలకు దక్కింది. అయినా ఇంగ్లండ్ టీమ్ మాత్రం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. వీసా ఆలస్యం కావడంతో అతడ తొలి టెస్టుకు దూరమయ్యాడు.
ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ షోయబ్ బషీర్
Shoaib Bashir Visa: ఇండియాతో ఇంగ్లండ్ తొలి టెస్టు ప్రారంభానికి ఒక రోజు ముందు బుధవారం (జనవరి 24) ఆ టీమ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ కు ఇండియన్ వీసా దక్కింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
అతనికి వీసా ఆలస్యం కావడంతో అబు దాభి వరకూ ఇంగ్లండ్ టీమ్ తో కలిసి వచ్చిన బషీర్.. తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీంతో అతడు హైదరాబాద్ లో జరగబోయే తొలి టెస్టుకు దూరమయ్యాడు.
ఇంగ్లండ్ టీమ్ విమర్శలు
తమ ప్లేయర్ షోయబ్ బషీర్ వీసా ఆలస్యం కారణంగా తొలి టెస్టుకు దూరమవడంతో ఇంగ్లండ్ టీమ్ విమర్శలు గుప్పిస్తోంది. బుధవారం అతనికి వీసా లభించిన తర్వాత కూడా ఆ టీమ్ వెనక్కి తగ్గడం లేదు. బషీర్ ఈ వీకెండ్ ఇండియాకు రానున్నాడు. అతడు రెండో టెస్ట్ నుంచి జట్టుకు అందుబాటులో ఉంటాడని ఈసీబీ వెల్లడించింది.
20 ఏళ్ల షోయబ్ బషీర్ పాకిస్థాన్ సంతతికి చెందిన ఇంగ్లండ్ ప్లేయర్. అతనికి వీసా దక్కకపోవడం పెద్ద దుమారం రేపింది. ఇది నిజంగా చాలా నిరాశ కలిగించిందని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ అయితే బషీర్ కు వీసా దక్కే వరకూ సిరీస్ వాయిదా వేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.
నిజానికి బషీర్ కు వీసా దక్కే వరకూ తాము కూడా ఇండియా వెళ్లకూడదని అనుకున్నట్లు స్టోక్స్ చెప్పాడు. కానీ చివరికి షెడ్యూల్ ప్రకారమే ఇండియాకు వచ్చామని, అయితే బషీర్ కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం మాత్రం తమకు చాలా బాధ కలిగించిందని అన్నాడు. పాకిస్థాన్ సంతతి ఇంగ్లిష్ ప్లేయర్స్ కు ఇలా వీసా కష్టాలు ఎదురవడం ఇదే తొలిసారి కాదని బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా అనడం గమనార్హం.
2019లోనూ ఇంగ్లండ్ ఎ టీమ్ తరఫున ఇండియాకు రావాల్సిన పాకిస్థాన్ సంతతి ఇంగ్లండ్ ప్లేయర్ సాఖిబ్ మహమూద్ కూడా వీసా రాకపోవడంతో రాలేకపోయాడు. బషీర్ కు వీసా దక్కకపోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. అతని పరిస్థితి తనకూ బాధ కలిగిస్తోందని, అయితే ఇలా ఎందుకు జరిగిందో చెప్పడానికి తాను వీసా కార్యాలయంలో లేనని అతడు అనడం విశేసం.
ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు గురువారం (జనవరి 25) హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ముగ్గురు స్పిన్నర్లతో ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుది జట్టును అనౌన్స్ చేసింది. ఇండియా మాత్రం ఇంకా తుది జట్టును ప్రకటించలేదు. విరాట్ కోహ్లి స్థానంలో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
టాపిక్