England Playing XI vs India: ఇంగ్లండ్ టీమ్‌లో ముగ్గురు స్పిన్నర్లు.. తొలి టెస్ట్ ఆడే తుది జట్టు ఇదే-england playing xi vs india for first test three spinners make the cut ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  England Playing Xi Vs India: ఇంగ్లండ్ టీమ్‌లో ముగ్గురు స్పిన్నర్లు.. తొలి టెస్ట్ ఆడే తుది జట్టు ఇదే

England Playing XI vs India: ఇంగ్లండ్ టీమ్‌లో ముగ్గురు స్పిన్నర్లు.. తొలి టెస్ట్ ఆడే తుది జట్టు ఇదే

Hari Prasad S HT Telugu
Jan 24, 2024 02:17 PM IST

England Playing XI vs India: టీమిండియాతో గురువారం (జనవరి 25) నుంచి హైదరాబాద్ లో జరగబోయే తొలి టెస్టు కోసం ఇంగ్లండ్ తమ తుద్ది జట్టును అనౌన్స్ చేసింది. ఇందులో ముగ్గురు స్పిన్నర్లు ఉండటం విశేషం.

ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (AFP)

England Playing XI vs India: ఇండియాతో జరగబోయే తొలి టెస్ట్ కోసం ఒక రోజు ముందుగానే ఇంగ్లండ్ తమ తుది జట్టును అనౌన్స్ చేసింది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో గురువారం (జనవరి 25) నుంచి ఈ టెస్ట్ ప్రారంభం కానుండగా.. బుధవారమే (జనవరి 24) జట్టును ప్రకటించారు.

తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు కల్పించారు. కేవలం ఒకే ఒక్క పేస్ బౌలర్ మార్క్ వుడ్ కు మాత్రమే చోటు కల్పించడం గమనార్హం. ఇండియా స్పిన్ ఛాలెంజ్ కోసం తాము సిద్ధమని ఇంగ్లండ్ చెప్పకనే చెప్పింది.

ముగ్గురు యువ స్పిన్నర్లు

ఇంగ్లండ్ తమ తుది జట్టులో ముగ్గురు యువ స్పిన్నర్లకు చోటు కల్పించింది. ఇందులో ఇద్దరు లెఫ్టామ్ స్పిన్నర్లు జాక్ లీచ్, టామ్ హార్ట్‌లీతోపాటు ఒక లెగ్ స్పిన్నర్ రేహాన్ అహ్మద్ ఉన్నారు. ఇక మార్క్ వుడ్ రూపంలో ఒకే ఒక్క పేస్ బౌలర్ ఉన్నాడు. 41 ఏళ్ల సీనియన్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కు ఇంగ్లండ్ తుది జట్టులో చోటు దక్కలేదు.

అంతటి అనుభవం ఉన్న పేసర్ ను పక్కన పెట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోందంటే ఇంగ్లండ్ టీమ్ ఉద్దేశమేంటో స్పష్టమవుతూనే ఉంది. కచ్చితంగా తొలి రోజు నుంచే స్పిన్ అయ్యే పిచ్ లే ఎదురవుతాయని నమ్ముతున్న ఇంగ్లండ్.. ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియాకు సవాలు విసరబోతోంది. అయితే ఈ యువ స్పిన్నర్లు సీనియర్ ఇండియన్ బ్యాటర్లను ఎంత మేర కట్టడి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ కు అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లండ్ టీమ్ వికెట్ కీపింగ్ బాధ్యతలను బెన్ పోక్స్ కు అందించింది. జానీ బెయిర్ స్టో కూడా మిడిలార్డర్ లో బ్యాటర్ గా తుది జట్టులో ఉన్నాడు. ఆ టీమ్ బ్యాటింగ్ లైనప్ మాత్రం బలంగా ఉంది. సీనియర్ జో రూట్ తోపాటు క్రాలీ, డకెట్, పోప్, స్టోక్స్ లాంటి వాళ్లు ఆ టీమ్ లో ఉన్నారు.

ఇంగ్లండ్ యువ స్పిన్నర్ హార్ట్‌లీ గురించి ఆ టీమ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ స్పందించాడు. అతడు ఇండియన్ బౌలర్ అక్షర్ పటేల్ తో అతన్ని పోల్చాడు. "అతడు అక్షర్ లాంటి బౌలరే. పెద్దగా స్పిన్ చేయడు. తాను పెద్దగా స్పిన్ చేయాల్సిన అవసరం లేదని అక్షర్ భావిస్తాడు. పెద్దగా టర్న్ కాని బంతితోనే ఔట్ చేయాలని చూస్తాడు" అని పనేసర్ చెప్పాడు.

మరోవైపు ఇండియాతో సిరీస్ లోనూ తాము బజ్‌బాల్ కే కట్టుబడి ఉంటామని పేస్ బౌలర్ మార్క్ వుడ్ చెప్పాడు. తాను రక్షణాత్మకంగా ఆడబోమని అతడు అన్నాడు. అలా అయితే మ్యాచ్ రెండు రోజుల్లోపే ముగుస్తుందని టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తొలి టెస్ట్ హైదరాబాద్ లో జనవరి 25 నుంచి 29 వరకూ జరగనుంది.

ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రేహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్

Whats_app_banner