Team India: ‘హైదరాబాద్ టెస్టులో రోహిత్ అలా చేయాలి’: సునీల్ గవాస్కర్ సూచనలు-rohit sharma need to use bowlers cleverly says sunil gavaskar ahead of india vs england test series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: ‘హైదరాబాద్ టెస్టులో రోహిత్ అలా చేయాలి’: సునీల్ గవాస్కర్ సూచనలు

Team India: ‘హైదరాబాద్ టెస్టులో రోహిత్ అలా చేయాలి’: సునీల్ గవాస్కర్ సూచనలు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 21, 2024 10:48 PM IST

Team India: ఇంగ్లండ్‍తో స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‍కు భారత్ రెడీ అవుతోంది. హైదరాబాద్‍లో తొలి టెస్టు జరగనుంది. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మకు దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశారు.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (PTI)

Team India: అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍ను టీమిండియా ఇటీవల క్లీన్ స్వీప్ చేసింది. 3-0తో గెలిచి సిరీస్‍ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‍ను సమం చేసుకున్నాక.. స్వదేశంలో అఫ్గాన్‍ను రోహిత్ శర్మ సేన చిత్తు చేసింది. తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్‍తో ఐదు టెస్టుల సిరీస్‍లో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. టెస్టు చాంపియన్‍షిప్ సైకిల్‍లో ముఖ్యమైన ఈ సిరీస్‍కు ప్లాన్‍లను సిద్ధం చేసుకుంటోంది. కాగా, ఇంగ్లండ్‍తో భారత టెస్టు సిరీస్‍కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ కెప్టెన్, దిగ్గజం సునీల్ గవాస్కర్ కొన్ని సూచనలు చేశారు.

భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు హైదరాబాద్‍ వేదికగా జనవరి 25వ తేదీన మొదలుకానుంది. ఈ సిరీస్‍లో కెప్టెన్ రోహిత్ శర్మ.. భారత్‍కు మంచి ఆరంభాలు అందిస్తాడని సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. అలాగే, హైదరాబాద్ టెస్టులో బౌలర్లను చాలా రోహిత్ శర్మ తెలివిగా ఉపయోగించుకోవాలని స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో గవాస్కర్ చెప్పారు. అందుకు కారణాన్ని కూడా వివరించారు.

హైదరాబాద్ పిచ్‍లో టర్న్ అంతగా ఉండదని, అందుకే బౌలర్లను రోహిత్ శర్మ తెలివిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుందని గవాస్కర్ అన్నారు. “కెప్టెన్‍గా రోహిత్ శర్మ తన బౌలర్లను చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సాధారణంగా హైదరాబాద్‍లో అంతగా టర్న్ ఉండదు. ఒకవేళ ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసి.. లంచ్ వరకు మంచి ఆరంభాన్ని అందుకుంటే.. బౌలర్లను రోహిత్ ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి” అని గవాస్కర్ చెప్పారు.

ఓపెనర్‌గా వచ్చే రోహిత్ శర్మ రాణిస్తే.. తర్వాత వచ్చే బ్యాటర్ల పని సులువు అవుతుందని సునీల్ గవాస్కర్ చెప్పారు. “చెన్నైలో (2021లో) రోహిత్ శర్మ శతకం చేశాడు. అది చాలా మంచి సెంచరీ. స్పిన్‍కు సహకరించే పిచ్‍పై ఎలా ఆడాలో రోహిత్ చూపించాడు. ఒకవేళ అతడు అలాగే బ్యాటింగ్ చేయడం కొనసాగిస్తే.. భారత్‍కు తప్పకుండా మంచి ఆరంభాలు దక్కుతాయి. దాని వల్ల మూడు, నాలుగు స్థానాల్లో వచ్చే బ్యాటర్లకు సులభతరం అవుతుంది” అని గవాస్కర్ అన్నారు.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25న మొదలు కానుంది. హైదరాబాద్‍లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ఫస్ట్ టెస్టు జరుగుతుంది. విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ఫిబ్రవరి 02 నుంచి 6వ తేదీ వరకు జరగనుంది. మూడో టెస్టు 15 నుంచి 19 వరకు రాజ్‍కోట్‍లో జరగనుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రాంచీలో, సిరీస్‍లో చివరిదైన ఐదో టెస్టు ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి 11వ తేదీ వరకు ఉండనుంది.

ఇంగ్లండ్‍తో ఐదు టెస్టుల సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍లకు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. యువ వికెట్ కీపింగ్ బ్యాటర్ ధృవ్ జురెల్‍కు తొలిసారి భారత జట్టులో చోటు లభించింది.

ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు ఎంపికైన భారత్ జట్టు: శుభ్‍మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‍ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్

IPL_Entry_Point

సంబంధిత కథనం